రైతుల దోస్తు.. రాజ్‌

రైతుల దోస్తు.. రాజ్‌

పురుగుల మందులతో పండించని, క్వాలిటీ ఆహారాన్ని జనానికి అందించాలనే మంచి మనసులతో హైదరాబాద్ ‌వాసి సీలం రాజ్‌ సేంద్రీయ వ్యవసాయాన్ని ఎంకరేజ్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన 45 వేల మందికి సేంద్రీయ సాగును నేర్పించారు. వారి జీవితాల్లో వెలుగులు నింపారు. మార్కెట్‌ ధరతో పోలిస్తే ఈ రైతులకు 30 శాతం ఆదాయం ఎక్కువ వస్తోంది. అంతేకాదు వాళ్ల పంటలు 50కిపైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 

వెలుగు, బిజినెస్‌‌ డెస్క్‌‌:సీలమ్‌‌ రాజ్‌‌ భూమిని ప్రేమించే మనిషి. మట్టిని పురుగుల మందులతో కలుషితం చేయడాన్ని ఇష్టపడరు. అందుకే, రైతులను సేంద్రీయ సాగువైపు మళ్లించేలా చేయడానికి ఎంతో కష్టపడ్డారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చారు.  స్వయంగా శ్రేష్టా నేచురల్‌‌ బయోప్రొడక్ట్స్‌‌ను నెలకొల్పారు. ‘24 మంత్ర’ బ్రాండ్‌‌ పేరిట ఆయన సేంద్రీయ ఆహారాన్ని అమ్ముతున్నారు. 1988లో హైదరాబాద్ కాలేజీ నుంచి అగ్రికల్చర్‌‌ గ్రాడ్యుయేట్ పట్టా తీసుకున్నాక పురుగుమందుల తయారీ కంపెనీలో చేరారు.  ఈ సందర్భంగా ఆయన కొన్ని బాధాకర విషయాలను గమనించారు. పురుగుల మందులు కీటకాలతోపాటు భూమిసారాన్ని పరిరక్షించే బ్యాక్టీరియాలను చంపుతున్నాయని గ్రహించారు.  “కాలీఫ్లవర్, క్యాబేజీ, క్యాప్సికమ్, బంగాళాదుంప  వంటి వాటికి మనం విషంతో స్నానం చేయిస్తున్నాం. కొంతమంది రైతులు 60 రోజుల పంట కోసం కోసం 2-–3 రౌండ్ల రసాయన ఎరువులను పిచికారీ చేస్తున్నారు’’ అని ఆయన వివరించారు.   పురుగుల మందుల వాడకం వల్ల నేలసారం తగ్గడమే గాక పంట దిగుబడులూ తక్కువ అవుతాయి. ‘‘కొంతమంది  రైతులు అప్పుల వలయంలో చిక్కుకొని ఆత్మహత్యలు చేసుకోవడాన్ని కళ్లారా చూశాను. వాళ్లు కనీసం పెట్టుబడిని కూడా రాబట్టుకోలేకపోయారు. సస్టెనబుల్‌‌ అగ్రికల్చర్‌‌ రైతులకు ఎంతో ముఖ్యమని1990లలోనే నేను గమనించాను”అని ఆయన చెప్పారు.

తండ్రి మరణంతో ..

