పాఠశాల విద్యార్థుల మధ్య గొడవ.. 144 సెక్షన్ విధింపు

పాఠశాల విద్యార్థుల మధ్య గొడవ.. 144 సెక్షన్ విధింపు

మధ్యాహ్న భోజనం సమయంలో ఇద్దరు విద్యార్థుల మధ్య మొదలైన గొడవ చిలికి చిలికి గాలి వానలా మారింది. ఒక విద్యార్థి మరో విద్యార్థిపై కత్తితో దాడి చేయడంతో బాధితుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన హిందూ సంఘాలు రోడ్లపై ఆపి ఉన్న వాహనాలను తగలబెట్టడంతో ఉదయపూర్‌ రణరంగంగా మారిపోయింది. పరిస్థితి చేయి దాటిపోయేలా కనిపించడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. 

ఏం జరిగిందంటే..?

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, ఇద్దరు విద్యార్థులు ఒకే తరగతిలో చదువుతున్నారని, మధ్యాహ్న భోజనం సమయంలో వీరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ అనంతరం ఒక విద్యార్థి బయటకు వెళ్లగా.. నడుచుకుంటూ వెళ్తున్న సదరు విద్యార్థిపై మరొక విద్యార్థి కత్తితో దాడి చేశాడు. కత్తిపోట్లకు బలైన విద్యార్థి రక్తపు మడుగులో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే పాఠశాల ఉపాధ్యాయులు అతన్ని ఆస్పత్రికి తరలించగా, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు ఆస్పత్రికి చేరుకోవడంతో పరిసరాలు రణరంగంగా మారిపోయాయి. వారికి మరికొందరు యువకులు తోడై ఆస్పత్రి ప్రాంగణం బయట ఉన్న దుకాణాలను బంద్ చేపించారు. అదే సమయంలో రోడ్లపై ఆపి ఉన్న వాహనాలకు నిప్పుపెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఉన్నతాధికారులు ఘటనా స్థలికి చేరుకొని ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ముందస్తు జాగ్రత్తగా 144 సెక్షన్ విధించారు. కత్తితో దాడి చేసిన విద్యార్థి మరో మతానికి చెందిన విద్యార్థి అన్నట్లు కథనాలు వస్తున్నాయి. అందువల్లనే, హిందూ సంఘాలు చోటుచేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ అరవింద్ పోస్వాల్ మాట్లాడుతూ.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, విషయం ఏమిటో ఇంకా తెలియరాలేదని తెలిపారు.