భద్రాచలం అడవుల్లో మావోయిస్టుల సీక్రెట్ ​బంకర్లు

భద్రాచలం అడవుల్లో మావోయిస్టుల సీక్రెట్ ​బంకర్లు

భద్రాచలం, వెలుగు: మావోయిస్టుల విప్లవ కారిడార్ ​కేంద్రం దండకారణ్యంలో మావోయిస్టుల సీక్రెట్​ బంకర్లు, భారీ సొరంగాలను భద్రతా బలగాలు గుర్తించాయి. వారి గెరిల్లా వ్యూహాన్ని జవానులు బట్టబయలు చేశారు. మావోయిస్టులు ప్రభావం ఎక్కువగా ఉండే దంతెవాడ, -బీజాపూర్​జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టులు నిర్మించుకున్న భారీ స్థాయి 2 కిలోమీటర్ల పొడవున్న సొరంగాన్ని జవాన్లు బహిర్గతం చేశారు. బీజాపూర్​ జిల్లా టేకులగూడెం బేస్​ క్యాంపుపై మావోయిస్టులు మంగళవారం దాడి చేసి ముగ్గురు జవాన్లను కాల్చి చంపారు. కాల్పుల్లో 14 మంది జవాన్లు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

ఈ ఘటన తర్వాత కేంద్ర బలగాలు భారీ సంఖ్యలో అడవులను చుట్టుముట్టి కూంబింగ్​చేపట్టాయి. ఈ ఆపరేషన్​లో టేకులగూడెం బేస్​క్యాంపునకు సమీప అడవుల్లో మావోయిస్టులు తవ్విన సొరంగం కనబడింది. చెక్కలు పేర్చి, పైన ఆకులు, మట్టి వేసి ఉంచారు. వాటిని తవ్వి చూడగా లోపల సొరంగం ఉంది. సుమారు రెండు కిలోమీటర్లు పొడవు ఉన్న సొరంగంలో దాదాపు 50 మంది ఒకేసారి వెళ్లిపోవచ్చు. అక్కడక్కడ గాలి,వెలుతురు కోసం పైభాగంలో తెరిచి ఉంచారు. అడవిలో ఈ సొరంగం నుంచి నలుదిక్కులా తప్పించుకునేలా, అవసరమైతే తలదాచుకునేలా ఏర్పాట్లు ఉన్నాయి. అఫ్గానిస్తాన్​లో తాలిబన్లు, గాజాలో హమాస్​ తీవ్రవాదులు ఈ యుద్ధ తంత్రంతో తమ గెరిల్లా రణనీతి ద్వారా పట్టు సాధించారు.

ఈ నేపథ్యంలో మావోయిస్టులు సైతం తమ వ్యూహాలకు పదును పెట్టినట్లుగా తెలుస్తోంది. టేకులగూడెం బేస్​క్యాంపుపై దాడికి 4 నెలల ముందు నుంచే ఈ ప్రాంతంలో మావోయిస్టులు సొరంగాలు, బంకర్లు తవ్వినట్లుగా భద్రతా బలగాలు తెలుసుకున్నారు. ఈ క్యాంపును మావోయిస్టులు వ్యతిరేకిస్తున్నారు. క్యాంపు ఏర్పాటు చేస్తే తమ ఉనికికే ప్రమాదం అని భావించి ఎదురుదాడికి సిద్ధమై ఈ దాడికి పాల్పడ్డారు. దాడి చేసిన అనంతరం ఈ సొరంగాల ద్వారా తప్పించుకున్నారు. 

డ్రోన్లతో ట్రైనింగ్​ చిత్రీకరణ

టేకులగూడెం బేస్​ క్యాంపుపై దాడి ఘటన తర్వాత భద్రతా బలగాలు అప్రమత్తమై దండకారణ్యంను జల్లెడ పడుతున్నాయి. ఈ క్యాంపు చుట్టూ దాదాపు 5 కి.మీల పరిధిలో నక్సల్స్ కదలికలను గుర్తించేందుకు డ్రోన్లను వాడుతున్నారు. ఈ క్రమంలోనే అడవిలో మావోయిస్టులకు ట్రైనింగ్​ఇస్తున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. వాటిని కూడా పోలీసులు బుధవారం రిలీజ్​చేశారు. కంపెనీ నంబరు1 కమాండర్ హిడ్మా నేతృత్వంలో ఈ ట్రైనింగ్​ జరుగుతుందా? దాడికి వ్యూహకర్త కూడా అతనేనా? అనే కోణంలో ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఈ క్యాంపులో 3 వేల మందికి పైగా మావోయిస్టులు ఉన్నారు. గతంలో డ్రోన్ కెమెరాలు తీసిన చిత్రాల్లో100 మందికి మించి లేరు.

కానీ ఈసారి మావోయిస్టులు, వేల సంఖ్యలో ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది. జనవరి రెండో వారంలో పామేడు, ధర్మారం బేస్​ క్యాంపులపై దాడి చేసినప్పుడు కూడా ఇంత సంఖ్యలోనే మావోయిస్టులు వచ్చినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పుడు డ్రోన్​ కెమెరా విజువల్స్​ఆ ప్రకటనను ధ్రువీకరిస్తున్నాయి. మావోయిస్టులు తమ గెరిల్లా యుద్ధతంత్రాన్ని మార్చుకున్నట్లుగా తెలుస్తోంది.