పోలింగ్ కేంద్రాల్లో సౌలత్లు కల్పించాలి..కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు ఎస్ఈసీ ఆదేశం

పోలింగ్ కేంద్రాల్లో సౌలత్లు కల్పించాలి..కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు ఎస్ఈసీ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా ప్రతి పోలింగ్ స్టేషన్‌‌లో కనీస సౌలత్​లు(బేసిక్ మినిమమ్ ఫెసిలిటీస్) కల్పించాలని కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో గుర్తించిన పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించింది.

 క్యూలో నిల్చునే ఓటర్లకు ఎండ, వానల నుంచి రక్షణ కల్పించేందుకు టెంట్లు ఏర్పాటు చేయాలి. ప్రతి పోలింగ్ స్టేషన్‌‌లో స్త్రీలు, పురుషులకు వేర్వేరుగా టాయ్​లెట్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలి. పోలింగ్ స్టేషన్‌‌లో సరైన వెలుతురు ఉండేలా చూడాలి. వృద్ధులు, దివ్యాంగులు అనారోగ్యంతో ఉన్న ఓటర్లు సులభంగా లోపలికి వెళ్లడానికి ర్యాంప్ ఏర్పాటు చేయాలి. 

పారా మెడికల్ సిబ్బందితోపాటు అవసరమైన మందులు కలిగిన ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలి. అవసరమైన ఓటర్లకు వీల్ చైర్లు అందించాలి. పోలింగ్ సిబ్బందికి, ఓటర్లకు విశ్రాంతి కోసం తగిన సంఖ్యలో కుర్చీలు, టేబుల్స్ ఏర్పాటు చేయాలి.

గుర్తుల కేటాయింపు.. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలకు గుర్తులు కేటాయిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణి కుముదిని ఉత్తర్వులు జారీ చేశారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల కోసం ఆయా పార్టీల నుంచి బరిలో దిగనున్న అభ్యర్థులు ఈ గుర్తులపై పోటీ చేసే అవకాశం ఉంటుంది. 

రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద జాతీయ పార్టీలుగా గుర్తిపు పొందిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి హస్తం, బీజేపీకి  కమలం, బీఎస్పీకి ఏనుగు, ఆమ్ ఆద్మీ పార్టీ కి చీపురు, సీపీఎంకు సుత్తి, కొడవలి నక్షత్రం, ప్రాంతీయ రాజకీయ పార్టీలుగా గుర్తింపు పొందిన బీఆర్ఎస్ కు కారు, ఎంఐఎంకు గాలిపటం గుర్తులను కేటాయించారు.