ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో విడతలో పోటెత్తిన్రు..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  రెండో విడతలో పోటెత్తిన్రు..
  • ఉదయం నుంచే ఓటేసేందుకు బారులు తీరిన ఓటర్లు 
  • ఉమ్మడి జిల్లాలో 13 మండలాల్లోని 316 పంచాయతీల్లో ఎన్నికలు 
  • ఖమ్మం జిల్లాలో 91.21 శాతం,  
  • భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 82.65శాతం పోలింగ్​ నమోదు

ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు:   ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో విడతలోనూ పల్లె ఓటర్లు పోటెత్తారు. ఉదయం నుంచే పోలింగ్​ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉమ్మడి జిల్లాలో 13 మండలాల్లోని 316 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. ఖమ్మం జిల్లాలో 91.21 శాతం,  భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 82.65శాతం పోలింగ్​ నమోదైంది.

ఎక్కడెక్కడ..ఎలా..

ఖమ్మం జిల్లాలో ఆరు మండలాల్లోని 160 పంచాయతీల్లో, 1379 వార్డుల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే బారులు తీరారు. పురుషులు, మహిళలతో పాటు యూత్​ కూడా ఓటేసేందుకు క్యూ కట్టారు. పోటీలో ఉన్న అభ్యర్థులు చివరి రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాలు, బస్సులు, కార్లలో వలస ఓటర్లు  సొంతూర్లకు చేరుకొని ఓటేశారు. దీంతో గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపించింది. ఖమ్మం జిల్లాలో 91.21 శాతం పోలింగ్ నమోదైంది. 

ఉదయం 9 గంటల వరకు 27.78 శాతం, 11 గంటలకు 64.32 శాతం, 1 గంట వరకు 85.95 శాతం పోలింగ్ నమోదైంది. ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు టోకెన్ అందించి, ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించగా, మొత్తం ఖమ్మం జిల్లాలో 91.21 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కలెక్టరేట్ లోని వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా 6 మండలాల్లో జరిగిన పోలింగ్ సరళిని పరిశీలించారు.

భద్రాద్రికొత్తగూడెం  జిల్లాలోని ఏడు డలాల్లో ఆదివారం జరిగిన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో 82.85శాతం ఓటింగ్​ పోలైంది. అత్యధికంగా అశ్వారావుపేట మండలంలో 87.85శాతం, తక్కువగా చుంచుపల్లిలో 66.19పోలింగ్​ నమోదైంది.  జిల్లాలో అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, చంద్రుగొండ, చుంచుపల్లి, పాల్వంచ, ములకలపల్లి, పాల్వంచ మండలాల్లో రెండో విడత ఎన్నికలు జరిగాయి. 

మొత్తం 156 గ్రామాల్లో 1,96,395 ఓటర్లకు గానూ 1,62,323 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 80,037 మంది పురుషులు, 82,284 మంది మహిళలు, ఇతరులు ఇద్దరు పోలింగ్​లో పాల్గొన్నారు. కాగా, ఓటేసేందుకు పొద్దున్నుంచే ఓటర్లు పోలింగ్​ కేంద్రాలకు తరలివెళ్లారు. అన్నపురెడ్డిపల్లి మండలంలో ఉదయం 9 గంటలకు 30.14శాతం నమోదు కాగా పాల్వంచలో మాత్రం కేవలం 8.04శాతం మాత్రమే పోలింగ్​ కావడం గమనార్హం. 

11 గంటల వరకు చుంచుపల్లి, పాల్వంచ మండలాల్లో మాత్రం 50శాతం పోలింగ్​ నమోదు కాగా మిగిలిన మండలాల్లో 70శాతం దాటడడం విశేషం. జిల్లాలోని పలు పోలింగ్​ కేంద్రాలను కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ పరిశీలించారు. ఎస్పీ బి. రోహిత్​ రాజు సందర్శించారు. పోలింగ్​ కేంద్రాల వద్ద బందోబస్తును పరిశీలించారు. చుంచుపల్లి మండలంలో ఎన్నికల పరిశీలకులు సర్వేశ్వర్​ రెడ్డి పోలింగ్​ సరళిని పరిశీలించారు.