హర్యానా నుంచి బీజేపీని తరిమికొట్టండి : రాహుల్​ గాంధీ

హర్యానా నుంచి బీజేపీని తరిమికొట్టండి : రాహుల్​ గాంధీ
  • ప్రజల మధ్య ద్వేషాన్ని పెంచుతున్నది: రాహుల్
  • హర్యానా నిరుద్యోగంలో అగ్రస్థానంలో ఎందుకుందో ప్రధాని మోదీ చెప్పాలని ప్రశ్న
  • కాంగ్రెస్​లో చేరిన బీజేపీ సీనియర్​నేత అశోక్​ తన్వర్​

చండీగఢ్: హర్యానాలో కాంగ్రెస్ హవా బలంగా ఉన్నదని.. ఓట్ల తుఫాను వస్తుందని.. త్వరలో పేదలు, రైతుల ప్రభుత్వం ఏర్పడుతుందని కాంగ్రెస్​ అగ్రనేత, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించి రాష్ట్రం నుంచి తరిమేయాలని ప్రజలను కోరారు. మతం, భాష, కులాల ప్రాతిపదికన బీజేపీ ద్వేషాన్ని పెంచుతున్నదని ఆరోపించారు. కాంగ్రెస్​ప్రేమను పంచే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.

గురువారం ఎన్నికల ప్రచారం చివరిరోజు హర్యానాలోని నూహ్​లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ‘‘దేశంలో అన్నింటికంటే ముఖ్యమైనది సోదరభావం.. కానీ బీజేపీ, ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎక్కడికి వెళ్లినా విద్వేషాలు రెచ్చగొడతాయి. ఆ నేతలు ఏ రాష్ట్రానికి వెళ్లినా భాష, మతం, కులం గురించి మాట్లాడుతరు” అని రాహుల్ ఆరోపించారు. హర్యానాలో పోరాటం నఫ్రత్(ద్వేషం).. మొహబ్బత్​(ప్రేమ) మధ్యనే ఉందన్నారు.

ALSO READ | తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణకు సుప్రీం ఆదేశాలు

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి సందర్భంలో అభివృద్ధి(వికాస్) గురించి మాట్లాడతారని.. అయితే దశాబ్దాలుగా బీజేపీ అధికారంలో ఉన్న హర్యానా నిరుద్యోగ లిస్ట్​లో ఎందుకు దేశంలోనే అగ్రస్థానంలో ఉందో మాత్రం ఆయన చెప్పరని ఎద్దేవా చేశారు. మోదీ ఎప్పుడూ సంపన్నుల మేలు కోసమే పనిచేస్తారని ఆరోపించారు. అతికొద్ది మంది కార్పొరేట్లకు రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన ఆయన రైతులు, మహిళలకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదన్నారు. 

తిరిగి కాంగ్రెస్ లోకి అశోక్ తన్వర్  

హర్యానా అసెంబ్లీ చివరి విడత పోలింగ్​కు ముందు బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ అశోక్ తన్వర్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం హర్యానాలోని మహేంద్రగఢ్ లో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా సభలో రాహుల్​ మాట్లాడుతూ తన్వర్​ తిరిగి తన సొంత ఇంటికి వచ్చారని తెలిపారు. కాగా, హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడాతో విభేదాల కారణంగా 2019లో తన్వర్​ కాంగ్రెస్‌‌‌‌ పార్టీని వీడారు. గతంలో ఆయన హర్యానా పీపీసీ చీఫ్​గా కూడా పనిచేశారు. అయితే కాంగ్రెస్​లో చేరడానికి రెండు గంటల ముందు వరకూ తన్వర్ బీజేపీ ర్యాలీలో పాల్గొనడం గమనార్హం.