స్కూల్ యూనిఫాంలు రెడీ!

స్కూల్ యూనిఫాంలు రెడీ!
  •      కుట్టుపని 85 శాతం పూర్తి
  •     5 జిల్లాల్లో వంద శాతం కంప్లీట్
  •     దేశంలో తొలిసారిగా మహిళా సంఘాలకు అప్పగించిన సర్కారు
  •     స్టిచింగ్  కూలీ రూ.75కు పెంపు
  •     త్వరలోనే స్టూడెంట్లకు యూనిఫాంలు పంపిణీ

హైదరాబాద్, వెలుగు: మహిళా సంఘాలకు అప్పగించిన విద్యార్థుల స్కూల్  యూనిఫాం స్టిచింగ్  పనులు 85 శాతం పూర్తయ్యాయి. ఈ నెల 12 నుంచి రాష్ర్టవ్యాప్తంగా బడులు స్టార్ట్  కానున్న నేపథ్యంలో త్వరలోనే స్టూడెంట్లకు యూనిఫాంలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.  రెసిడెన్షియల్, వెల్ఫేర్  స్కూళ్లలో ఈ డ్రెస్ లను పంపిణీ చేయనున్నారు. రాష్ర్టంలో 64 లక్షల మంది మహిళా సంఘ సభ్యులు ఉండగా..  9,768 విలేజ్  ఆర్గనైజేషన్లు ఉన్నాయి.

 వారికి 15,30,603 యూనిఫాంలు కుట్టాలని ప్రభుత్వం ఆదేశించగా, ఇప్పటి వరకు 13 లక్షలకు పైగా యూనిఫాంలు (85 శాతం) పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో మిగతా స్కూల్  యూనిఫాంల స్టిచింగ్  పూర్తవుతుందని తెలిపారు. భూపాలపల్లి, మేడ్చల్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్  జిల్లాల్లో వంద శాతం పని పూర్తయిందని చెప్పారు. కామారెడ్డి, సంగారెడ్డి, రంగారెడ్డి, నిజామాబాద్ లో  70 శాతంలోపు పూర్తయిందని వెల్లడించారు. కాగా.. ఇప్పటి వరకు ఒక జతకు రూ.50 ఇస్తుండగా ఇటీవల ఆ కూలిని రూ.75కు పెంచుతూ సీఎస్  శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు

. ఈ ఏడాది మార్చిలో పరేడ్ గ్రౌండ్ లో మహిళా సంఘాలతో సీఎం రేవంత్  రెడ్డి సమావేశం అయిన సందర్భంగా స్కూల్  డ్రెస్ కుట్టు కూలి పెంచాలని మహిళా సంఘాల ప్రతినిధులు సీఎంను కోరగా అందుకు ఆయన అంగీకరించారు. లోక్ సభ ఎన్నికల సమయంలో కోడ్  రావడంతో కూలి పెంపు వాయిదా పడగా ఈ నెల 7న కూలి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మహిళా సంఘాలకు మంత్రి సీతక్క అభినందనలు

స్కూల్ డ్రెస్ ల స్టిచింగ్  పనులను మహిళా సంఘాలకు ఇవ్వడం దేశంలో తెలంగాణలోనే తొలిసారి అని పంచాయతీ రాజ్  శాఖ మంత్రి ధనసరి సీతక్క ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గడువు కన్నా ముందే 85 శాతం యూనిఫాంలను కుట్టడంపై మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ మహిళా సంఘాల సభ్యులను అభినందించారు. మహిళా  సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చామని, అలాగే రూ.10 లక్షల ప్రమాద బీమాతో పాటు సభ్యురాలు మరణిస్తే రూ.2 లక్షల లోన్ ను మాఫీ చేస్తున్నామని మంత్రి చెప్పారు. త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు.