జీతం రూ.లక్షకుపైనే..3 వేల కోసం ఆశపడి.. ఏసీబీకి చిక్కిన సీనియర్ ​అసిస్టెంట్

జీతం రూ.లక్షకుపైనే..3 వేల కోసం ఆశపడి.. ఏసీబీకి చిక్కిన సీనియర్ ​అసిస్టెంట్
  • ఖమ్మం నుంచి బదిలీపై వెళ్లినా లంచం అడగడం ఆపలే..

ఖమ్మం టౌన్, వెలుగు : ఆమె జీతం రూ.లక్షకుపైనే.. అయినా..రూ. 3వేలకు ఆశపడి ఏసీబీకి చిక్కింది. ఖమ్మం జిల్లా పంచాయతీరాజ్​ ఇంజినీర్​ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్​గా పనిచేసిన బొడ్డు హరిత..ఇటీవలే సూర్యాపేట జిల్లా కోదాడ పీఆర్ డివిజన్ కు సూపరిండెంట్ గా ప్రమోషన్ పై వెళ్లింది. అయితే పెండింగ్​  పనులు పూర్తి చేయడం కోసం ఖమ్మం వచ్చిన ఆమె మంగళవారం రూ.3 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ రమేశ్​ కథనం ప్రకారం..కాంట్రాక్టర్ కానుమని మల్లికార్జున్ రావు నేలకొండపల్లి మండలం నాచేపల్లిలో 72.5 మీటర్ల సీసీ రోడ్డు వేశారు. ఈ పనులకు సంబంధించి రూ.2 లక్షల 59 వేల బిల్లులను ఆలస్యంగా మంజూరు చేశారు.

వీటికి 2 శాతం కమిషన్ (రూ.3 వేలు) ఇవ్వాలని సీనియర్ ​అసిస్టెంట్​ బొడ్డు హరిత కాంట్రాక్టర్ కు పదే పదే ఫోన్ చేస్తున్నారు. ఈ మధ్యే సూర్యాపేటకు బదిలీ కాగా అక్కడ చార్జ్​ తీసుకున్న ఆమె.. ఐదు రోజుల కింద పెండింగ్ ​పనులున్నాయని వచ్చారు. మళ్లీ మల్లికార్జున్​కు ఫోన్​ చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు జడ్పీలోని పంచాయతీ రాజ్​ఆఫీసులో రూ.3 వేలు లంచం ఇచ్చేందుకు వచ్చాడు. దీనికి ఆమె.. ఆఫీసులో ఇస్తే అందరూ చూస్తారని, టాయిలెట్​వైపు రావాలని కోరారు. అక్కడ లంచం ఇస్తుండగా ఏసీబీ రైడ్​ చేసి పట్టుకుంది. సీఐలు బి సునీల్ కుమార్, మహేష్, శేఖర్ పాల్గొన్నారు. బాధితుడు మల్లికార్జున్​రావు మాట్లాడుతూ నా బిల్లులు ఇవ్వడంలో లేట్​ చేయడమే కాకుండా లంచం  కావాలని సతాయిస్తుండడంతో ఏసీబీకి పట్టించానని చెప్పాడు.