కరోనాతో ముప్పు లేదు..భయపడొద్దు!

కరోనాతో ముప్పు లేదు..భయపడొద్దు!
  • భయపడొద్దు.. జాగ్రత్తలు పాటిస్తే చాలంటున్న సైంటిస్టులు
  • చైనాలోని ప్రస్తుత వేరియంట్లన్నీ మన దేశంలోకి ఎప్పుడో వచ్చినయ్​
  • ఒమిక్రాన్​ కన్నా ఎక్స్​బీబీ, బీఎఫ్​ 7 వేరియంట్లు బలహీనం
  • మన దగ్గర థర్డ్​ వేవ్​లోనే ప్రతి ఇంటిని టచ్​ చేసిపోయిన  ఒమిక్రాన్​
  • మనలోని హెర్డ్​ ఇమ్యూనిటీ, వ్యాక్సిన్లే రక్షణ కవచాలు
  • కొత్త వేవ్​లు వచ్చే అవకాశం లేదంటున్న ఎక్స్‌‌పర్ట్స్‌‌


హైదరాబాద్, వెలుగు:  కరోనాతో చైనా సహా పలు దేశాలు భయపడుతున్నా..  మన దేశంలో మాత్రం ఎలాంటి ముప్పు ఉండదని సైంటిస్టులు, డాక్టర్లు చెప్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. మన దేశంలో మళ్లీ వేవ్‌‌లు రావని, పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యే అవకాశాలు లేవని అంచనా వేస్తున్నారు. చైనాలో ప్రబలుతున్న వేరియంట్లన్నీ పాతవేనని, అవన్నీ మన దేశంలో, మన రాష్ట్రంలో ఎప్పట్నుంచో ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. ఇండియాలో థర్డ్‌‌ వేవ్‌‌కు కారణమైన ఒమిక్రాన్ వేరియంట్‌‌ నుంచి వచ్చిన సబ్ వేరియంట్లకే ఇవి సబ్ వేరియంట్లని వివరిస్తున్నారు. పైగా మన దేశ ప్రజల్లో హెర్డ్​ ఇమ్యూనిటీ పెరిగిందని, వ్యాక్సినేషన్​ డ్రైవ్​ కూడా ఫలించిందని, దీంతో కొత్త వేరియంట్లతో ముప్పు ఉండదని సైంటిస్టులు అంటున్నారు. అయితే.. రద్దీ ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాస్క్​లు పెట్టుకోవడం వంటి రూల్స్​ పాటిస్తే మంచిదని సూచిస్తున్నారు. 

