హాలీడే కోసం పంపలే.. చాన్స్ ఇస్తే నిరూపించుకోవాలె

హాలీడే కోసం పంపలే.. చాన్స్ ఇస్తే నిరూపించుకోవాలె

కొలంబో: ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా సోకడంతో భారత్, శ్రీలంక మధ్య జరగాల్సిన రెండో టీ20 నిర్వహణపై అనుమానాలు రేకెత్తాయి. అయితే ఎట్టకేలకు ఈ మ్యాచ్ జరిగింది. భారత యంగ్ ఆటగాళ్లు పోరాడినప్పటికీ ఈ మ్యాచ్‌లో లంకదే పైచేయి అయ్యింది. అయితే మ్యాచ్‌కు ముందు కరోనా సోకిన కృనాల్‌ పాండ్యాకు సన్నిహితంగా మెలిగిన 9 మంది ప్లేయర్లను భారత్ పక్కన పెట్టింది. వారికి కొవిడ్ నెగెటివ్‌గా తేలినా.. ముందస్తుగా ఐసోలేషన్‌లో ఉంచింది. దీంతో దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రాణా, చేతన్ సకారియా లాంటి అరంగేట్ర ప్లేయర్లకు డెబ్యూ చాన్స్ వచ్చింది. ఒకే మ్యాచ్‌లో ఇంత మంది ప్లేయర్లకు అవకాశం రావడంపై కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. జట్టుతో ఉన్న ప్లేయర్లు ఎప్పుడు ఆడేందుకైనా సిద్ధంగా ఉండాలని ద్రవిడ్ అన్నాడు.

‘వన్డే సిరీస్ ముగిసిన తర్వాత కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని భావించాం. అయితే పరిస్థితుల ప్రభావం వల్ల ముందే ఆడించాల్సి వచ్చింది. ప్లేయింగ్ ఎలెవన్‌లో చాన్స్ రావడం చాలా కష్టం. అయితే మేం అనుకున్న దాని కంటే ముందే యంగ్ ప్లేయర్లకు చాన్స్ ఇస్తున్నాం. ఒక్కసారి భారత జట్టుకు ఎంపికైతే టాప్ 15 లేదా 20 మందిలో ఉన్నా టీమిండియాకు ఆడేందుకు అర్హులే. ఆటగాళ్లను వార్మప్ చేయడం కోసమైతే సెలెక్టర్లు ఎంపిక చేయరు కదా? హాలీడే కోసం పంపలేదు కదా? ప్రతిసారి అవకాశాలు రావు. చాన్స్ ఉన్నప్పుడల్లా ఆటగాళ్లకు టీమ్‌లో చోటు కల్పిస్తాం. వారు తమను తాము నిరూపించుకోవాలి’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు.