తుమ్మల అనుచరుల రహస్య భేటీ

 తుమ్మల అనుచరుల రహస్య భేటీ

ఖమ్మం రూరల్, వెలుగు: పాలేరు బీఆర్​ఎస్​ టికెట్ తుమ్మల నాగేశ్వరరావుకు కేటాయించకపోవడంపై ఆయన వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురంలో నాలుగు మండలాల తుమ్మల అనుచరులు రహస్యంగా భేటీ అయ్యారు. ఎలాగైనా పోటీలో ఉండాలంటూ తుమ్మలపై ఒత్తిడి తెస్తామని చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డి కాంగ్రెస్​ నుంచి బీఆర్​ఎస్​లో చేరినప్పటి నుంచి తుమ్మల కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. ఈ సారి పాలేరు నుంచే పోటీ చేస్తానని పలు వేదికలపై ప్రకటించడమే కాకుండా టికెట్​ కోసం గట్టి ప్రయత్నాలే చేశారు. కచ్చితంగా టికెట్​ వస్తుందని అనుచరుల వద్ద ధీమాగా ఉన్నారు. 

కానీ సీఎం కేసీఆర్.. కందాల వైపే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో తుమ్మల అనుచరులు మీటింగ్​ ఏర్పాటు చేసుకుని భవిష్యత్​ కార్యాచరణపై చర్చించారు. ప్రస్తుతం తుమ్మల హైదరాబాద్​లో ఉన్నారు. కేసీఆర్​ స్వయంగా ఆహ్వానిస్తేనే తుమ్మల బీఆర్​ఎస్​లో చేరారని, మొదటి నుంచి విధేయుడిగా ఉన్నప్పటికీ ప్రాధాన్యత దక్కలేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. 

త్వరలో జిల్లా స్థాయిలో అభిమానులతో సమావేశం ఏర్పాటుచేసి సరైన రాజకీయ నిర్ణయం తీసుకునేలా తుమ్మలపై ఒత్తిడి తేవాలని భేటీలో నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. నియోజకవర్గంలో ఎప్పుడూ గ్రూపులను ప్రోత్సహించలేదని, చివరి వరకూ పార్టీ లైన్​లోనే ఉండి సహకరించినా ఫలితం దక్కలేదని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.