ఎక్స్​బీబీ, బీఎఫ్​ 7 డేంజర్​ కాదు

మన దేశంలో ఒమిక్రాన్‌‌ వేరియంట్ సాధారణ ప్లూ లెక్క వచ్చిపోవడం చూశాం. ఇప్పుడు దాని థర్డ్ జనరేషన్ వేరియంటైన ఎక్స్‌‌బీబీ వేరియంట్‌‌, బీఎఫ్‌‌7 వేరియంట్‌‌ వల్లే చైనాలో కేసులు పెరుగుతున్నాయి. కానీ, ఆ వేరియంట్లు మన దేశంలో ఒమిక్రాన్ కంటే బలహీనంగా ఉన్నాయి. ఎక్స్‌‌‌‌బీబీ వేరియంట్‌‌‌‌ను డబ్ల్యూహెచ్‌‌‌‌వో ప్రమాదకర వేరియంట్‌‌‌‌గా ప్రకటించింది. అయితే.. మన దేశంలో, మన రాష్ట్రంలో మూడు నెలల నుంచి నమోదవుతున్న కేసుల్లో 60 శాతం ఎక్స్‌‌‌‌బీబీ వేరియంట్‌‌‌‌ బాపతువే ఉన్నాయి. వాటి వల్ల కేసుల సంఖ్య పెరగలేదు. హాస్పిటలైజేషన్, డెత్స్‌‌‌‌ కూడా లేవు. ఈ లెక్కన ఎక్స్‌‌‌‌బీబీ వేరియంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్లు అంటున్నారు. ప్రచారంలో ఉన్న మరో వేరియంట్ బీఎఫ్‌‌‌‌ 7. దీన్ని ఈ ఏడాది జూన్‌‌‌‌లో యూరప్ దేశాల్లో గుర్తించారు. ఆ తర్వాతి నెలలో విడుదలైన డబ్ల్యూహెచ్‌‌‌‌వో రిపోర్ట్‌‌‌‌లో ఈ వేరియంట్ గురించి పేర్కొన్నారు. కానీ, ప్రమాదకర వేరియంట్ల జాబితాలో దీన్ని చేర్చలేదు. ఇటీవల విడుదలైన డబ్ల్యూహెచ్‌‌‌‌వో వీక్లీ రిపోర్ట్‌‌‌‌లోనూ దీన్నొక మైల్డ్ వేరియంట్‌‌‌‌గానే చూపించారు. 4 నెలల నుంచి ఈ వేరియంట్ మన దేశంలో ఉంది. గడిచిన ఆరు నెలల్లో  యూరప్ దేశాల నుంచి ఎంతో మంది మన దేశానికి వచ్చి వెళ్లారు. ఒకవేళ బీఎఫ్‌‌‌‌ 7 ప్రమాదకర వేరియంట్ అయి ఉంటే, ఇప్పటికే దాని ప్రభావం మనకు తెలిసిపోయేదని, కానీ అలాంటి సూచనలు ఏవీ కనిపించడం లేదని డాక్టర్లు చెప్తున్నారు.  ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఓ డాక్టర్ పెట్టిన వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా సర్క్యులేట్ అవుతున్నది.

చైనాలో ఎందుకా పరిస్థితి?

జీరో కొవిడ్ పాలసీ పేరిట ఇన్నాళ్లూ చైనా ప్రభుత్వం తమ ప్రజలపై పెద్ద ఎత్తున కొవిడ్​ ఆంక్షలు విధించింది. వైరస్‌‌‌‌ ఒకరి నుంచి ఒకరికి స్ర్పెడ్ అవకుండా జనాన్ని చాలాకాలం ఇండ్లకు పరిమితం చేసింది. అయితే.. వాళ్లకు సహజంగా రావాల్సిన  ఇమ్యూనిటీ ఇలా ఎక్కువ కాలం ఇండ్లకే పరిమితం అవడంతో రాలేదు. ప్రభుత్వ ఆంక్షలతో విసిగిపోయిన చైనా ప్రజలు, అక్కడి సర్కార్‌‌‌‌‌‌‌‌పై తిరగబడ్డారు. నవంబర్ చివరి వారంలో రోడ్లపైకి వచ్చి భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ వ్యతిరేకతతో డిసెంబర్ మొదటివారం నుంచి చైనా సర్కార్ ఆంక్షలు సడలిస్తూ వచ్చింది. క్వారంటైన్ క్యాంపులు బంద్ పెట్టింది. దీంతో ఇప్పుడు జనాలు ఒక్కసారిగా ఫ్రీగా బయట తిరుగుతుండటంతో సహజంగానే వైరస్ వ్యాపించి, కేసులు పెరుగుతున్నాయి. దీనికి తోడు చైనా ప్రజలకు ఇచ్చిన వ్యాక్సిన్లు నాసిరకంగా ఉన్నాయని, వాటి వల్ల వచ్చిన ఇమ్యూనిటీ ఎక్కువ రోజులు ఉండడం లేదని, వైరస్‌‌‌‌ వ్యాప్తికి ఇది కూడా ఓ కారణమని సైంటిస్టులు చెప్తున్నారు. యూరప్ దేశాల్లోనూ ఎక్కువగా చైనా మేడ్ వ్యాక్సిన్లనే వాడారు. ఇలా రకరకాల కారణాలతో చైనాలో, మరికొన్ని దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. కానీ, మన దేశంలో పరిస్థితి అలా లేదు. మన దగ్గర ఫస్ట్ వేవ్‌‌‌‌లో మాత్రమే స్ట్రిక్ట్ లాక్‌‌‌‌డౌన్ ఉంది. ఆ తర్వాత వేవ్​లప్పుడు కొన్ని రోజులు లాక్​డౌన్​ పెట్టి.. మళ్లీ జనాలను ప్రభుత్వాలు ఫ్రీగా వదిలేశాయి. ప్రతి వేవ్‌‌‌‌లోనూ జనాలు వైరస్‌‌‌‌ బారినపడ్డారు. థర్డ్ వేవ్‌‌‌‌లో  దాదాపు ప్రతి ఇంటినీ ఒమిక్రాన్ చుట్టొచ్చింది. మనకు అప్పటికే  హెర్డ్ ఇమ్యూనిటీ రావడంతో సర్ది మాదిరిగా ఒమిక్రాన్​ వచ్చిపోయిందే తప్పితే, హాస్పిటలైజేషన్, డెత్స్ జరగలేదని డాక్టర్లు గుర్తుచేస్తున్నారు.

