మనీ విషయంలో మహిళలే యాక్టివ్

మనీ విషయంలో మహిళలే యాక్టివ్

న్యూఢిల్లీ: మహిళలు ఇప్పుడు అన్నింట్లో ముందుంటున్నారు.  మేల్‌‌ డామినేటెడ్‌‌గా ఉండే ఆర్థిక పరమైన విషయాల్లోనూ మహిళలే చాలా జాగ్రత్తగా ఉంటున్నారని, సేవింగ్స్ విషయాల్లో యాక్టివ్‌‌గా ఉంటున్నట్టు స్క్రిప్‌‌బాక్స్ సర్వే వెల్లడించింది. 68 శాతం మంది మహిళలు తమ ఫైనాన్స్‌‌లను సొంతంగా హ్యాండిల్ చేసుకుంటున్నట్టు పేర్కొంది. కుటుంబాల్లో ఆర్థికపరమైన నిర్ణయాలను కూడా చాలా చాకచక్యంగా నిర్వహిస్తున్నట్టు తెలిపింది. కేవలం 10 శాతం కంటే తక్కువ మంది మహిళలు మాత్రమే తమ ఫైనాన్సియల్ నిర్ణయాలను కుటుంబంలోని మగవారికి వదిలేస్తున్నారని స్క్రిప్‌‌బాక్స్ సర్వే వివరించింది. స్క్రిప్‌‌బాక్స్ అనేది ఆన్‌‌లైన్ ఫైనాన్సియల్ సర్వీసెస్ కంపెనీ. నెలవారీ సేవింగ్స్‌‌లో చాలా జాగ్రత్తగా ఉంటున్నట్టు సర్వేలో పాల్గొన్న మెజార్టీ మహిళలు(80 శాతం మంది వరకు) చెప్పారు. కానీ కేవలం 30 శాతం మంది మాత్రమే మ్యూచువల్ ఫండ్స్‌‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.

స్క్రిప్‌‌బాక్స్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ సర్వే చేసింది. దేశవ్యాప్తంగా 600 మందికి పైగా మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారు. వారిలో 70 శాతం మంది మిలీనియల్స్‌‌ కాగా, 24 శాతం మంది జనరేషన్‌‌ఎక్స్‌‌కు చెందినవారు. మిగిలిన వారు 50 ఏళ్ల పైబడిన వారు ఉన్నారు.  ఆశ్చర్యకరంగా మహిళలు.. అవగాహన గల పెట్టుబడిదారులుగా(శావీ ఇన్వెస్టర్స్‌‌గా) కూడా ఉంటున్నట్టు సర్వే గుర్తించింది. ‘ఉమెన్‌‌ సేవ్, మెన్ ఇన్వెస్ట్’ అనే కాన్సెప్ట్‌‌ను మహిళలు బద్దలు కొడుతున్నారు. అనాదిగా వస్తోన్న చాలా విషయాలను బ్రేక్ చేస్తూ.. తమ పర్సనల్ ఫైనాన్స్ విషయాలను మహిళలే చక్కబెట్టుకుంటున్నట్టు సర్వే గుర్తించింది.

డిజిటల్ ఛానల్స్ ద్వారా నేర్చుకుంటున్నారు…

డిజిటల్ ఛానల్స్ ద్వారా పర్సనల్ ఫైనాన్స్ విషయాలను మహిళలు తెలుసుకుంటున్నారు. తమ నాలెడ్జ్‌‌ పెంచుకోవడానికి  డిజిటల్ ఛానళ్లపై ఆధారపడుతున్నట్టు 47 శాతం మంది రెస్పాండెంట్లు తెలిపారు. పర్సనల్ ఫైనాన్స్ విషయంలో ఏమైన సందేహాలున్నా.. డిజిటల్ ఛానళ్ల ద్వారానే సలహాలు, సూచనలను పొందుతున్నారు. మహిళలు ఖర్చు మాత్రమే పెడతారు, వారికి ఆర్థిక విషయాలు ఏం తెలియవు అని అనాదిగా వస్తోన్న కామెంట్లను సర్వేలో పాల్గొన్న మెజార్టీ మహిళలు కొట్టిపారేశారు. ఎలా తమ మనీని తాము మేనేజ్‌‌ చేసుకోవాలనే విషయంపై మహిళలు ఆసక్తిగా ఉన్నట్టు తమ సర్వేలో వెల్లడైందని స్క్రిప్‌‌బాక్స్ కో ఫౌండర్ ప్రతీక్ మెహతా చెప్పారు.

