కండిషన్​ బాగున్న సెకండ్​ హ్యాండ్​.. ఫోన్లకు మార్కెట్లో మస్త్ గిరాకీ

కండిషన్​ బాగున్న సెకండ్​ హ్యాండ్​..  ఫోన్లకు మార్కెట్లో మస్త్ గిరాకీ

వెలుగు బిజినెస్​ డెస్క్​ : కండిషన్​ బాగున్న సెకండ్​ హ్యాండ్​ మొబైల్​ ఫోన్​లకు మార్కెట్లో గిరాకీ పెరుగుతోంది. కానీ,  సెకండ్​ హ్యాండ్​ మొబైల్​ ఫోన్లు కొనే ముందు ఐఎంఈఐ నెంబర్​ను తప్పనిసరిగా చెక్​ చేసుకోవాలి. ఐఎంఈఐ నెంబర్​ కనుక్కోవడానికి సెంట్రల్​ ఎక్విప్​మెంట్​ ఐడెంటిటీ రిజిస్టర్​ (సీఈఐఆర్​) పేరిట ఒక వెబ్​సైట్​ను డిపార్ట్​మెంట్​ ఆఫ్​ టెలికం అందుబాటులోకి తెచ్చింది.

సెకండ్​ హ్యాండ్​ ఫోన్​ కొనాలంటే ఎదుర్కొనే ప్రధాన ఇబ్బంది దాని ఆథెంటిసిటీ తెలియకపోవడమే. అంటే, ఆ ఫోన్​ దొంగిలించినది కావచ్చు లేదా ఏదైనా అక్రమ కార్యకలాపాలకు కూడా వాడి ఉండొచ్చు. అంతేకాదు, కొనుక్కునే వారి పర్సనల్​, ఫైనాన్షియల్​ డిటెయిల్స్​ దొంగిలించడానికి ఉద్దేశపూర్వకంగా ఏదైనా మాల్​వేర్​తో  సెకండ్​ హ్యాండ్​ ఫోన్​ను అమ్మే  అవకాశమూ ఉంటుంది. ఈ నేపథ్యంలో సెకండ్​ హ్యాండ్​ కొనే ముందు తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలుసుకుంటే మేలు. మనం కొనాలనుకుంటున్న ఫోన్​ దొంగిలించినదా కాదా అనే వివరాలు తెలుసుకోవాలంటే  ఆ ఫోన్​ ఐఎంఈఐని ప్రభుత్వ డేటా బేస్​లో చెక్ చేసుకోవాలి. ఇండియాలో అమ్మే ప్రతీ మొబైల్​ ఫోన్​బాక్స్​ మీద తప్పనిసరిగా ఐఎంఈఐ నెంబర్​ ప్రింట్​ చేస్తారు. ఒక మొబైల్​ ఫోన్​ ఐఎంఈఐ నెంబర్​ తెలుసుకోవడానికి మరో మార్గం కూడా ఉంది. అదే మొబైల్​ నుంచి *#06# డయల్​ చేయడం ద్వారా ఐఎంఈఐ వివరాలు తెలుస్తాయి. ఫోన్​ సెట్టింగ్స్​లోనూ ఈ ఐఎంఈఐ నెంబర్​ తెలుసుకునే వీలుంటుంది. అయితే, డ్యూయెల్​ సిమ్​ మొబైల్​ ఫోన్లకు రెండు వేరు వేరు ఐఎంఈఐ నెంబర్లు ఉంటాయి.

సెకండ్​ హ్యాండ్ మొబైల్​ ఫోన్లు కొనాలనుకునే వారు ఐఎంఈఐ నెంబర్​ను  తప్పనిసరిగా చెక్​ చేసుకోవాలని , సీఈఐఆర్​ వెబ్​సైట్​ ద్వారా ఈ పని ఈజీగానే చేయొచ్చని ఢిల్లీ పోలీస్​సైబర్​ క్రైమ్​ యూనిట్​ డీసీపీ ప్రశాంత్​ గౌతమ్​ సూచిస్తున్నారు. సీఈఐఆర్​ వెబ్​సైట్​ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఈఐఆర్​.గవ్​.ఇన్​ పేరుతో ఉంటుంది. డిపార్ట్​మెంట్​ ఆఫ్​ టెలికమ్యూనికేషన్స్​ స్వయంగా ఈ వెబ్​సైట్​ను నిర్వహిస్తోంది. భవిష్యత్​లో స్కామ్​ల బారినపడకుండా కాపాడుకోవడానికి ఐఎంఈఐ నెంబర్​ చెక్​ చేసుకున్న తర్వాతే, సెకండ్​ హ్యాండ్​ మొబైల్​ కొనుక్కోవడం మంచింది.  ఆ ఫోన్​ దొంగిలించిఋనదో కాదో తెలియడంతోపాటు, ఎలాంటి అక్రమ కార్యకలాపాలకు ఆ ఫోన్​ వాడలేదనేది ఐఎంఈఐ నెంబర్​వల్ల తెలుసుకోవడం సాధ్యపడుతుందని సైబర్​ సెక్యూరిటీ కంపెనీ సేఫ్​ సెక్యూరిటీ కో–ఫౌండర్​ రాహుల్​ త్యాగి చెప్పారు. భీమ్​ యూపీఐ యాప్​ సైబర్​ సెక్యూరిటీ కాంట్రాక్టర్లలో ఈ  కంపెనీ కూడా ఒకటి.

ఎస్​ఎంఎస్​తో .....

ఏదైనా మొబైల్ ఫోన్​ నుంచి 14422 నెంబర్​కి కేవైఎం అని టైప్​ చేసి ఎస్​ఎంఎస్​ చేస్తే, సీఈఐఆర్​ నుంచి ఆ మొబైల్​ బ్రాండ్​ నేమ్​, మోడల్​ నేమ్​, మాన్యుఫాక్చరర్​, డివైస్​ టైప్​, ఐఎంఈఐ స్టేటస్ (వాలిడ్, ఇన్​వాలిడ్​, బ్లాక్డ్​)​ వంటి వివరాలన్నీ  తెలుస్తాయి.

యాప్​  పేరు కేవైఎం....

ఐఎంఈఐ వివరాలు తెలుసుకోవడానికి కేవైఎం పేరుతో ఒక యాప్​ కూడా అందుబాటులో ఉంది. ఐఓఎస్​, ఆండ్రాయిడ్​ వెర్షన్​లలో ఇది దొరుకుతోంది.

సైబర్​ సెక్యూరిటీ రిస్క్​...

సెకండ్​ హ్యాండ్​ మొబైల్​ ఫోన్​ కొంటే ఆ మొబైల్​ఫోన్​ సాఫ్ట్​వేర్​ అప్​డేట్​ చేసుకోవడంతో పాటు, మంచి సెక్యూరిటీ యాప్​ ఇన్​స్టాల్​ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే, అమ్మే వ్యక్తి ఏదైనా మాల్​వేర్​ను ఆ ఫోన్​లో ఉంచి, అమ్ముతూ ఉండి ఉండొచ్చు. ఫ్యాక్టరీ రీసెట్​ చేసిన తర్వాత కూడా కొన్ని మాల్​వేర్​లు పోవని నిపుణులు పేర్కొన్నారు.