20 ఏండ్ల తర్వాత నాకౌట్‌‌లో అడుగుపెట్టిన సెనెగల్‌‌

 20 ఏండ్ల తర్వాత నాకౌట్‌‌లో అడుగుపెట్టిన సెనెగల్‌‌

2–1తో ఈక్వెడార్‌‌పై గెలుపు 

అల్‌‌ రయాన్‌‌ (దోహా): నాకౌట్‌‌ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌లో సెనెగల్‌‌ సూపర్‌‌ పెర్ఫామెన్స్‌‌ చేసింది. కనీసం డ్రా చేసుకున్నా ప్రిక్వార్టర్స్‌‌ చేరుకునే అవకాశం ఉన్న ఈక్వెడార్‌‌కు షాకిచ్చింది. మంగళవారం జరిగిన గ్రూప్‌‌–ఎ పోరులో సెనెగల్‌‌ 2–1తో ఈక్వెడార్‌‌ను ఓడించింది. దాంతో, ఇరవై ఏండ్ల తర్వాత వరల్డ్‌‌కప్‌‌లో ప్రిక్వార్టర్స్‌‌ చేరుకుంది.   అద్భుత ఆటకు తోడు అదృష్టం కూడా కలిసిరావడంతో సెనెగల్‌‌  ఈ పోరులో గెలిచింది.

44వ నిమిషంలో లభించిన పెనాల్టీని ఇస్మైలా సర్‌‌ గోల్‌‌గా మలచడంతో ఆ జట్టు 1–0తో ఫస్టాఫ్‌‌ ముగించింది. సెకండాఫ్‌‌ మొదలైన తర్వాత మోయిసెస్‌‌ కైసెడో 67వ నిమిషంలో చేసిన గోల్‌‌తో ఈక్వెడార్‌‌ స్కోరు సమం చేసి రేసులోకి వచ్చింది. అయితే, మూడు నిమిషాల తర్వాత కెప్టెన్‌‌ కలిడౌ కౌలిబలీ అందించిన గోల్‌‌తో సెనెగల్‌‌ విజయం సొంతం చేసుకుంది. గ్రూప్‌‌–ఎలో రెండు విజయాలతో ఆ జట్టు ముందంజ వేయగా.. ఒక విజయం, ఓ డ్రా, మరో ఓటమితో ఈక్వెడార్‌‌ (4 పాయింట్లు) ఇంటిదారి పట్టింది.