ప్రైవేట్​కు వడ్లు...పాలమూరు జిల్లాలో190 సెంటర్లలో ఆరింటినే తెరిచిన ఆఫీసర్లు

ప్రైవేట్​కు వడ్లు...పాలమూరు జిల్లాలో190 సెంటర్లలో ఆరింటినే తెరిచిన ఆఫీసర్లు

మహబూబ్​నగర్,వెలుగు : ఏప్రిల్​ ముగుస్తున్నా గ్రామాల్లో వడ్ల కొనుగోలు సెంటర్లను ఓపెన్​ చేస్తలేరు. కోతలు కోసి, వడ్లను ఆరబెట్టుతున్న టైంలో అకాల వర్షాలు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సెంటర్లు తెరవడంపై ఆఫీసర్లు కూడా క్లారిటీ ఇవ్వకపోవడంతో ప్రైవేట్​ వ్యక్తులకు తక్కువ రేట్​కే వడ్లను అమ్ముకుంటున్నారు.


3.50 లక్షల మెట్రిక్​ టన్నుల దిగుబడి..


మహబూబ్​నగర్​ జిల్లాలో రైతులు రికార్డు స్థాయిలో ఈ యాసంగిలో 1.10 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. దాదాపు 3.50 లక్షల మెట్రిక్​ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ ఆఫీసర్లు అంచనా వేశారు. దీని ప్రకారం జిల్లాలో ఐకేపీ ఆధ్వర్యంలో 99, పీఏసీఎస్​ ద్వారా 86, మెప్మా ద్వారా ఒకటి, డీసీఎంఎస్​ ద్వారా నాలుగు సెంటర్లను తెరిచి 2.49 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లు కొనుగోలు చేసేందుకు ప్రణాళిక చేశారు. కొనుగోలు చేసిన వడ్ల కోసం 62,43,770 సంచులు అవసరం ఉండగా, 37,36,500 అందుబాటులో ఉంచారు. సెంటర్లు ఈ నెల 15 నుంచే ఓపెన్​ చేయాల్సి ఉండగా, జిల్లావ్యాప్తంగా ఉన్న 190 సెంటర్లలో కేవలం ఇప్పటి వరకు ఆరింటిని మాత్రమే తెరిచారు.  


తక్కువ ధరకే అమ్ముకుంటున్రు..


ఓ వైపు అకాల వర్షాలు.. మరో వైపు వడ్ల సెంటర్లు ఎప్పుడు తెరుస్తారో స్పష్టత లేకపోవడంతో రైతులు ప్రైవేట్​ వ్యక్తులకు వడ్లను అమ్ముతున్నారు. మహబూబ్​నగర్​ రూరల్, కోయిల్​కొండ, చిన్నచింతకుంట, దేవరకద్ర, మిడ్జిల్, జడ్చర్ల, బాలానగర్​ ప్రాంతాల్లో రెండు వారాల కిందటే రైతులు వరి కోతలు పూర్తి చేసి, వడ్లను ఆరబెట్టుకున్నారు. కొద్ది రోజులుగా వర్షాలు పడుతుండడంతో వడ్లు తడిసి పోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీన్ని సాకుగా తీసుకున్న ప్రైవేట్​ వ్యాపారులు లారీలను తీసుకొని రైతుల పొలాల వద్దకు వెళ్తున్నారు. అక్కడే కాంటాలు పెట్టి వడ్లను కొంటున్నారు. వడ్లు తేమగా ఉన్నా పట్టించుకోవడం లేదు. మిడ్జిల్, జడ్చర్ల, బాలానగర్​ ప్రాంతాల్లో వడ్లు కొంచెం పచ్చిగా ఉండడంతో క్వింటాల్​కు రూ.1,500 నుంచి రూ.1,760 వరకు ధర చెల్లిస్తున్నారు. మహబూబ్​నగర్​ రూరల్, కోయిల్​కొండ, సీసీకుంట ప్రాంతాల్లో క్వింటాల్​కు రూ.1,650 నుంచి రూ.1,800 ఇస్తున్నారు. సెంటర్ల వద్దకు వడ్లను తీసుకెళ్లినా తేమ, తరుగు, తాలు పేరుతో ప్రతీసారి నిర్వాహకులు ఇబ్బందులు పెడుతున్నారని, వర్షాలు పడితే వడ్లు తడిసి ఆగమైతమని ప్రైవేట్​ వ్యాపారులు ఇచ్చిన రేట్​కే పంటను అమ్ముకుంటున్నారు. దీనికితోడు వడ్లను ప్రైవేట్​లో అమ్మడం ద్వారా ట్రాక్టర్​ కిరాయిలు, సెంటర్ల వద్ద కొనుగోళ్లు ఆలస్యమైతే వడ్లను వర్షం నుంచి కాపాడుకునేందుకు టార్పాలిన్​లు, సుతిలీల ఖర్చులు మిగిలిపోతాయని చెప్పుకుంటున్నారు. 


నిరుడు ఇదే పరిస్థితి..


గత సీజన్​లోనూ రైతులకు ఇదే పరిస్థితి ఎదురైంది. అప్పుడు అకాల వర్షాల భయం లేకున్నా, ఆఫీసర్లు సెంటర్లు తెరువడంలో జాప్యం చేశారు. దీంతో పంటను రైతులు పెద్ద మొత్తంలో ప్రైవేట్​ వ్యక్తులకే అమ్మారు. కర్నాటకలోని రాయచూర్​ ప్రాంతానికి చెందిన వ్యాపారులు కూడా జిల్లాకు లారీలను తీసుకొచ్చి వడ్లను కొనుగోలు చేశారు. ఆ సీజన్​లో 2 లక్షల మెట్రిక్​ టన్నుల వరకు ప్రభుత్వ సెంటర్ల ద్వారా కొనాల్సి ఉండగా, 90 వేల మెట్రిట్​ టన్నుల వడ్లను మాత్రమే రైతుల నుంచి 
సేకరించారు. 


తడుస్తయని అమ్మిన..
నాకున్న నాలుగు ఎకరాల్లో ఈ యాసంగిలో వరి వేసిన. రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టగా, 125 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రెండు వారాల నుంచి సెంటర్లు ఎప్పుడు తెరుస్తారని చూసిన. ఉరుములు, మెరుపులతో వర్షం పడుతుండడంతో భయంతో పచ్చి వడ్లనే ప్రైవేట్​ వ్యక్తికి అమ్మిన. క్వింటాల్​కు రూ.1,750 ఇచ్చిండు. 
- సతయ్య, రైతు, మిడ్జిల్​

ఇంకా 15 రోజులు అయితదట..
నేను పంట కోసి 10 రోజులవుతోంది. ఇప్పటిదాక సెంటర్​ను తెరుస్తలేరు. సొసైటీకీ పోయి అడిగితే, రెండు వారాలు టైం పడ్తదని చెబుతున్రు. అప్పటి వరకు పంటను ఎట్ల కాపాడుకోవాలె? కొందరు ప్రైవేట్​ వ్యక్తులకు వడ్లను అమ్ముకుంటున్రు. వడ్ల సెంటర్లను తొందరగా తెరవాలి.
- రాఘవేందర్ గౌడ్, రైతు, బొక్కలోనిపల్లి