పదేండ్లలో సెకండ్ హ్యాండ్‌‌‌‌ కార్ల మార్కెట్‌‌‌‌..8.30 లక్షల కోట్లకు

పదేండ్లలో సెకండ్ హ్యాండ్‌‌‌‌ కార్ల మార్కెట్‌‌‌‌..8.30 లక్షల కోట్లకు
  •     ఏడాదికి 15 శాతం చొప్పున వృద్ధి
  •     ఐదేళ్లలో అందుబాటులోకి ఎలక్ట్రిక్ కార్లు
  •     ఎస్‌‌‌‌యూవీలకు కొనసాగుతున్న డిమాండ్‌‌‌‌: కార్స్‌‌‌‌24  సీఈఓ విక్రమ్‌‌‌‌

న్యూఢిల్లీ : దేశంలో సెకండ్‌ హ్యాండ్  కార్ల (యూజ్డ్‌‌‌‌ కార్ల) మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది.  వచ్చే పదేళ్లలో దీని సైజ్ ఏకంగా 100 బిలియన్ డాలర్ల (రూ.8.3 లక్షల కోట్ల) కు పెరుగుతుందని కార్స్‌‌‌‌24 సీఈఓ విక్రమ్ చోప్రా అంచనా వేస్తున్నారు. కార్లకు సంబంధించి కస్టమర్లు తరచూ అప్‌‌‌‌గ్రేడ్ చేసుకోవాలని చూస్తున్నారని చెప్పారు. ‘మా ఇంటర్నల్ సర్వే ప్రకారం, యూజ్డ్ కార్‌‌‌‌‌‌‌‌ మార్కెట్ ఏడాదికి 15 శాతం చొప్పున వృద్ధి చెందుతుంది. 2023 లో 25 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ మార్కెట్ సైజ్‌‌‌‌ 2034 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది’ అని చోప్రా పేర్కొన్నారు. 

యూజ్డ్ కార్ మార్కెట్‌‌‌‌ పెరగడానికి  అర్బనైజేషన్‌‌‌‌, మిడిల్ క్లాస్ పెరుగుతుండడం కారణమని అభిప్రాయపడ్డారు. కన్జూమర్ల ఆలోచన విధానాలు మారుతున్నాయని, బండ్లు కొనుక్కోవడంపై ఆసక్తి చూపుతున్నారని అన్నారు.  ఎనిమిదేళ్ల కిందట  కార్స్‌‌‌‌24 మొదలైనప్పుడు దేశంలో యూజ్డ్ కార్ల మార్కెట్ సైజ్ 10–15 బిలియన్ డాలర్లు దగ్గర ఉండేదని చోప్రా గుర్తు చేశారు.  ‘గత మూడునాలుగేళ్ల నుంచి డిఫరెంట్ కార్లు మార్కెట్‌‌‌‌లోకి వస్తున్నాయి. యూజ్డ్‌‌‌‌ కార్ల మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది’ అని వివరించారు.  ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో కార్ ఓనర్‌‌‌‌‌‌‌‌షిప్ ఇంకా చాలా తక్కువగా ఉందని అన్నారు.

 ‘యూఎస్‌‌‌‌, చైనా, యూరప్‌‌‌‌లో 80–90 శాతం ప్రజల దగ్గర కార్లు ఉంటాయి. ఇండియాలో మాత్రం కేవలం 8 శాతం మంది దగ్గరే కార్లు ఉన్నాయి’ అని చోప్రా వెల్లడించారు. మార్కెట్ మరింతగా విస్తరించడానికి బోలెడు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 

రూ.8 లక్షల కంటే ఎక్కువ విలువున్న కార్లకు..

యువత ఎక్కువ కాలం పాటు కార్లను మెయింటైన్ చేయడం లేదు. కొన్న ఐదు నుంచి ఆరేళ్లలో అమ్మేస్తున్నారు. యూజ్డ్ కార్ల మార్కెట్ విస్తరించడానికి ఇదొక కారణమని చోప్రా చెబుతున్నారు. అదే 20 ఏళ్ల క్రితం కార్లను సగటున 10–12 ఏళ్ల పాటు వాడుకునేవారని ఆయన అన్నారు.  ‘యంగర్ జనరేషన్ కార్లను ఎప్పటికప్పుడు అప్‌‌‌‌గ్రేడ్‌‌‌‌ చేస్తుండడంతో యూజ్డ్ కార్ల మార్కెట్‌‌‌‌లోకి సప్లయ్  కొనసాగుతోంది. హై క్వాలిటీ కార్లు పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంటున్నాయి’ అని వివరించారు. అలానే ఎస్‌‌‌‌యూవీలకు డిమాండ్ పెరిగిందని  అన్నారు.  

యూజ్డ్ కార్ల మార్కెట్‌‌‌‌లో కూడా ఎస్‌‌‌‌యూవీల హవా కొనసాగుతోంది. గత మూడేళ్ల నుంచి  ఎస్‌‌‌‌యూవీల సేల్స్‌‌‌‌ 4–6 శాతం చొప్పున గ్రోత్ నమోదు చేస్తున్నాయి. ‘ 2018 –2023 మధ్య రూ.8 లక్షల  కంటే ఎక్కువ విలువున్న కార్ల అమ్మకాలు 14 శాతం పెరిగాయి. మిడిల్‌‌‌‌ క్లాస్ ఆదాయాలు పెరగడంతోనే యూజ్డ్ కార్ల సేల్స్ పెరిగాయని చెప్పొచ్చు’ అని చోప్రా వివరించారు. యూజ్డ్ కార్ల అమ్మకాలు మెట్రో సిటీల్లో ఎక్కువగా జరుగుతున్నా, నాన్ మెట్రో సిటీలకు కూడా ఈ ట్రెండ్  విస్తరిస్తోంది. వచ్చే ఐదేళ్లలో ఎలక్ట్రిక్ కార్లు కూడా యూజ్డ్ కార్ల మార్కెట్‌‌‌‌లో అందుబాటులోకి వస్తాయని చోప్రా అంచనా వేశారు.