రాష్ట్రపతి కోటాలో నామినేట్

రాష్ట్రపతి కోటాలో నామినేట్
  • రాజ్యసభకు విజయేంద్ర ప్రసాద్ 
  • ఇళయరాజా, పీటీ ఉషా, వీరేంద్ర హెగ్డే కూడా.. 
  • రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేసిన కేంద్రం 
  • నలుగురూ దక్షిణాది రాష్ట్రాల ప్రముఖులే.. 

నలుగురు దక్షిణాది రాష్ట్రాల ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది. రాష్ట్రపతి కోటాలో సంగీత విద్వాంసుడు ఇళయరాజా, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్, పరుగుల రాణి పీటీ ఉషా, సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్డేకు అవకాశం కల్పించింది. ఈ నలుగురికి ప్రధాని మోడీ  ట్విట్టర్​లో అభినందనలు తెలిపారు.

న్యూఢిల్లీ, వెలుగు:  నలుగురు దక్షిణాది రాష్ట్రాల ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది. రాష్ట్రపతి కోటాలో సంగీత విద్వాంసుడు ఇళయరాజా, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్, పరుగుల రాణి పీటీ ఉషా, సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్డేలకు అవకాశం కల్పించింది. ఈ మేరకు బుధవారం ప్రధాని మోడీ ట్విట్టర్​లో వెల్లడించారు. క్రీడా రంగంలో పీటీ ఉషా, కళా  విభాగంలో ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్, సామాజిక సేవ రంగంలో వీరేంద్ర హెగ్డేలకు చాన్స్ ఇచ్చినట్లు తెలిపారు. వీళ్ల నలుగురికీ అభినందనలు తెలుపుతూ, ఆయా రంగాల్లో వాళ్లు చేసిన సేవలను కొనియాడుతూ మోడీ ట్వీట్లు చేశారు. ‘‘విజయేంద్ర ప్రసాద్ గారు దశాబ్దాలుగా సృజనాత్మక రంగంతో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు. అతని రచనలు దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయి. ఆయన రాజ్యసభకు నామినేట్ అయినందుకు నా అభినందనలు” అంటూ మోడీ తెలుగులోనే ట్వీట్ చేశారు. 

1,400 సినిమాలకు ఇళయరాజా మ్యూజిక్​

ఇళయరాజా మద్రాస్ ప్రెసిడెన్సీలోని పణ్నైపురంలో 1943 జూన్‌‌ 3న పుట్టారు. 14 ఏండ్ల నుంచే తన అన్నయ్య నడిపే మ్యూజికల్ ట్రూప్‌‌తో కలిసి పని చేశారు. ఓ ప్రొఫెసర్ దగ్గర వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్‌‌లో టెక్నిక్స్ నేర్చుకున్నారు. ఇన్‌‌స్ట్రుమెంటల్ పర్‌‌‌‌ఫార్మెన్స్ గురించి స్టడీ చేశారు. కర్నాటక సంగీతాన్ని అవపోసన పట్టారు. క్లాసికల్ గిటార్‌‌‌‌లో గోల్డ్ మెడల్ సాధించారు. లండన్‌‌లోని ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌‌ నుంచి సంగీత దర్శకుడు జీకే వెంకటేష్‌‌ దగ్గర అసిస్టెంట్‌‌గా పని చేసే అవకాశం సంపాదించారు. పలు సినిమాలకి అసిస్టెంట్‌‌గా పని చేశాక, 1976లో ‘అన్నక్కిళి’ అనే సినిమాకి సోలో మ్యూజిక్ డైరెక్టర్‌‌‌‌గా పని చేసే చాన్స్ దొరికింది. తమిళ సినీ చరిత్రలో దీన్నో కల్ట్ క్లాసిక్‌‌గా చెబుతుంటారు. ఆ చిత్రానికి వర్క్ చేసిన తర్వాత ఇక వెనుదిరిగి చూసుకోలేదు. మ్యూజిక్ నలభై రెండేళ్ల కెరీర్‌‌‌‌లో 1,400కు పైగా సినిమాలకు సంగీతాన్ని సమకూర్చారు. 7 వేలకి పైగా పాటలకు సంగీతం ఇచ్చారు. 20 వేలకు పైగా కాన్సర్ట్స్ నిర్వహించారు. 4 సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. 1988లో అప్పటి తమిళనాడు సీఎం కరుణానిధి.. ఇళయరాజాకి ఇసైజ్ఞాని (సంగీత జ్ఞాని) అనే బిరుదు ఇచ్చారు. కేంద్రం పద్మవిభూషణ్, పద్మభూషణ్​తో సత్కరించింది. 