ఇంట్లో ఓపెన్‌‌గా చర్చించుకోవాలి….

వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడాన్ని ఎంత వీలైతే అంత త్వరగా ప్రారంభించాలని  యువతరానికి ఈ సర్వేలో పాల్గొన్న 64 శాతం మంది  రెస్పాండెంట్లు సూచించారు. దీంతో పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్టింగ్‌‌పై  పట్టు పెరుగుతుందని పేర్కొన్నారు. మనీ మేనేజ్‌‌మెంట్‌‌ను స్కూల్ కరిక్యులమ్‌‌లో యాడ్ చేయాలని 31 శాతం మంది మహిళలు కోరారు. ఇంట్లో కూడా మనీ విషయాల్లో ఓపెన్‌‌గా చర్చించుకోవాలని, అప్పుడే దాని ప్రాధాన్యత తెలుస్తుందని సుమారు 20 శాతం మంది రెస్పాండెంట్లు అన్నారు. వర్క్‌‌ప్లేసెస్‌‌ కూడా ఫైనాన్సియల్ ఎడ్యుకేషన్‌‌ను యాక్టివ్‌‌గా ప్రమోట్ చేయాలని 18 శాతం మంది రెస్పాండెంట్లు పేర్కొన్నట్టు స్క్రిప్‌‌బాక్స్ సర్వే తెలిపింది.మహిళలు పర్సనల్​ ఫైనాన్స్​కు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొంది.

బోర్డుల్లోనూ హవా పెరిగింది..

కంపెనీ బోర్డుల్లో మహిళా డైరెక్టర్ల సంఖ్య పెరుగుతోంది. గతేడాది కంటే ఈ ఏడాది 14 శాతం పెరిగింది. ఈ క్రమంలో బోర్డుల్లో మహిళా సభ్యులున్న విషయంలో గ్లోబల్‌‌గా ఇండియా ర్యాంక్‌‌ 12గా ఉంది.ఈ విషయాన్ని మైహైరింగ్‌‌క్లబ్.కామ్, సర్కారి–నౌకరి.ఇన్ఫోల స్టడీ వెల్లడించింది. ‘ఉమెన్ ఆన్ బోర్డు 2020’ అనే దానిపై ఇవి సర్వే చేపట్టాయి. ఈ స్టడీలో ఇండియాతో సహా 36 దేశాల నుంచి 7,824 లిస్టెడ్ కంపెనీలు పాల్గొన్నాయి.  ఇండియా నుంచి 628 లిస్టెడ్ కంపెనీలు ఈ స్టడీలో పాలుపంచుకున్నాయి. ఈ లిస్టెడ్ కంపెనీల్లో 55 శాతం మంది మహిళా డైరెక్టర్లున్నారు. గతేడాదితో పోలిస్తే 14 శాతం ఎక్కువగా ఉన్నారు. మొత్తంగా గ్లోబల్‌‌గా ఉన్న కంపెనీ బోర్డుల్లో మహిళల సంఖ్య 14.87 శాతంగా ఉంది. గత రెండేళ్లతో పోలిస్తే ఈ సంఖ్య రెండింతలకు పైగా పెరిగింది. ఈ స్టడీ ప్రకారం, బోర్డుల్లో మహిళా డైరెక్టర్లున్న విషయంలో నార్వే టాప్‌‌లో ఉండగా.. ఆ తర్వాత స్వీడన్, ఫిన్‌‌లాండ్, జర్మనీ, సౌతాఫ్రికా, యూఎస్ ఉన్నాయి.