ఇండియా కూటమికి 272 సీట్లు

ఇండియా కూటమికి 272 సీట్లు

న్యూఢిల్లీ : ఈ లోక్​సభ ఎన్నికల్లో ఇండియా కూటమి 272 ఎంపీ సీట్లు గెలుచుకొని బీజేపీని గద్దె దించుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. బీహార్  సీఎం నితీశ్​ కుమార్ గోడమీది పిల్లిలా ఎన్​డీఏలోకి జంప్​అయినప్పటికీ, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ఒంటరిగా బరిలో దిగాలని నిర్ణయించుకున్నప్పటికీ ‘ఇండియా’ కూటమి చెక్కుచెదరలేదన్నారు. అవినీతి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న బూటకపు ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదన్నారు. ఆదివారం ఢిల్లీలో పీటీఐ ఎడిటర్లతో జరిగిన చర్చలో మాట్లాడారు. ‘‘ఎలక్టోరల్ బాండ్ల పథకం ఎలా పని చేసిందంటే.. రూ. 4 వేల కోట్ల బాండ్లు నేరుగా రూ.4 లక్షల కోట్ల కాంట్రాక్టులతో లింక్ అయి ఉన్నయి.

ఎలక్టోరల్ బాండ్లకు, కాంట్రాక్ట్‌‌ల మంజూరుకు మధ్య సంబంధం క్లియర్​గా కనిస్తున్నది” అని రమేశ్ అన్నారు. ‘‘ఓ బీజేపీ ఎంపీ ఇన్​ఫ్రా స్ట్రక్చర్ డెవలప్​మెంట్ కాంట్రాక్టులు పొంది ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేశాడు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒక్కసారి రైడ్స్​ చేసిన, నోటీసులు ఇచ్చిన కంపెనీలు ఆ తర్వాత ఎలక్టోరల్​ బాండ్లు కొన్నాయి. వీటికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇది పూర్తిగా క్విడ్ ప్రోకో(చందా దో, ధండాలో) కేసు’’ అని వివరించారు.
‘‘ప్రతిపక్ష ఇండియా కూటమి కచ్చితంగా మ్యాజిక్​ ఫిగర్ ను దాటుతుంది. అది 272కి చేరుతుందని నేను బలంగా విశ్వసిస్తున్న. మోదీ ఎన్ని ఎత్తులు వేసిన కూటమి విచ్ఛిన్నం కాలేదు. నితీశ్ ఒక్కడు గోడదూకినా.. ఎన్‌‌సీపీ, శివసేన, డీఎంకే, జేఎంఎం, ఆప్​తో పొత్తు చెక్కుచెదరలేదు. పశ్చిమ బెంగాల్‌‌లో సీపీఎం, సీపీఐలతో మా పొత్తు ఖరారు కానుంది. అస్సాంలో 11 పార్టీల కూటమి మా వెంటే ఉంది. సమాజ్‌‌వాదీ పార్టీతో పొత్తు ఉంది” అని అన్నారు.