
- 18.8 కిలోల గంజాయి సీజ్
పద్మారావునగర్, వెలుగు: వైజాగ్ నుంచి సికింద్రాబాద్ మీదుగా మహారాష్ట్రలోని మన్మాడ్కు గంజాయి తరలిస్తున్న ఇద్దరు పట్టుబడ్డారు. సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ లో రైల్వే అర్బన్ డీఎస్సీ జావెద్, ఇన్ స్పెక్టర్ సాయి ఈశ్వర్, బుధవారం కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా మోమిన్ పురాకు చెందిన ముబీన్ అహ్మద్ రహీమ్, బోరీకంపౌండ్కు చెందిన నఫీజ్ అఫ్సర్ ఖాన్ హ్యాండ్ డిజైనింగ్ చీరలను పూనె, ముంబై, చెన్నై, వైజాగ్ ప్రాంతాలకు రైళ్ల ద్వారా తరలించి బిజినెస్ చేస్తుంటారు.
మహారాష్ట్రకు చెందిన గంజాయి స్మగ్లర్ అతిక్ తో అహ్మద్ రహీమ్ కు రెండు నెలల కింద పరిచయం ఏర్పడింది. రైలులో గంజాయిని వైజాగ్ నుంచి మన్మాడ్ కు చేరవేస్తే ఒక ట్రిప్పునకు రూ.5 వేలు ఇస్తామని చెప్పడంతో అంగీకరించాడు. అనంతరం రహీమ్, అఫ్సర్ ఇద్దరూ కలిసి వైజాగ్ వెళ్లగా, ఓ వ్యక్తి వారికి ట్రాలీ బ్యాగును అందజేశాడు. దాన్ని తీసుకుని వైజాగ్ లో నాగావళి రైలు ఎక్కిన నిందితులు సికింద్రాబాద్కు బయలుదేరారు. మధ్యలో కాజీపేట స్టేషన్ లో చెకింగ్ జరుగుతుండడంతో రైలు దిగి, స్టేషన్ లో పోలీసులను తప్పించుకుని బయటపడ్డారు.
ఆ తర్వాత కాజీపేటలో బస్సెక్కిన వీరు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకోగా, అప్పటికే మన్మాడ్ రైలు వెళ్లిపోయింది. దీంతో మన్మాడ్ వెళ్లేందుకు చర్లపల్లి నుంచి రైలు ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్తుండగా, పోలీసులు వీరిని పట్టుకుని.. బ్యాగ్ చెక్ చేయగా, అందులో రూ.9.43 లక్షలు విలువైన 18.869 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పరారీలో ఉన్న అతిక్ కోసం గాలింపు చేపట్టారు.