
న్యూఢిల్లీ: ఫిజిక్స్‌వాలా, సాత్విక్ గ్రీన్ ఎనర్జీతో సహా ఏడు కంపెనీలు ఐపీఓకి వచ్చేందుకు సెబీ ఆమోదం పొందాయి. వినిర్ ఇంజనీరింగ్, ప్రణవ్ కన్‌స్ట్రక్షన్స్, ఫుజియామా పవర్ సిస్టమ్స్, ఎస్‌ఐఎస్ క్యాష్ సర్వీసెస్, అన్లోన్ హెల్త్‌కేర్ ఈ లిస్టులో ఉన్నాయి. ఈ కంపెనీలు ఈ ఏడాది జనవరి–-ఏప్రిల్ మధ్య తమ ప్రాథమిక ఐపీఓ పత్రాలను దాఖలు చేశాయి. ఈ ఏడాది జులై 14–-18 మధ్య సెబీ నుంచి అనుమతులు పొందాయి. అయితే, గౌడియం ఐవీఎఫ్ అండ్ విమెన్ హెల్త్ జనవరిలో దాఖలు చేసిన ఐపీఓ పత్రాలను ఉపసంహరించుకుంది.
శ్రీ లోటస్ డెవలపర్స్..
ప్రముఖ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియాకు వాటాలున్న రియల్ ఎస్టేట్ కంపెనీ శ్రీ లోటస్ డెవలపర్స్ తన రూ.792 కోట్ల ఐపీఓ కోసం షేరు ప్రైస్ బ్యాండ్‌ను రూ.140–రూ.150 గా నిర్ణయించింది. ఈ ఐపీఓ పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) లేదు. పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్ ఈ నెల30న ప్రారంభమై ఆగస్టు 1న ముగుస్తుంది.
ఎన్‌ఎస్‌డీఎల్ ఐపీఓ ఈ నెల 30న ఓపెన్..
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌డీఎల్) ఐపీఓ ఈ నెల 30న ఓపెన్ కానుంది. ఆగస్టు 1 న ముగుస్తుంది. ఈ పబ్లిక్ ఇష్యూ సైజ్ రూ.4 వేల కోట్లు. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం బిడ్డింగ్ ఈ నెల 29న ఓపెన్‌లో ఉంటుంది. ఈ ఐపీఓలో కేవలం ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మాత్రమే ఉంది. షేర్ హోల్డర్లు 5.01 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.