
- సీసీ కెమెరాల బిగింపు కూడా..
- చెరువుల రక్షణకు హైడ్రా కసరత్తు
- లేక్ ప్రొటెక్షన్ పేరుతో ఏర్పాటుకు హైడ్రా ప్లాన్
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్లో ఇప్పటికే అనేక చెరువులు కబ్జాకు గురయ్యాయి. కొన్నిచెరువులు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఇంకొన్ని చెరువుల ఎఫ్టీఎల్ కూడా గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది.
దీంతో చెరువులను కాపాడేందుకు ప్రభుత్వం హైడ్రాని రంగంలోకి దింపడంతో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలను కూల్చివేస్తోంది. అయినా భవిష్యత్లో ఆక్రమణలు కొనసాగకుండా చూసేందుకు ఒక్కో చెరువు దగ్గర లేక్ ప్రొటెక్షన్ పేరుతో ఇద్దరు చొప్పున సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేసింది.
వీరితో పాటు సీసీ కెమెరాలను కూడా బిగించనుంది. ఇదివరకు చెరువులను పట్టించుకునేవారు లేకపోవడంతోనే ఆక్రమణలు వెలిశాయని.. ఇకపై ఒక్క చోట కూడా ఆక్రమణ జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
మొత్తం 450కి పైనే చెరువులు
గ్రేటర్లో185 చెరువులుండగా, ఓఆర్ఆర్లోపలి మున్సిపాలిటీలు, పంచాయతీల్లో కలిపి మరో 300 వరకు చెరువులున్నాయి. ఇదివరకు చెరువుల ఆక్రమణలను అడ్డుకోవడానికి జీహెచ్ఎంసీ ఈవీడీఎం (ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్) ఉన్న టైంలో కొన్నిచోట్ల గార్డులను ఏర్పాటు చేసింది.
ఇప్పుడు ఈవీడీఎం హైడ్రాగా మారడంతో ముందుగా గ్రేటర్ పరిధిలో చెరువుల దగ్గర ఇద్దరు చొప్పున గార్డులను నియమించాలని భావిస్తోంది. కొద్ది రోజులు చూశాక మిగతా చెరువులకు కూడా విస్తరించాలని ప్లాన్ చేస్తోంది.
గార్డులతో పాటు సీసీ కెమెరాలు కూడా బిగించి చెరువుల కబ్జాలు, వ్యర్థాలు వదలడాన్ని నిరోధించడం, మెటీరియల్పడేయడాన్ని అడ్డుకోవడం చేస్తామంటోంది.
నాలాలపై హైడ్రా సర్వే షురూ
గ్రేటర్పరిధిలోని నాలాలపై హైడ్రా సర్వే మొదలుపెట్టింది. టోలిచౌకి, షేక్ పేటలోని బల్కాపూర్ నాలాపై డ్రోన్లతో సర్వే చేసింది. హైడ్రా, ఇరిగేషన్ అధికారుల తో పా టు హైదరాబాద్ ఆర్డీవో, తహసీల్దార్కలిసి పరిశీలించారు.
దాదాపు 5కిలోమీటర్ల మేర ఈ నాలా విస్తరించి ఉండగా, 2 కిలోమీటర్ల మేరా అంతా బాగున్నట్లు గుర్తించారు. 3 కిలోమీటర్ల పరిధిలో అక్కడక్కడ ఆక్రమణలు ఉన్నా యని, వాటి వల్ల నాలా విస్తీర్ణం తగ్గిందని గుర్తించారు.
దాదాపు 50 ఆక్రమణలు ఉన్నాయని తేల్చారు. వాటిని తొలగిస్తే ముంపు సమస్య ఉండదని సమాచారం. గణేశ్ నిమజ్జనం అనంతరం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించి ఫైనల్గా ఒక నిర్ణయానికి రానున్నట్లు తెలిసింది.