
బీజేపీ నేత, కేంద్రమంత్రికి సీనియర్ నటి శోభన (Sobhana) మద్దతు ప్రకటించారు. తిరువనంతపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజీవ్ చంద్రశేఖర్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎంతోమందికి ప్రేరణగా నిలిచిన నటి తనకు మద్దతు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. ప్రగతి, అభివృద్ధికి అనుకూలంగా మార్పు రావాలని పలు వర్గాల ప్రజలు భావిస్తున్నారని.. ఇలాంటి ఐకాన్‌ల నుంచి మద్దతు పొందడం తనకెంతో గర్వంగా ఉందని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన రాజీవ్ చంద్రశేఖర్ ఈసారి తిరువనంతపురంలో కాంగ్రెస్ సీనియర్ నేత, సిట్టింగ్ ఎంపీ శశిథరూర్, సీపీఐ అభ్యర్థి పన్నయన్ రవీంద్రన్‌లను ఢీకొంటున్నారు.ఈ నెల 26న కేరళలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.
సోమవారం (ఏప్రిల్ 15న) ప్రధాని నరేంద్రమోదీ కేరళలో పర్యటించనున్నారు. పలు చోట్ల బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించి బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహిస్తారు. అయితే ఈ రోజు( ఏప్రిల్ 15) ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమాలకు తనకూ ఆహ్వానం అందిందని సీనియర్ నటి శోభన తెలిపింది. కేరళలో పర్యటించనున్న మోదీ త్రిసూర్ అభ్యర్థి సురేశ్ గోపీ తరపున అలత్తూరు నియోజకవర్గంలోని కున్నమంగళంలో, అనంతరం తిరువనంతపురం జిల్లాలోని కట్టక్కడలో కేంద్రమంత్రులు వి. మురళీధరన్, రాజీవ్ చంద్రశేఖర్‌లకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. ఈ ఏడాది త్రిశ్శూరులో ప్రధాని మోదీ పాల్గొన్న బీజేపీ మహిళా సాధికారిత సభకూ శోభన హాజరయ్యారు.