ఇండియన్‌‌ ట్రాక్‌‌ అండ్‌‌ ఫీల్డ్‌‌ క్వీన్‌‌ ఉష

ఇండియా లెజెండరీ అథ్లెట్లలో పీటీ ఉష ఒకరు. కేరళ కోజికోడ్‌‌ జిల్లాలో చిన్న కుగ్రామంలో జన్మించిన ఆమె.. తన పరుగుతో ఇండియా అథ్లెటిక్స్‌‌పై చెరగని ముద్ర వేసింది. దేశంలో ఎంతో మంది క్రీడాకారులు, ముఖ్యంగా అమ్మాయిలు ట్రాక్‌‌ అండ్‌‌ ఫీల్డ్‌‌ అథ్లెటిక్స్‌‌ను తమ కెరీర్‌‌గా ఎంచుకునేందుకు స్ఫూర్తిగా నిలిచింది. 1994 ఒలింపిక్స్‌‌లో 400మీ. హర్డిల్స్‌‌లో  0.01 సెకండ్‌‌ తేడాతో నాలుగో స్థానంలో నిలిచి తృటిలో  బ్రాంజ్‌‌ మెడల్‌‌ చేజార్చుకుంది. అయినా తన మెరుపు వేగంతో ఇంటర్నేషనల్‌‌ టోర్నీల్లో 100కు పైగా పతకాలు సాధించి ఎంతో పేరు తెచ్చుకుంది. ఏషియన్‌‌ చాంపియన్‌‌షిప్స్‌‌లో 13 గోల్డ్‌‌ మెడల్స్‌‌ గెలిచిన ఆమె.. 1986 ఆసియా క్రీడల్లో నాలుగు బంగారు పతకాలు కైవసం చేసుకొని లెజెండరీ అథ్లెట్‌‌గా ఎదిగింది. ఈ క్రమంలో  పలుసార్లు నేషనల్‌‌, ఏషియన్‌‌ రికార్డులు బద్దలు కొట్టి  ‘ఇండియన్‌‌ ట్రాక్‌‌ అండ్‌‌ ఫీల్డ్‌‌ క్వీన్‌‌’గా పేరు తెచ్చుకుంది. రిటైర్మెంట్‌‌ తర్వాత  ప్రపంచ స్థాయి సౌకర్యాలతో  కోజికోడ్‌‌లో ‘ఉష స్కూల్ ఆఫ్‌‌ అథ్లెటిక్స్‌‌’ పేరిట అకాడమీ ఏర్పాటు చేసిన ఆమె ఎంతో మంది యువ క్రీడాకారులను తీర్చిదిద్దుతోంది. టింటూ లుకా, జిస్నా మాథ్యూ వంటి ప్రతిభావంతులైన అథ్లెట్లను దేశానికి అందించింది.  

సామాజిక సేవకుడు హెగ్డే.. 

వీరేంద్ర హెగ్డే కర్నాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల ఆలయ ధర్మాధికారి. ఆయనకు 20 ఏండ్లున్నప్పటి నుంచి సేవలందిస్తున్నారు. దాదాపు 5 దశాబ్దాలుగా ఆధ్యాత్మికంగా, సామాజికంగా సేవ చేస్తున్నారు. పల్లెల అభివృద్ధి కోసం, యూత్ కు స్వయం ఉపాధి కల్పించేందుకు రూరల్ డెవలప్ మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ పెట్టారు. శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పెట్టి 25 కాలేజీలు, స్కూళ్లలో చదువు చెప్పిస్తున్నారు. తన సేవలకు గాను 2015 పద్మ విభూషణ్ అవార్డు దక్కింది.

రచయితగా తనదైన ముద్ర వేసిన విజయేంద్రప్రసాద్

‘బాహుబలి’ రచయితగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన విజయేంద్రప్రసాద్ పూర్తి పేరు కోడూరి వెంకట విజయేంద్రప్రసాద్. ఆంధ్రప్రదేశ్‌‌లోని కొవ్వూరు ఆయన స్వస్థలం.‘జానకి రాముడు’కి తన అన్న, కీరవాణి తండ్రి శివశక్తిదత్తాతో కలిసి స్క్రిప్ట్ రాసిన విజయేంద్రప్రసాద్.. ఆ తర్వాత ‘బంగారు కుటుంబం’తో సోలో రైటర్‌‌‌‌గా సక్సెస్ అయ్యారు. బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి తదితర హిట్ చిత్రాలకు ఆయనే రైటర్. ఇక తన కొడుకు రాజమౌళి దర్శకుడయ్యాక ఆయన సినిమాలకి కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు యమదొంగ, మగధీర, బాహుబలి, ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ సినిమాలకి తన కలంతో బలం చేకూర్చారు. ఇతర భాషల్లోనూ తన పెన్ పవర్‌‌ చూపించారు. సల్మాన్‌‌ ఖాన్‌‌ భజ్‌‌రంగీ భాయీజాన్, కంగనా రౌనత్ మణికర్ణిక, తలైవి, జాగ్వార్, మెర్సల్‌‌ లాంటి చిత్రాలకు స్క్రిప్ట్ రాశారు. మరోవైపు దర్శకుడిగానూ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్నతో కలిసి ‘అర్ధాంగి’ సినిమా తీశారు. ఆ తర్వాత శ్రీకృష్ణ 2006, రాజన్న, శ్రీవల్లి చిత్రాలను తెరకెక్కించారు. అటు టీవీ రంగంలోనూ అడుగుపెట్టారు. 2017లో టెలికాస్ట్ అయిన ‘ఆరంభ్: కహానీ దేవసేనాకీ’ అనే సీరియల్‌‌కి స్ర్కిప్ట్ అందించారు.