ఈ బీజేపీ లీడర్లకు సంప్రదాయాలు, సంస్కారం తెలియదు

ఈ బీజేపీ లీడర్లకు సంప్రదాయాలు, సంస్కారం తెలియదు
  • గవర్నర్ స్పీచ్‌ను బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుకోవడంపై బెంగాల్ సీఎం మమత ఫైర్

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ జగ్‌దీప్ ధన్‌ఖర్ స్పీచ్‌ను బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుకోవడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె సభలో మాట్లాడుతూ వీళ్లకు పద్ధతి, సంప్రదాయాలు, సంస్కారం లాంటివి తెలియదంటూ ఫైర్ అయ్యారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించిన మమతా పార్టీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చాక జులై 2న తొలిసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఆ రాష్ట్ర గవర్నర్ జగ్‌దీప్ ధన్‌ఖర్ ప్రసంగించారు. అయితే 18 పేజీ ప్రసంగాన్ని గవర్నర్ చదవడం మొదలుపెట్టిన కొద్దిసేపటికే సభలో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం తర్వాత జరిగిన హింస, అనేక మంది బీజేపీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా నినాదాలు చేశారు. దీంతో అసెంబ్లీలో అలజడి రేగడంతో గవర్నర్ ప్రసంగాన్ని పూర్తి చేయకుండానే సభ నుంచి వెళ్లిపోయారు. 
రాజ్‌నాథ్ నుంచి సుష్మా దాకా చాలా మందిని చూశా..
గవర్నర్ ప్రసంగం సమయంలో జరిగిన ఆందోళనల తీరుపై మంగళవారం సభలో సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ‘‘కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే నియమించిన గవర్నర్‌‌ను ఇక్కడ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలే అడ్డుకున్నారు. రాజ్‌నాథ్ సింగ్ నుంచి సుష్మా స్వరాజ్ వరకూ అనేక మంది బీజేపీ లీడర్లను చూశాను. కానీ, ఇక్కడున్న ఈ బీజేపీ పూర్తిగా డిఫరెంట్‌గా ఉన్నారు. వీళ్లకు (బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యేలకు) సంస్కరం, సంప్రదాయాలు, పద్ధతి, నాగరికత లాంటివి లేవు”అని ఆగ్రహం వ్యక్తం చేశారు.