
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్లపై పెట్టుబడిదారులకు మరింత స్పష్టత, పారదర్శకత అందించడానికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. మ్యూచువల్ ఫండ్ పథకాల కేటగిరైజేషన్ (వర్గీకరణ)ను మరోసారి పరిశీలించాలని నిర్ణయించింది. ఒకే రకమైన పెట్టుబడి వ్యూహాలతో నడిచే పథకాల వల్ల ఏర్పడుతున్న గందరగోళాన్ని తొలగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని సెబీ శుక్రవారం వెల్లడించింది.
ప్రస్తుతం కొన్ని మ్యూచువల్ ఫండ్ పథకాల పోర్ట్‌ఫోలియోల మధ్య దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి. దీనివల్ల పెట్టుబడిదారులు, ముఖ్యంగా కొత్త వారికి, వివిధ పథకాల మధ్య తేడాను గుర్తించడం కష్టంగా మారింది. ఇది పెట్టుబడి నిర్ణయాలను ప్రభావితం చేయడమే కాకుండా, పోర్ట్‌ఫోలియోలో అనవసరమైన రిస్కుకు దారితీస్తోంది. 2017లో సెబీ మ్యూచువల్ ఫండ్ వర్గీకరణకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది.
అప్పట్లో ఒక ఫండ్ హౌస్ ఒక కేటగిరీ కింద ఒక పథకాన్ని మాత్రమే ప్రారంభించాలని రూల్ పెట్టింది. ప్రస్తుతం ఉన్న రూల్స్‌ను మరింత పటిష్టం చేసి, ఫండ్ల మధ్య ఉన్న ఓవర్‌లాప్‌ను తగ్గించాలని సెబీ భావిస్తోంది. దీనివల్ల ఫండ్ల పేర్లు, వాటి పెట్టుబడి వ్యూహాలను సులువుగా గుర్తించవచ్చు. తద్వారా పెట్టుబడిదారులు తమ ఆర్థిక లక్ష్యాలకు, రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా సరైన పథకాలను ఎంచుకోగలుగుతారు.