
- ఏడుపాయల హుండీ కొల్లగొట్టి అత్తగారింట్లో వాషింగ్‌మెషిన్‌లో దాచిండు
- చోరీ సొత్తు స్వాధీనం.. పరారీలో దొంగ
మెదక్/చిలప్ చెడ్, వెలుగు: ఏడుపాయల గుడిలో హుండీని కొల్లగొట్టిన దొంగ ఆ డబ్బులను అత్తగారింటి దగ్గర ఉన్న వాషింగ్‌మెషిన్‌లో దాచిండు. శనివారం పోలీసులు చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 19న రాత్రి ఓ దొంగ మెదక్ జిల్లా ఏడుపాయల వన దుర్గామాత ఆలయం కిటికీ ఊచలు కోసి గర్భగుడిలో చొరబడి హుండీ పగలగొట్టి నగదు, నగలు ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. పోలీసులు దొంగలను పట్టుకునేందుకు స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఆలయంలో ఉన్న సీసీ ఫుటేజీ ద్వారా దొంగ ఒక్కడే వచ్చినట్టు గుర్తించారు. అతను ఏడుపాయల నుంచి పోతంశెట్టిపల్లి, మెదక్ - హైదరాబాద్ నేషనల్ హైవే మీదుగా వెళ్లినట్టు గుర్తించారు. హైవే మీద వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు శనివారం చిలప్ చెడ్ మండలం శిలాంపల్లిలోని ఓ ఇంటి ఆవరణలో ఉన్న వాషింగ్ మెషిన్లో దాచిపెట్టిన చోరీ సొత్తును గుర్తించారు. వాషింగ్ మెషిన్లో మూటలో కట్టిపెట్టిన నగదును మెదక్ డీఎస్పీ సైదులు, కొల్చారం ఎస్సై శ్రీనివాస్ గౌడ్, చిలప్ చెడ్ఎస్సై రమేశ్ ఆధ్వర్యంలో లెక్కించగా రూ. 2 లక్షల 36,260 ఉన్నట్టు తేలింది. వీటితో పాటు నాలుగు డాలర్ నోట్లు ఉన్నాయి. అలాగే భక్తులు మొక్కుబడిగా సమర్పించిన వెండి తొట్టెలు, పుస్తెలతాడు, బంగారు పుస్తెలు, ముక్కు పోగు, 4 వెండి బిస్కెట్లు, అమ్మవారి కాళ్ల పట్టీలు, 107 వెండి కండ్లు, వీవో 21, రియల్ మీ, శాంసంగ్ కంపెనీలకు చెందిన లేటెస్ట్ మాడల్ సెల్ ఫోన్ లు నాలుగు లభించాయి. హుండీలో నుంచి నగదు ఎత్తుకెళ్లిన తరువాత దొంగ రూ.500, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లను వేటికవి సెపరేట్ చేసి కట్టలు కట్టిపెట్టడం గమనార్హం. చోరీకి పాల్పడింది కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సమీపంలోని ఆత్మకూర్ గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డిగా పోలీసులు గుర్తించారు. అతను ఆలయం హుండీ నుంచి ఎత్తుకొచ్చిన నగదు, నగలను చిలప్ చెడ్ లోని తన అత్తగారి ఇంటి వద్ద వాషింగ్ మెషిన్లో దాచి పెట్టాడు. లక్ష్మారెడ్డి పరారీలో ఉన్నట్లు డీఎస్పీ సైదులు చెప్పారు. అతని కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామన్నారు. చోరీ జరిగిన రెండు రోజుల్లోనే నగదు, నగలను స్వాధీనం చేసుకున్న పోలీసులను డీఎస్పీ అభినందించారు.