లోన్‌ ఇస్తరు..తీసుకుంటరా?

లోన్‌ ఇస్తరు..తీసుకుంటరా?

మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పుడే…. ఆ దేశం ప్రగతిపథంలో నడుస్తోందని అర్థం. అలా ఆర్థికంగా ఎదగాలనుకుంటున్న మహిళలను ప్రోత్సహించేందుకు మన దేశంలో బోలెడన్ని స్కీములున్నాయి. అయినా వాటిని ఉపయోగించుకుంటున్న మహిళలు కొందరే. అంతేకాదు, ఆ స్కీముల గురించి కూడా చాలామందికి తెలియదు.

క్యాటరింగ్ దగ్గరి నుంచి టైలరింగ్, బ్యూటీ పార్లర్​ వరకు ఏదో ఒక చిన్న వ్యాపారం చేసి లక్షలు కాకపోయినా… వేలైనా సంపాదించుకోవాలనుకునే మహిళలు ఎందరో. అలాంటి వాళ్లకు తక్కువ మిత్తితో పెద్ద మొత్తాన్ని అందజేసేందుకు చాలా బ్యాంకులు ముందుకొస్తున్నాయి. ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టి… వ్యాపారాన్ని సంతోషంగా ప్రారంభించొచ్చు. తామూ ఆర్థికంగా స్థిరపడ్డామని గర్వంగా చెప్పుకోవచ్చు. ఆ స్కీములేంటో చూద్దాం.

అన్నపూర్ణ స్కీమ్​

ఈ స్కీమ్​ కింద భారత ప్రభుత్వం క్యాటరింగ్​ బిజినెస్​ చేయాలనుకునే మహిళలకు రుణంగా రూ.50,000 వరకు అందిస్తుంది. ఆ డబ్బుతో వాళ్లు గిన్నెలు, గ్యాస్​ కనెక్షన్​, ఫ్రిజ్​, గ్రైండర్, వాటర్​ ఫిల్టర్​, టిఫిన్​ బాక్సులు మొదలైనవి కొనుక్కోవచ్చు. ఒకసారి డబ్బులు చేతికి అందాక… వాటిని మూడు సంవత్సరాల వరకు నెలనెలా వాయిదాల్లో కట్టాల్సి ఉంటుంది. అయితే లోన్​ వచ్చిన మొదటి నెలనే కట్టాల్సిన పని లేదు. మిత్తి కూడా మార్కెట్​ రేట్ ​ప్రకారం తక్కువగానే ఉంటుంది.

స్త్రీ శక్తి ప్యాకేజీ

‘స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా’ మాత్రమే అందిస్తున్న ప్యాకేజీ ఇది. చిన్న వ్యాపారంలోనైనా సరే సదరు మహిళకు సగం వాటా ఉండాలి. అలాగే ‘ఎంట్ర​ప్రెన్యూర్​షిప్​ డెవలప్​మెంట్​ ప్రోగ్రామ్​’లో కచ్చితంగా రిజిస్టర్​ చేసుకోవాలి. అలాంటి వాళ్లకు బ్యాంకు రుణం లభిస్తుంది. రెండు లక్షల రూపాయల లోపైతే… మిత్తిలో 0.05 శాతం మినహాయింపు కూడా ఉంటుంది. రుణం మొత్తం ఐదు లక్షల రూపాయలు లోపైతే ఎలాంటి సెక్యూరిటీ అవసరం ఉండదు.

కల్యాణి స్కీమ్​ (సీబీఐ)

ఈ పథకాన్ని కేవలం సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (సీబీఐ) మాత్రమే అమలు చేస్తోంది. వ్యవసాయం, హ్యాండీక్రాఫ్ట్స్, బ్యూటీ పార్లర్, క్యాంటీన్​, మొబైల్​ రెస్టారెంట్, జిరాక్స్​ బూత్​, టైలరింగ్​ వంటి పనులను ప్రారంభించేందుకు మహిళలకు ఆర్థికసాయం అందించడమే ఈ స్కీమ్​ ఉద్దేశం. లక్ష నుంచి కోటి రూపాయల వరకు లోన్​ సదుపాయం ఉంటుంది. అలాగే ఎంత మొత్తం తీసుకున్నా, మిత్తి మాత్రం ఏడాదికి ఇరవై శాతం వరకు ఉంటుంది. లోన్​ చెల్లింపులు ఏడు సంవత్సరాల లోపు కట్టేయాలి.

మహిళా ఉద్యమ నిధి

పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​, స్మాల్​ ఇండస్ట్రీస్​ డెవలప్​మెంట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఎస్ఐడీబీఐ) మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. చిన్న వ్యాపారాలు ప్రారంభించేందుకు ఈ పథకం కింద పది లక్షల రూపాయల వరకు రుణం లభిస్తుంది. ఆ మొత్తాన్ని వాయిదా లెక్కన పదేళ్లలో పూర్తిగా కట్టాలి. బ్యూటీ పార్లర్​, డే కేర్​ సెంటర్​, ఆటో రిక్షా, కారు కొనుగోలు మొదలైన వాటికి రుణం అందిస్తుంది ఎస్​ఐడీబీఐ.

దేనా శక్తి స్కీమ్​

వ్యవసాయం, తయారీ రంగం, కిరాణ దుకాణం… ఇలాంటి పనులకు ఈ పథకం కింద ఇరవై లక్షల రూపాయల వరకు రుణం వస్తుంది. అంతేకాదు మార్కెట్​లో ఉన్న మిత్తి కంటే 0.25 శాతం తక్కువగా ఉంటుంది.

ఓరియంట్​ మహిళా వికాస్​ యోజన

ఈ పథకాన్ని ‘ఓరియంటల్​ బ్యాంక్​ ఆఫ్​ కామర్స్’ ప్రారంభించింది. ఏ వ్యాపారంలోనైనా సదరు మహిళకు యాభైశాతం షేర్​ ఉండాలి. అప్పుడు వాళ్లకు పది లక్షల రూపాయల నుంచి పాతిక లక్షల రూపాయల వరకు లోన్​ లభిస్తుంది. తీసుకున్న మొత్తాన్ని ఏడు సంవత్సరాల లోపు కట్టాలి. రెండు రూపాయల లెక్కన మిత్తి కట్టాలి.

భారతీయ మహిళా బ్యాంక్​ బిజినెస్​ లోన్​

ఈ పథకాన్ని 2013లో ప్రారంభమైన ‘భారతీయ మహిళా బ్యాంక్​’ ప్రారంభించింది. అయితే 2017లో అది ‘స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​​ ఇండియా’లో విలీనం అయింది. మహిళా వ్యాపారులు బిజినెస్​ లోన్​ కింద రూ.20 కోట్ల వరకు రుణం తీసుకోవచ్చు. మార్కెట్​లో ఉన్న మిత్తిలో 0.25 శాతం మినహాయింపు కూడా లభిస్తుంది.

ప్రధాన మంత్రి ‘ముద్ర యోజన’

ప్రభుత్వరంగ బ్యాంకులన్నింటిలోనూ ఈ స్కీమ్​ అమల్లో ఉంది. బ్యూటీ పార్లర్​, ట్యూషన్​ సెంటర్​, టైలరింగ్​ యూనిట్ వంటి వ్యాపారాలు మొదలుపెట్టడానికి బ్యాంకులు యాభై వేల నుంచి యాభై లక్షల రూపాయల వరకు రుణం అందిస్తాయి. పది లక్షల రూపాయల వరకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు.