మణిపూర్‌లో భద్రతను కట్టుదిట్టం.. ఎందుకంటే..

మణిపూర్‌లో భద్రతను కట్టుదిట్టం.. ఎందుకంటే..

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మణిపూర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంఫాల్ లోయకు చెందిన కొన్ని నిషేధిత సంస్థలు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సమ్మెకు పిలుపునివ్వడంతో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భద్రతా బలగాలు ఐదు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

జోరుగా సన్నాహాలు

ఆగస్టు 15న జరగనున్న మార్చ్ పాస్ట్ కోసం బీఎస్ఎఫ్ (BSF), పోలీసు, అస్సాం రిఫైల్స్ సిబ్బంది, విద్యార్థులు రిహార్సల్స్‌లో చేరడంతో రాష్ట్రవ్యాప్తంగా I-డే వేడుకలకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. "శాంతి మైదానంలో ఆగస్టు 12న ఇండిపెండెన్స్ డే వేడుకల రిహార్సల్స్ జరిగాయి. చురాచంద్‌పూర్ జిల్లా తుయ్‌బౌంగ్ ప్రాంతంలో బీఎస్ఎఫ్, పోలీసులు, విద్యార్థులు, అస్సాం రైఫిల్స్‌కు చెందిన 21 కవాతు బృందాలు సన్నాహాల్లో పాల్గొన్నాయి" అని అధికారులు తెలిపారు.

ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాలకు ముందు.. రాజధాని ఇంఫాల్‌లో గేట్లను ఏర్పాటు చేయడం, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడంతో ఏర్పాట్లు ప్రారంభయ్యాయి. "స్వాతంత్ర్య దినోత్సవం రోజున అనేక తీవ్రవాద సంస్థలు సమ్మెకు పిలుపునిచ్చిన క్రమంలో భద్రతా చర్యలు వేగవంతమయ్యాయి" అని వివరించారు.