వచ్చే నెలలో స్కూల్స్.. ఫస్ట్ నెల మొత్తం పాత పాఠాలే..

వచ్చే నెలలో స్కూల్స్.. ఫస్ట్ నెల మొత్తం పాత పాఠాలే..
  • ఫస్ట్​ నెల పాత పాఠాలే..
  • స్కూల్స్ స్టార్ట్ అయ్యాక పోయినేడాది పాఠాలే బోధన
  • స్టూడెంట్లను గాడిన పెట్టెందుకు విద్యాశాఖ చర్యలు

హైదరాబాద్, వెలుగు: వచ్చే నెలలో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో స్టూడెంట్లను దానికి సమాయత్తం చేసే పనిలో విద్యాశాఖ పడింది. ఈయేడు స్టూడెంట్లు కొత్త క్లాసులో జాయిన్ అయినా, నెల రోజుల పాటు పాత క్లాస్ పాఠాలె విననున్నారు. సబ్జెక్టుల మీద గ్రిప్​ పెంచేందుకు, ఆ పాఠాలను టీవీల ద్వారానే కొనసాగించనున్నారు. దీనికి సంబంధించిన కసరత్తును స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చేస్తున్నారు.

ఆ ఎఫెక్ట్​ పడొద్దని..

రాష్ట్రంలో కరోనా తీవ్రతతో 2019–20 అకడమిక్ ఇయర్ చివరి నెలన్నర ముందే ముగియగా, 2020–21 విద్యాసంవత్సరం దాదాపు అంతా టీవీ, ఆన్​లైన్​లోనే క్లాసులు జరిగాయి. రానున్న 2021–22 విద్యాసంవత్సరం కూడా కొంతకాలం టీవీ పాఠాలే కొనసాగనున్నాయి. చాలారోజులుగా ఫిజికల్ క్లాసులకు దూరమైన స్టూడెంట్లను, మళ్లీ బడి వైపు మళ్లించడం టీచర్లకు కష్టమైన పనే.. దీనికి తోడు 2020–21 పూర్తిగా ఆన్​లైన్ పాఠాలే జరగ్గా, ఇవి సగం మంది కూడా సరిగా వినలేదని అధికారులే చెప్తున్నారు. ఈక్రమంలో ఆ తరగతి సబ్జెక్టులపై స్టూడెంట్లకు పెద్దగా పట్టుండే అవకాశం లేదు. దీని ప్రభావం నెక్స్ట్​క్లాసులపై పడే అవకాశముంది. దీంతో అకడమిక్ ఇయర్ ప్రారంభం కాగానే, ముందుగా నెల రోజుల పాటు పోయినేడాది  క్లాసు పాఠాలే స్టూడెంట్లకు బోధించాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు నిర్ణయించారు. ఉదాహరణకు నైన్త్ క్లాస్ పూర్తయి టెన్త్​లోకి వచ్చే స్టూడెంట్లకు మళ్లీ 9వ తరగతిలోని ముఖ్య పాఠాలే నెల రోజుల పాటు చెప్పనున్నారు. దీనిద్వారా పిల్లలకు చదువుపై కాస్త ఆసక్తి పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమైన చాప్టర్లతో ఆన్​లైన్, టీవీ పాఠాలను సిద్ధం చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో చాప్టర్లు ఎంపిక చేసే పనిలో ఆఫీసర్లు ఉన్నారు. నెల రోజుల పాత క్లాసులు పాఠాలు పూర్తయిన తర్వాత, కొత్త తరగతి పాఠాలు స్టార్ట్ చేయనున్నారు.