నేటి (జూన్ 12) నుంచి స్కూళ్లు రీఓపెన్.. బడిబాట పట్టనున్న 61 లక్షల మంది పిల్లలు

నేటి (జూన్ 12) నుంచి స్కూళ్లు రీఓపెన్.. బడిబాట పట్టనున్న 61 లక్షల మంది పిల్లలు
  • ఈ ఏడాది 210 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ క్లాసులు

హైదరాబాద్, వెలుగు: సమ్మర్ హాలీడేస్ ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి. మొత్తం 61 లక్షలకు పైగా విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. స్కూళ్లు రీఓపెన్ అవుతున్న గురువారం రోజునే సర్కారు బడుల్లోని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పలు బడుల్లో విద్యార్థులకు ఘనంగా స్వాగతం చెప్పేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. రాష్ట్రంలో సర్కారు, ప్రైవేట్ కలిపి మొత్తం 41,354 స్కూళ్లు ఉండగా, వాటిలో 61.99 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.

ప్రైవేట్లో11 వేలకు పైగా స్కూళ్లు ఉండగా.. 36.87 లక్షల మంది స్టూడెంట్లు ఉన్నారు. మిగిలిన వారంతా గవర్నమెంట్ స్కూళ్లలో ఉన్నారు. అయితే, సర్కారు బడుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 6 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. దీంట్లో భాగంగా స్కూళ్లు రీఓపెన్ అవుతున్న గురువారం నాడే పాఠ్యపుస్తకాలు, యూ నిఫామ్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్ అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రజాప్రతినిధులు, అధికారుల చేతు ల మీదుగా వీటిని స్టూడెంట్లకు అందజేయనున్నారు.

210 బడుల్లో ప్రీప్రైమరీ క్లాసులు.. 
రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా 210 ప్రైమరీ స్కూళ్లలో ప్రీప్రైమరీ క్లాసులు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి రిలీజ్ చేశారు.

5,651 బడుల్లో ఏఐ పాఠాలు.. 
ఈ విద్యాసంవత్సరం మరో 5,651 స్కూళ్లలో కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఆయా ప్రైమరీ స్కూళ్లలో ఏఐ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నారు.