93 శాతం జనాల్లో యాంటిబాడీస్

నిరుడు డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ మన దేశంలో ఒమిక్రాన్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదయ్యాయి. ఆ తర్వాత ఐసీఎంఆర్‌‌‌‌–‌‌‌‌-ఎన్‌‌‌‌ఐఎన్‌‌‌‌ సైంటిస్టులు కలిసి సీరో సర్వే చేశారు. మన రాష్ట్రంలో 330 గ్రామాల్లో సర్వే జరిగింది. ఈ సర్వే ప్రకారం మన రాష్ట్రంలోని 93 శాతం మందిలో కొవిడ్ యాంటిబాడీస్ ఉన్నట్టు తేలింది. దేశ జనాభాలో సుమారు 70 శాతం మందిలో యాంటిబాడీస్ ఉన్నట్టు ఐసీఎంఆర్ తేల్చింది. ఆ తర్వాత కూడా కరోనా వ్యాక్సినేషన్ జరిగింది. కోట్ల మంది జనాలు సెకండ్ డోసు, బూస్టర్‌‌‌‌ డోసు వ్యాక్సిన్లు‌‌‌‌ వేసుకున్నారు. ఇప్పటికీ అడపాదడపా వ్యాక్సినేషన్ జరగుతున్నది. ఎప్పటికప్పుడు వాటి ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా సర్వేలు చేయిస్తోంది. ఐసీఎంఆర్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఎన్‌‌‌‌ఐఎన్‌‌‌‌ సైంటిస్టులు మన రాష్ట్రంలో సర్వేలు జరుపుతున్నారు. అవసరమైతే మరోసారి ఎన్‌‌‌‌ఐఎన్‌‌‌‌తో రాష్ట్రంలో సర్వే చేయించాలని ఆరోగ్యశాఖ భావిస్తున్నది.

ఆ పరిస్థితి అస్సలే రాదు

చైనాలో వాళ్ల దేశంలో తయారైన వ్యాక్సిన్లనే వినియోగించారు. వాటి ఎఫికసీ మీద మొదట్నుంచీ అనుమానాలు ఉన్నాయి. అక్కడ ‘జీరో కొవిడ్’ పాలసీ కూడా బూమ్‌‌‌‌రాంగ్ అయింది. ఆ పరిస్థితులు ఏవీ మన దేశంలో లేవు. మన దగ్గర వాడిన వ్యాక్సిన్లను ప్రపంచవ్యాప్తంగా యాక్సెప్ట్ చేశారు. ఈ ఇయర్ జనవరి, ఫిబ్రవరిలో ఒమిక్రాన్ వేరియంట్ స్ర్పెడ్‌‌‌‌ అయింది. మైల్డ్ సింప్టమ్స్ తప్పితే జనాలకేమీ ఇబ్బంది అవలేదు. ఇప్పుడొచ్చే వేరియంట్లతో కూడా ఏం ఇబ్బంది ఉండకపోవచ్చు. చైనా వంటి పరిస్థితి అస్సలే రాదు.
- డాక్టర్ శ్రీధర్, జనరల్ ఫిజీషియన్, సత్యశ్రీ మెడికల్ సర్వీసెస్