సీడ్ పత్తి రైతును వెంటాడుతున్న కష్టాలు

సీడ్ పత్తి రైతును వెంటాడుతున్న కష్టాలు
  • పుపొడ్డి రాకపోవడంతో ఆలస్యంగా పోలినేషన్​
  • ఆందోళనలో రైతులు 
  • దిగుబడిపై ఎఫెక్ట్ పడుతుందని ఆవేదన

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా లో సీడ్ పత్తి రైతులపై దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. మూడు నెలల క్రితం విత్తనాలు నాటిన తర్వాత ఎండలు తీవ్రంగా కొట్టాయి. దీంతో పంట మీద ప్రభావం పడింది. ఇప్పుడు సుంకు రాకపోవడంతో మరింత నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఎండల ఎఫెక్ట్ తో రైతులు దాదాపు 30 శాతానికి పైగా పంటను కోల్పోయారు. తాజాగా వాతావరణం చల్లబడుతున్న తరుణంలో సుంకు వచ్చినా.. దిగుబడిపై ఎఫెక్ట్ పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

సీడ్​ పత్తి సాగే ఎక్కువ

గద్వాల నియోజకవర్గంలో సీడ్ పత్తి పంటకు పెట్టింది పేరు నియోజకవర్గంలో దాదాపు 40 వేల ఎకరాల్లో ఈ పత్తి పంట ఏటా సాగువుతోంది. కానీ, ఏటా ఏదో ఒక రూపంలో సీడ్ పత్తి రైతులు నష్టాన్ని ఎదుర్కొంటూనే ఉన్నారు. 

పుప్పొడి వస్తలే.. 

సీడ్ పత్తి పంటను సాగు చేయాలంటే మెయిల్, ఫిమేల్ (సీడ్ విత్తనాలు) ముందుగా నాటుతారు. తర్వాత మగ చెట్లకు వచ్చిన పుప్పొడితో ఆడ చెట్లకు పాలినేషన్​ చేయాల్సి ఉంటుంది. అలా ప్రతిరోజూ పాలినేషన్​ చేస్తేనే కాయలు కాస్తాయి. అయితే రోజులు గడుస్తున్నా ఇంకా చెట్లకు పుప్పొడి రాకపోవడంతో పాలినేషన్​ సమస్య ఎదురవుతోంది. 

ఎండల వల్ల ఆలస్యం.. 

సాధారణ వాతావరణ పరిస్థితులు ఉంటే.. ఏటా సీడ్ విత్తనాలను ఏప్రిల్ చివర్లో పెడతారు. ఈ సారి కూడా రైతులు ఏప్రిల్​ చివర్లో సాగు చేసినప్పటికీ.. మే నెలలో కూడా ఎండల తీవ్రంగా కొట్టాయి. దీంతో తొలిదశలోనే సీడ్​పై ప్రభావం పడినట్టు రైతులు చెబుతున్నారు. ఎండ ఎఫెక్ట్ కు మొక్కలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో రైతులు 30 శాతం మేర పంటలను తొలగించారు. పుప్పొడి వచ్చి, పాలినేషన్​ సరిగ్గా జరిగి ఉంటే.. ఎకరాకు 5 క్వింటాల నుంచి 8 క్వింటాల పత్తి దిగుబడి వస్తుందని, కానీ, ఇప్పుడు మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం కూడా లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. 
మరికొన్ని చోట్ల పంటకు ఎర్రతెగులు సోకినట్టు రైతులు గుర్తించారు. 

రైతుకు తీవ్ర నష్టం

తెగుళ్లతో ఒక్కొక్క రైతు ఎకరాకు రూ. 20వేల వరకు నష్టపోయారు. సుంకు రాకపోవడంతో దాదాపు ఎకరాకు రూ. 30 నుంచి 40 వేల వరకు రైతుకు నష్టం వాటిల్లుతున్నది. 

వాతావరణం అనుకూలిస్తే సుంకు వస్తుంది

సీడ్​ పత్తి పంటలో సుంకు రావడం లేదు. ఇదే విషయాన్ని కంపెనీల దృష్టికి తీసుకెళ్లి, వారిని పిలిపించి సీడ్ పత్తి పంటలను పరిశీలిస్తాం. వాతావరణం కూల్ అయ్యే కొద్ది సుంకు వస్తుంది. కొన్ని చోట్ల సుంకు రావడం ఇప్పుడే మొదలైంది. రైతులకు నష్టం జరగకుండా చూస్తాం.
- గోవింద నాయక్, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్, గద్వాల.