TCS Salary Hikes: ప్రస్తుతం చాలా కార్పొరేట్ కంపెనీల్లో ఒక ట్రెండ్ నడుస్తోంది. అదేంటంటే కొత్త ఆర్థిక సంవత్సరం కాగానే ముందు లేఆఫ్స్ గురించి ప్రకటించటం ఆ తర్వాత ఉద్యోగులకు వేతన పెంపులను ఆఫర్ చేయటం. దేశంలోని అతిపెద్ద టెక్ సంస్థ టీసీఎస్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. కొన్ని రోజుల కింద 12వేల మందిని లేఆఫ్ చేయనున్నట్లు ప్రకటించిన టాటా గ్రూప్ సంస్థ తాజాగా ఉద్యోగుల శాలరీ హైక్స్ గురించి తీపి కబురు చెప్పింది.
సెప్టెంబర్ 1, 2025 నుంచి పెంచిన వేతనాలు ఉద్యోగులు అందుకుంటారని టీసీఎస్ పేర్కొంది. ఈసారి శాలరీ హైక్స్ కంపెనీలోని 80 శాతం ఉద్యోగులను కవర్ చేస్తాయని చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లఖ్కడ్ ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేశారు. ప్రస్తుతం అందిస్తున్న హైక్స్ సైకిల్ లో C3A గ్రేడ్ వరకు ఉన్న ఉద్యోగులకు పెంపులు అందుతాయని చెప్పింది కంపెనీ. ఈ కేటగిరీలో ప్రధానంగా జూనియర్ నుంచి మిడ్ లెవెల్ ఉద్యోగులు కవర్ అవుతారని తెలుస్తోంది.
ALSO READ : మీ దగ్గర రూపాయి కూడా లేదా డోంట్ వర్రీ..
అయితే టీసీఎస్ ఉద్యోగులకు ఎంత శాతం వేతన పెంపులను అందిస్తుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. గతంలో టెక్ దిగ్గజం 4.5 శాతం నుంచి 7 శాతం మధ్య వేతన పెంపులను ఏప్రిల్ 2024లో ఇచ్చింది. కేవలం టాప్ పెర్ఫార్మర్లకు మాత్రమే రెండంకెల వేతన పెంపును ఆఫర్ చేసింది. చాలా మంది ఉద్యోగులు హైక్స్ గురించి ఆనంద పడాలో లేక రాబోలే ఆఫ్స్ వల్ల భయపడాలో తెలియక గందరగోళంలో ఉన్నారు. మరో పక్క టీసీఎస్ కంపెనీ నుంచి కొత్త ఉద్యోగం కోసం వెతుకున్న టెక్కీల జాబితా రోజురోజుకూ పెరుగుతోందని జాబ్ సెర్చ్ పోర్టల్స్ డేటా చెబుతోంది.
భవిష్యత్తు ఏఐ అవసరాలను తీర్చటానికి అనుగుణంగా కంపెనీ తనను తాను రూపాంతరం చేసుకుంటున్న క్రమంలో కొత్త టాలెంట్ ఉద్యోగుల రిక్రూట్మెంట్ కొనసాగిస్తూనే అవసరమైన స్కిల్స్ లేని ఉద్యోగులను తొలగించటానికి ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడైంది. కొత్త వ్యాపారం, తర్వాతి తరం టెక్ అవసరాల లక్ష్యంగానే లేఆఫ్స్ చేపట్టనున్నట్లు టీసీఎస్ ప్రకటించటం ఐటీ రంగాన్ని పెద్ద కుదుపుకు గురిచేస్తోంది.
