సీలేరు పవర్ ప్రాజెక్టును బీఆర్ఎస్ వల్లే కోల్పోయినం : జీవన్ రెడ్డి

సీలేరు పవర్ ప్రాజెక్టును బీఆర్ఎస్ వల్లే కోల్పోయినం : జీవన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఉద్యమ పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ నేతలు.. తెలంగాణ వాటా నీటిని ఏపీ అక్రమంగా తరలించుకుపోతున్నా మౌనంగా ఉండిపోయారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ఏమీ చేయలేకపోవడం వల్లే భద్రాచలంలోని ఏడు మండలాలను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ స్వార్థపూరిత రాజకీయాల వల్లే సీలేరు పవర్ ప్రాజెక్టును కోల్పోయామని, దానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్​లో మాట్లాడారు. 


ప్రతి విషయంలోనూ బీఆర్ఎస్ విఫలమైందన్నారు. ఎన్టీపీసీ ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్​ను పొందే హక్కు తెలంగాణకు ఉందని, కానీ.. కనీసం 2600 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు చేయడంలో కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయారని విమర్శించారు. ఐటీఐఆర్ తేవడంలోనూ ఘోరంగా విఫలమయ్యారని ఫైర్ అయ్యారు. విభజనచట్టంలోని హక్కులను సాధించడంలోనూ విఫలమయ్యారన్నారు. కాళేశ్వరాన్ని టూరిస్ట్ స్పాట్​గా చేసిందే బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, నేతలు, ప్రజలను ప్రాజెక్టును చూపించడానికి బస్సుల్లో తీసుకెళ్లలేదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతి మొత్తాన్ని బయటపెడతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తీసుకెళ్లాలనే సీఎం రేవంత్​ నిర్ణయం శుభపరిణామమన్నారు.

పీవీ కాంగ్రెస్ వాది

పీవీ నర్సింహారావు కాంగ్రెస్​వాది అని జీవన్ రెడ్డి అన్నారు. కానీ, ఆయనపై సభలో హరీశ్ రావు ప్రేమ ఒలకబోయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పీవీ నర్సింహారావు సీఎంగా, పీఎంగా ఎన్నో మంచి పనులు చేశారన్నారు. ఏ పదవి చేపట్టినా దానికి వన్నె తెచ్చారన్నారు. హైదరాబాద్​లో అంతిమయాత్ర చేపట్టాలని పీవీ కుటుంబ సభ్యులే కోరారని, అందుకు అనుగుణంగానే అన్ని లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారని గుర్తు చేశారు. పీవీ విషయంలో బీఆర్ఎస్ లీడర్లు ఇప్పుడు విమర్శలు చేయడం బాధాకరమన్నారు.