ఇన్​సైడర్​ ట్రేడింగ్​ రూల్స్​ సవరించిన సెబీ

ఇన్​సైడర్​ ట్రేడింగ్​ రూల్స్​ సవరించిన సెబీ

న్యూఢిల్లీ: మ్యూచువల్​ ఫండ్స్ అమ్మకాలు, కొనుగోళ్లనూ ఇన్​సైడర్​ ట్రేడింగ్​ రూల్స్​ కిందకి తెచ్చినట్లు సెబీ ప్రకటించింది. ఇందుకోసం ఇన్​సైడర్​ ట్రేడింగ్​ రూల్స్​ను సవరించినట్లు వెల్లడించింది. లిస్టెడ్​ కంపెనీల షేర్ల అమ్మకాలు, కొనుగోళ్లకు మాత్రమే ఇప్పటిదాకా ఇన్​సైడర్​ ట్రేడింగ్​ రూల్స్​ అమలు చేస్తున్నారు. మ్యూచువల్​ ఫండ్ల యూనిట్లను ఇప్పటిదాకా సెక్యూరిటీస్​ డెఫినిషన్​ పరిధిలోకి తేలేదు.

ఫ్రాంక్లిన్​ టెంపుల్​టన్​ ఉదంతం నేపథ్యంలో తాజాగా మ్యూచువల్​ పండ్లను కూడా ఇన్​సైడర్​ ట్రేడింగ్​ రూల్స్​ పరిధిలోకి తెచ్చారు. ఫ్రాంక్లిన్​ టెంపుల్​టన్​లోని కొంత మంది సీనియర్​ ఉద్యోగులు తమకున్న  ముందస్తు సమాచారంతో యూనిట్లను రిడీమ్​ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో  పబ్లిష్​ కాని ముందస్తు సమాచారం ఏదైనా అందుబాటులో ఉన్న వ్యక్తులు మ్యూచువల్​ ఫండ్​ స్కీముల యూనిట్లలో ట్రేడింగ్​ చేయడానికి వీలు లేదని సెబీ కొత్త రూల్స్​ తెచ్చింది.

తన  మ్యూచువల్​ ఫండ్​ స్కీములలో ఉన్న యూనిట్ల వివరాలను ఎసెట్​ మేనేజ్​మెంట్​ కంపెనీలు తాజా రూల్స్​ కింద స్టాక్​ ఎక్స్చేంజీల ప్లాట్​ఫామ్​పై  వెల్లడి చేయాల్సి ఉంటుంది. మ్యూచువల్​ ఫండ్​ కంపెనీలలోని ఉద్యోగుల కోసం కోడ్​ ఆఫ్​ కాండక్ట్​నూ ప్రకటించింది. ఈ కొత్త రూల్స్​ను సెబీ ​ నవంబర్​ 24 నుంచి అమలులోకి తెచ్చింది.