కరోనా కేసులు తక్కువున్న చోట స్కూళ్లు తెరవొచ్చు

కరోనా కేసులు తక్కువున్న చోట స్కూళ్లు తెరవొచ్చు

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి భయంతో దేశంలో గతేడాది మార్చి నుంచి స్కూళ్లు మూసేసి ఉన్నాయి. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న వార్తల నేపథ్యంలో ఇప్పట్లో బడులు తెరిచే అవకాశాలు కనిపించడం లేదు. ఈ విషయంపై ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా స్పందించారు. కరోనా కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లను రీఓపెన్ చేయాలని గులేరియా సూచించారు. ‘కరోనా కేసులు తక్కువగా ఉన్న జిల్లాల్లో స్కూళ్లను తెరవాలని నా సూచన. పాజిటివిటీ రేటు 5 శాతం లోపు ఉన్న ఏరియాల్లో బడులను ప్రణాళికాబద్ధంగా తెరవాలి. స్కూళ్ల తెరిచివేతపై ప్రభుత్వ అధికారులు పని చేస్తున్నారు. స్కూళ్ల తెరచివేత దిశగా ప్రభుత్వాలు, అధికారులు కృషి చేయాలి. ఇప్పటికే పిల్లలు ఎంతో కోల్పోయారు. ముఖ్యంగా ఆన్‌లైన్ క్లాసులకు హాజరుకాలేని అట్టడుగు వర్గాల పిల్లలు జ్ఞానం పరంగా చాలా నష్టపోతున్నారు’ అని గులేరియా ఆవేదన వ్యక్తం చేశారు.