సీపీఎం సీనియర్ నేత వాసుదేవ ఆచార్య కన్నుమూత

సీపీఎం సీనియర్ నేత  వాసుదేవ ఆచార్య కన్నుమూత
  • ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ మృతి
  • బెంగాల్​లోని బంకూరా నుంచి 9 సార్లు ఎంపీగా ఎన్నిక 

హైదరాబాద్, వెలుగు : కార్మిక ఉద్యమనేత, సీపీఎం సీనియర్ జాతీయ నాయకులు వాసుదేవ ఆచార్య (81) సోమవారం కన్నుమూశారు.  హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన  పశ్చిమ బెంగాల్​లోని బంకూరా నుంచి 9 సార్లు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు.  సీపీఎం పార్లమెంటరీ పార్టీ  నాయకులుగా పనిచేశారు. ఆచార్య  రెండేండ్ల క్రితం భార్య చికిత్స కోసం హైదరాబాద్ వచ్చారు.  నెల రోజుల క్రితం ఆమె మరణించడంతో ఆయన మానసికంగా ఇబ్బందులకు గురై, అనారోగ్యం పాలైనట్టు సీపీఎం నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో  చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందారు.  

దీంతో ఆయన భౌతికకాయాన్ని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం. సాయిబాబు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు, వైస్ ప్రెసిడెంట్ ఎస్.వీరయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహారావు తదితరులు సందర్శించి నివాళి అర్పించారు. ఆచార్య అంత్యక్రియలు బెంగాల్​లోని స్వగ్రామంలో జరుగనున్నాయి. కాగా, ఆయన సీఐటీయూ ఆలిండియా వైస్ ప్రెసిడెంట్ గా, అఖిల భారత కోల్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా, రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు.

ALSO READ : మణిపూర్‌‌లో 9 మైతీ తీవ్రవాద గ్రూపులపై బ్యాన్

ఎల్​ఐసీ ఏజెంట్స్ అసోసియేషన్ జాతీయ గౌరవ​ అధ్యక్షులుగా పనిచేశారు. రైల్వే కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ నిర్మాణంలోనూ కీలకపాత్ర పోషించారు.   వాసుదేవ ఆచార్య మృతి సీపీఎంకు,  కార్మిక ఉద్యమాలకు తీరని లోటని ఆ పార్టీ స్టేట్ సెక్రెటరీ తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఆయన  కార్మికులు, ఉద్యోగుల హక్కులపై పార్లమెంట్లో తన గళం వినిపించారని గుర్తుచేశారు.