
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు రావడంతో ముంబై పోలీసులు ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ కార్యాలయానికి బెదిరింపు ఈ మెయిల్ లు పంపినందుకు జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్ స్టర్లు లారెన్స్ బిఫ్ణోయ్, గోల్డీ బ్రార్, రోహిత్ గార్గ్లపై బాంద్రా పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 506(2), 120 (బీ) 34 సెక్షన్ ల కింద ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్కు ముప్పు ఉందని గుర్తించిన ముంబై పోలీసులు ఆయన నివాసం వద్ద వై ప్లస్ కేటగిరి భద్రతను కల్పించారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి సల్మాన్కు బెదిరింపులు రావడంతో మహరాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు భద్రత కల్పించింది.
సల్మాన్ ఖాన్ మార్చి 19న ( శనివారం) మధ్యాహ్న సమయంలో ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు పోలీసులకు సల్మాన్ కార్యాలయం తెలిపింది. గోల్డీ బ్రార్ అనుచరుడు మోహిత్ గార్గ్ ద్వారా వచ్చినఈ మెయిల్‌లో సల్మాన్‌ను తమ బాస్ గోల్డీ బ్రార్ నేరుగా కలవాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. అంతేకాదు సల్మాన్‌ను చంపేస్తామనే బెదిరింపు అందులో ఉందని ప్రశాంత్ గుంజాల్కర్ పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
గతంలోనూ....
గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ నుంచి సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు రావడం ఇది మొదటిసారేం కాదు. కృష్ణజింకల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్‌ఖాన్‌ని హత్య చేస్తానంటూ 2018లో కోర్టు ఆవరణలోనే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రకటించాడు. అయితే చివరకు ఈ కేసులో సల్మాన్ నిర్దోషిగా విడుదలయ్యారు. గతేడాది పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత సల్మాన్‌కు బెదిరింపు లేఖ వచ్చింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్ భద్రతను కూడా పెంచింది. ఇప్పటికీ సాయుధ గార్డ్‌లు సల్మాన్‌కు నిత్యం సల్మాన్ కు భద్రతగా ఉంటున్నారు. ఆ తర్వాత మరికొందరు దుండగులు సల్మాన్ ఖాన్‌తోపాటు ఆయన తండ్రి సలీం ఖాన్‌ను చంపేస్తామని లేఖ పంపారు. తాజాగా మరోసారి బెదిరింపులతో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.