రాజ్‌‌ తండ్రి 1999లో కేన్సర్​తో మరణించారు.  పురుగుమందులతో పండించిన ఆహారంతోపాటు పర్యావరణ కాలుష్యమే ఆయనను చంపాయని స్పష్టం చేశారు. తండ్రిని కోల్పోయాక రాజ్ తన ఉద్యోగాన్ని వదిలేశారు. 2004 లో శ్రేష్టా నేచురల్ బయోప్రొడక్ట్స్ ను ప్రారంభించారు. ఇప్పటి వరకు ఆయన 45 వేల మంది రైతులకు సేంద్రీయ వ్యవసాయాన్ని నేర్పించారు. అంతేగాక వాళ్లు తమ పంటలను రాజ్‌‌ కంపెనీకి అమ్ముతారు. వీటిని 24 మంత్ర బ్రాండ్ పేరుతో మార్కెట్‌‌ చేస్తారు. దీనివల్ల రైతులకు మార్కెట్ ధర కంటే 30 శాతం ఎక్కువ సంపాదన వస్తుంది.  ‘‘సేంద్రీయ వ్యవసాయంపై నేను కొన్నేళ్లు పరిశోధన చేశాను. రైతుల నుంచి సేంద్రీయ ఉత్పత్తులను తీసుకొని అమ్మాలని నిర్ణయించుకున్నాను. రాజస్థాన్‌‌లోని నహర్‌‌గఢ్‌‌, మహారాష్ట్రలోని అకోలా జిల్లాలోని ముర్తజాపూర్ రైతులతో కలిసి పనిచేయడం ప్రారంభించాను” అని ఆయన వివరించారు. ఆర్గానిక్‌‌ ప్రొడక్టులను 2005లో అమ్మేందుకు ప్రయత్నించినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. హైదరాబాద్, బెంగళూరు, పూణే  చెన్నైలోని కంపెనీ అవుట్‌‌లెట్లకు నష్టాలు వచ్చాయి. ‘‘జనానికి అవగాహన కల్పించడం ద్వారా ఈ పరిస్థితిని మార్చవచ్చని నాకు అనిపించింది. ఉత్పత్తులను రైతు సంఘాల ద్వారా అమ్ముతూనే, కస్టమర్లలో చైతన్యం తేవాలని మేము నిర్ణయించుకున్నాము” అంటూ అప్పటి సంగతులను రాజ్ గుర్తుచేసుకున్నారు.  
క్వాలిటీకి ఇంపార్టెన్స్‌‌
తమ ప్రొడక్టులన్నీ ఐదుసార్లు తనిఖీ అవుతాయని రాజ్ చెప్పారు. క్వాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామని, బ్యాక్టీరియాను పూర్తిగా తొలగిస్తామని అన్నారు.  పొలాల దగ్గరే వ్యవసాయ శాస్త్రవేత్తలు కంపోస్ట్, బయోపెస్టిసైడ్స్  బయో ఫెర్టిలైజర్ల నాణ్యతను చూస్తారు.  ఈ విషయమై రాజస్థాన్‌‌ రైతు బల్‌‌దేవ్‌‌ సింగ్ మాట్లాడుతూ  “నేను 5 ఎకరాల భూమిలో పండించే కంపెనీకి గోధుమలను రాజ్​ కంపెనీకి అమ్ముతున్నాను. మార్కెట్ ధరతో పోలిస్తే  కిలోకు రూ.200 ఎక్కువ ఇస్తారు. పంట అమ్మిన తర్వాత రెండు నెలల్లోపు ఖాతాలో డబ్బు జమ అవుతుంది” అని చెప్పారు. మరిన్ని భూముల్లో సేంద్రీయ వ్యవసాయాన్ని జరిపించడానికి రాజ్‌‌ ప్రయత్నిస్తున్నారు. ‘‘పాత పద్ధతుల్లో వ్యవసాయమే బెటర్‌‌. మట్టిలోని బ్యాక్టీరియా నేలకు మంచిచేస్తుంది. నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇస్తాయి. ప్రకృతిని కాపాడుకోకుంటే మన మనగడే లేదు”అంటూ రాజ్‌‌ నిజాన్ని నిర్మొహమాటంగా చెబుతారు.

రైతు మనసును మార్చడం కష్టం...

రైతుల ఆలోచనను మార్చడం కష్టమని రాజ్ అంటారు. "రసాయన ఎరువులతోనే మంచి పంట వస్తుందని వాళ్లు అనుకుంటారు.   భూమి సేంద్రీయ నేలగా మారడానికి 3–-4 సంవత్సరాలు పడుతుంది. దీనివల్ల దిగుబడి మొదటి కొన్నేళ్లలో తక్కువగా ఉంటుంది.  రైతుల్లో చైతన్యం తేవడానికి వారిని సేంద్రీయ సాగు జరుగుతున్న చోట్లకు తీసుకెళ్లి చూపించాం. వారి ఖర్చులు ఎలా తగ్గుతాయో, నేల ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందో వివరించాం” అని ఆయన చెప్పారు.  సేంద్రీయ విధానంలో సాగు చేసే రైతులకు  మార్కెట్ ధర కంటే 10–-30 శాతం ఎక్కువ ధర ఇస్తామని రాజ్‌‌ మాటిచ్చారు. "మార్కెట్లో పసుపు ధర కిలోకు రూ .35 ఉంటే, మేము వారికి రూ .55 చెల్లించాం. దీంతో చాలా మంది చేరడం ప్రారంభించారు  ప్రస్తుతం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాతో సహా 15 రాష్ట్రాలలో 2 లక్షల ఎకరాల భూమిలో సేంద్రీయ సాగు జరుగుతోంది.  జమ్మూ, మధ్యప్రదేశ్, రాజస్థాన్  మహారాష్ట్రలో చాలా భూములను సేంద్రీయ పొలాలుగా మార్చాం ”అని ఆయన చెప్పారు. భారతదేశంలోని 10 వేల షాపుల్లో   200 కి పైగా 24 మంత్ర ప్రొడక్టులు అందుబాటులో ఉన్నాయి.  వీటిని 50 దేశాలకు ఎగుమతి కూడా చేస్తున్నారు. సేంద్రీయసాగు  కఠినంగా ఉండడంతో, మొదలుపెట్టిన వారిలో దాదాపు ఆరు శాతం మంది రైతులు ఈ పద్ధతిని వదిలేశారు.