
- జడ్పీటీసీ స్థానానికి ఐదుగురితో కాంగ్రెస్ లిస్ట్
- ఎంపీటీసీకి ముగ్గురు పేర్ల సిఫార్సు
- సర్పంచ్పోటీకి బుజ్జగింపులు
- బూత్ కమిటీలవారీగా బీజేపీ సర్వే పూర్తి
- ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఆశలు
- బలమున్న చోట పోటీకి మజ్లిస్ సన్నాహాలు
నిజామాబాద్, వెలుగు : లోకల్‌బాడీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రధాన పార్టీల్లో దాదాపు ఫైనల్ అయ్యింది. జిల్లాలో పోటీకి రెడీగా ఉన్న క్యాండిడేట్ల లిస్ట్‌ను కాంగ్రెస్ ముఖ్యనేతలు ప్రిపేర్ చేసి హైకమాండ్పంపారు. సర్పంచ్ స్థానాల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న కార్యకర్తలను బుజ్జగించి ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేయాలని సూచిస్తున్నారు.
బూత్ లెవల్ కార్యకర్తల అభిప్రాయ సేకరణతో అభ్యర్థులను నిలబెట్టేందుకు బీజేపీ కసరత్తు మొదలు పెట్టింది. కోర్టు ఆదేశాలకు సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న సందర్భంగా పార్టీ ఫిరాయింపుపై బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. బలమున్న చోట బరిలోకి దిగడానికి మజ్లిస్ సిద్ధమవుతోంది.
కాంగ్రెస్ నుంచి పోటీకి డిమాండ్..
జిల్లాలో 31 జడ్పీటీసీ, 307 ఎంపీటీసీ స్థానాలు, 545 గ్రామ పంచాయతీలు, 5,022 వార్డులకు ఎన్నికలు నిర్వహించడానికి యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో పార్టీ మరింత విస్తరించింది. స్థానిక ఎలక్షన్లో పోటీ చేయడానికి క్యాడర్ భారీ సంఖ్యలో పోటీ పడుతుండడంతో సెగ్మెంట్ నేతలు బేజారవుతున్నారు. ఫైనల్ నిర్ణయాన్ని హైకమాండ్‌పై వదిలేస్తూ ప్రతి జడ్పీటీసీ స్థానం నుంచి ఐదుగురి పేర్లను ఎంపిక చేసి సోమవారం డీసీసీ నుంచి టీపీసీసీకి జాబితా పంపారు.
పార్టీలో సీనియారిటీ, ప్రజాబలం, కార్యకర్తలతో సంబంధాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని జాబితాను రూపొందించారు. సర్పంచ్ స్థానానికి పోటీకి ప్రతి విలేజ్‌లో ఐదు నుంచి ఎనిమిది మంది సై అంటుండడంతో ముఖ్యనేతలు ఎంటర్అయ్యారు. వారి మధ్య రాజీకుదర్చడానికి మాజీ మంత్రి, బోధన్ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి రాయబారాలు నడుపుతున్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మండల నేతలతో సర్దుబాట్లు చేశారు.
జడ్పీ పీఠంపై ఫోకస్..
ఈసారి జిల్లా పరిషత్కుర్చీపై బీజేపీ ఫోకస్ పెట్టింది. జిల్లాలో ఎంపీ అర్వింద్నాయకత్వంలోనే పార్టీ వ్యవహారాలు నడుస్తున్నాయి. జడ్పీ పీఠం దక్కించుకొని పార్టీని మరింత విస్తరించేందుకు ప్రణాళిక రచించారు. కార్యకర్తల బలం ఉన్న నాయకుడిని బరిలో దింపేందుకు బూత్లెవెల్సర్వే కంప్లీట్ చేశారు. ప్రతి జడ్పీటీసీ స్థానం నుంచి ముగ్గురి పేర్లను ఇప్పటికే సేకరించారు.
వారిలో ఒకరిని ఫైనల్ చేయడానికి తుది కసరత్తు జరుగుతోంది. బీఆర్ఎస్నుంచి పోటీ చేయడానికి క్యాడర్ ముందుకు రావడం లేదు. అయితే కాంగ్రెస్, బీజేపీ నుంచి పోటీ చేసే ఛాన్స్రాకపోతే పార్టీ మారేవారిపై బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. బీజేపీని దెబ్బతీయడానికి రెంజల్, సాలూరా జడ్పీటీసీ, ఎడపల్లిలో రెండు ఎంపీటీసీ స్థానాల్లో పోటీకి మజ్లిస్ సిద్ధమవుతోంది.