
2027 నాటికి ఏటా 80 లక్షలకు
వెలుగు బిజినెస్ డెస్క్: సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు 2027 నాటికి డబుల్ అవుతాయని అంచనా. ఈ సేల్స్ 80 లక్షల యూనిట్లకు చేరతాయని భావిస్తున్నారు. కరోనా తర్వాత ప్రజలు సొంత వాహనాలు వాడటానికే ఎక్కువ ఇష్టపడుతుండటమే దీనికి కారణమని అంటున్నారు. సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ చాలా వరకు అన్ఆర్గనైజ్డ్గానే ఉండేది. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ రాకతో ఈ పరిస్థితి మారి, ట్రాన్సపరన్సీ పెరిగింది. ఫలితంగా సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలు మరింత సులభంగా మారిందని ఎనలిస్టులు చెబుతున్నారు.
వెంటనే కావాలంటే ఈ రూటే బెస్ట్....
రామక్రిష్ణ దేశిరాజు ముంబైలో ఒక అడ్వర్టైజ్మెంట్ ప్రొఫెషనల్. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ కొనాలనేది ఆయన ఆలోచన. ఇందుకోసం రిసెర్చ్ చేస్తుంటే, తాను కావాలనుకునే రూ. 20 లక్షల విలువైన కొత్త కారు డెలివరీ కోసం ఆరు నుంచి 9 నెలలు వెయిట్ చేయాల్సి ఉంటుందని ఆయన తెలుసుకున్నారు. రకరకాల మోడల్స్ చూసిన తర్వాత యూజ్డ్ కార్ షోరూమ్ నుంచి రామక్రిష్ణ మహీంద్రా ఎక్స్‌యూవీ 500 వేరియంట్‌ను రూ. 12.5 లక్షలకు కొనుగోలు చేశారు. నేను కారు వెంటనే కావాలనుకున్నాను. కరోనా వైరస్వల్ల అంతకు ముందు కంటే కొంత జాగ్రత్తగా ఉండాలని ఆలోచించాను.
వీకెండ్ ట్రిప్‌లకు, పెట్స్ తీసుకెళ్లడానికి సరిపోయేలా ఒక వెహికల్‌ను నేను కావాలనుకున్నాను. ఎక్స్‌యూవీ 500 ఈ అవసరాలకు సరిగ్గా సరిపోయిందని రామక్రిష్ణ చెప్పారు. మరో ముంబై బిజినెస్ మేన్ సచిన్ మాయేకర్ తన భార్య కోసం పెద్ద సెడాన్ కొందామనుకున్నారు. కొత్తదైతే రూ. 25–28 లక్షలవుతుందని, 2014 మోడల్ హ్యుందాయ్ ఎలంట్రా సెకండ్ హ్యాండ్ కారును రూ. 6.5 లక్షలకు కొన్నారు. కొత్త వెహికల్కైతే రూ. 4 లక్షలు డౌన్పేమెంట్తోపాటు, ఆర్టీవో రిజిస్ట్రేషన్ ఖర్చులు, ట్యాక్సులు, ఇన్సూరెన్స్ అన్నీ కలిపి తడిసిమోపెడవుతుంది. అందుకే ఈ సెకండ్ హ్యాండ్ కారు కొనడం జాక్‌పాట్‌గా భావిస్తున్నానని సచిన్ మాయేకర్ పేర్కొన్నారు. మంచి కండిషన్తోపాటు, తక్కువ దూరమే తిరిగిన సెకండ్ హ్యాండ్ కారు దొరికితే మంచి డీల్ అవుతుందని మాయేకర్ చెప్పారు. కరోనాకి ముందు నుంచే దేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ పుంజుకుంటోంది.
ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ జోరు...
కరోనా టైములో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాదనుకుని, షేర్డ్ రైడ్స్‌కు పెద్ద పీట వేయడం మొదలైంది. ఆ తర్వాత కొత్తదో, పాతదో సొంత వెహికల్స్ కొనుక్కోవడం ఎక్కువైందని ఐబీబీ రిపోర్టు తయారు చేసిన అశుతోష్ పాండే చెప్పారు. యూజ్డ్ కార్ల బిజినెస్లోని మహీంద్రా ఫస్ట్ ఛాయిస్‌కు అశుతోష్ పాండే ఎండీ ఉన్నారు. ఈ కంపెనీ 2021 లో 1.8 లక్షల కార్ల అమ్మకాలను ఫెసిలిటేట్ చేసింది. 2023 నాటికి ఈ సంఖ్య 2.5 లక్షలకు చేరుతుందని ఆయన చెప్పారు. 2027 నాటికి ఏటా 8 లక్షల సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలను ఫెసిలిటేట్ చేయాలనేది తమ లక్ష్యమని పేర్కొన్నారు. తమ నెలవారీ అమ్మకాలలో ఎస్‌యూవీల వాటా 18 శాతమని చెప్పారు.
కరోనాతో మార్కెట్‌కు బూస్ట్..
కరోనా తర్వాత ఆటో సేల్స్‌కు మరింత బూస్ట్ వచ్చింది. ఇంటర్నెట్ బాగా విస్తరించడంతో ఆన్లైన్ రిటెయిల్ ప్లేయర్ల సంఖ్య పెరిగింది. వారి పట్ల కస్టమర్లకు నమ్మకం కూడా కుదురుతోంది. కస్టమర్లకు బెటర్ డీల్స్తోపాటు, బెనిఫిట్స్నూ ఈ ఆన్లైన్ కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. 2022లో మన దేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ 44 లక్షల యూనిట్ల దాకా ఉంది. ఇది 6 శాతం పెరిగి 2023లో 46 లక్షల యూనిట్లకు చేరుతుందని అంచనా. ఇండియన్ బ్లూబుక్ (ఐబీబీ) ఈ రిపోర్టును రిలీజ్ చేసింది. 2027 నాటికి ఇండియాలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ 80 లక్షల యూనిట్లకు చేరుతుందని, ప్రస్తుతం విలువ పరంగా సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ 23 బిలియన్ డాలర్లని కూడా ఈ రిపోర్టు తయారు చేసిన మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ లిమిటెడ్ పేర్కొంది. రాబోయే ఏళ్లలో ఈ మార్కెట్ ఏటా 19.5 శాతం చొప్పున పెరుగు తుందని ఈ సంస్థ అంచనా వేస్తోంది.