తీన్మార్ మల్లన్నను ఓడించేందుకు.. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: సీతక్క

తీన్మార్ మల్లన్నను ఓడించేందుకు.. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: సీతక్క

బీఆర్ఎస్ పార్టీపై మంత్రి సీతక్క ఫైరయ్యారు. పెంపుడు మనుషులను పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వాళ్లు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు. ములుగు జిల్లా మండలంలోని ఇంచెర్ల గ్రామం MR గార్డెన్ లో ఉమ్మడి వరంగల్, ఖమ్మం నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  ప్రజల పక్షాన పోరాడిన తీన్మార్ మల్లన్నపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు కేసులుపెట్టి జైలుకు పంపిందన్నారు. వందల కోట్లు ఖర్చుపెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలవకుండా చేయాలని తీవ్ర ప్రయత్నం చేశారని చెప్పారు. ఇప్పుడు పట్టబద్రుల ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నపై కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.

ఆదివాస బిడ్డనైన తనను మంత్రిగా చూసి కొంతమంది ఓర్చుకోలేకపోతున్నారని మంత్రి అన్నారు. మొదటి విడుతగా సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ ప్రోత్సాహకంగా ప్రకటించామని..  దొడ్డు వడ్లను కొనమని ఏ ఒక్క సందర్భంలో అనలేదని స్పష్టం చేశారు. తినడానికి ప్రతి ఒక్కరికి సన్నబియ్యం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొంటుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఫస్ట్ తారీకు రాగానే అందరికీ జీతాలు ఇస్తున్నామని చెప్పారు. రైతుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని సీతక్క చెప్పారు.