
న్యూఢిల్లీ, వెలుగు: దేశంలోని రైల్వేలలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు రైళ్ల కార్యకలాపాల్లో భద్రతను పెంచాలని ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఇందుకోసం 15 రోజులకు ఒకసారి భద్రతా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. శనివారం ఢిల్లీలో జరిగిన రైల్వే భద్రతా సమీక్ష సమావేశంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు.
ఆటోమేటిక్ సిగ్నలింగ్, రైలు సిబ్బంది సుదీర్ఘ డ్యూటీ టైం, యార్డ్ ఆధునీకరణ, యార్డ్ మౌలిక సదుపాయాల్లో భద్రతా ప్రమాణాలు వంటి అంశాలపై ఇందులో చర్చించారు. కాగా, దేశంలో ఇటీవల రైల్వే ప్రమాదాలు పెరుగుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అలాగే, సగటు రైలు వేగం తగ్గిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఈ సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. రైల్వే బోర్డు మెంబర్లు, జనరల్ మేనేజర్లు, జోనల్ రైల్వే అధికారులు, డివిజనల్, ఆర్డీఎస్‌ఓ అధికారులు పాల్గొన్నారు.