IPS పురాణ్ కుమార్ సూసైడ్ కేసులో కీలక పరిణామం: సీనియర్ ఎస్పీపై ప్రభుత్వం వేటు

IPS పురాణ్ కుమార్ సూసైడ్ కేసులో కీలక పరిణామం: సీనియర్ ఎస్పీపై ప్రభుత్వం వేటు

చంఢీఘర్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హర్యానా కేడర్ ఐపీఎస్ వై పురాణ్ కుమార్ సూసైడ్ కేసులో ప్రభుత్వం చర్యలకు దిగింది. ఈ మేరకు రోహతక్ జిల్లా ఎస్పీ నరేంద్ర బిజార్నియాపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో రోహతక్ ఎస్పీ సురీందర్ సింగ్ భోరియా నియమితులయ్యారు. ఎస్పీ నరేంద్ర బిజార్నియాకు ప్రభుత్వం ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‎లో ఉంచింది. ఐపీఎస్ పురాణ్ ఆత్మహత్య కేసులో ఎస్పీ స్థాయి అధికారిపై బదిలీ వేటు పడటం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

కాగా, ఉన్నతాధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ 2025, అక్టోబర్ 7న హర్యానా కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వై పురాణ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. తన నివాసంలోనే సర్వీస్ రివాల్వర్‎తో కాల్చుకుని ఆయన సూసైడ్ చేసుకున్నారు.  పురాన్ కుమార్ ఇంట్లో 8 పేజీల సూసైడ్ లెటర్ గుర్తించారు పోలీసులు. 

హర్యానా డీజీపీ, ఏడీజీపీ, ఎస్పీ ర్యాంకులకు చెందిన10 మంది సీనియర్ అధికారులు మానసిక వేధింపులకు గురిచేశారని.. అందుకే ఆత్మహత్యకు పాల్పడ్డట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. ఉన్నతాధికారులు, సహోద్యోగులు తనను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని అవమానించారని లేఖలో పురాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పురాణ్ కుమార్ భార్య, ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ హర్యానా డీజీపీ శత్రుజీత్ కపూర్, రోహ్తక్ ఎస్పీ, ఇతర సీనియర్ అధికారులపై  పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఆమె ఫిర్యాదుకు మేరకు డీజీపీతో పాటు పలువురు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పురాణ్ కుమార్ సూసైడ్ కేసు ఇన్విస్టిగేషన్ కోసం హర్యానా ప్రభుత్వం ఆరుగురితో కూడిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేసింది. సిట్ దర్యా్ప్తు కొనసాగుతున్న సమయంలోనే పురాణ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రోహతక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాపై ప్రభుత్వం వేటు వేయడం గమనార్హం.