డ్రాగన్ దాగుడు మూతలు : మల్లంపల్లి ధూర్జటి

డ్రాగన్ దాగుడు మూతలు : మల్లంపల్లి ధూర్జటి

సరిహద్దులో గస్తీ తిరుగుతున్న భారత్-చైనా సైనికుల మధ్య అరుణాచల్ ప్రదేశ్ లో డిసెంబర్ 9న మళ్ళీ  ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు దేశాల సైనికులు గాయపడడం ఇది మొదటిసారేమీ కాదు. యాంగ్సే సమీపంలో 2021 అక్టోబర్ లో కూడా ఇలాంటి ఘటనే సంభవించింది. లద్దాఖ్ కు దగ్గరలోని గాల్వన్ లోయలో  2020 జూన్ 15న చోటుచేసుకున్న ఘర్షణలో తెలంగాణకు చెందిన సంతోష్ బాబుతోపాటు 20 మంది భారత సైనికులు చనిపోయారు. వీటిని చెదురుమదురు ఘటనలుగా కాకుండా చైనా కయ్యానికి కాలు దువ్వుతున్నట్లుగానే చూడడం మంచిదనిపిస్తోంది. 

సాగరమూ రణ రంగమే

ఈసారి పాకిస్తాన్ ను కూడా తోడు చేసుకుని భారత్ పై విరుచుకుపడవచ్చని చైనా భావిస్తున్నట్లుంది. ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పి.ఎల్.ఏ)కి చెందిన నాలుగు నుంచి ఆరు నౌకలు ప్రస్తుతం హిందూ మహా సముద్ర ప్రాంతంలో సంచరిస్తున్నాయి. చైనావి కాకుండా పరిశోధక నౌకలు కొన్ని తిరుగుతున్నాయి. చేపల వేటకు వచ్చేవైతే ఇంకా పెద్ద సంఖ్యలో ఉంటాయి.  ఈ ప్రాంతానికి చెందిన నౌకాదళ శక్తిగా మనం వాటిని గమనిస్తూనే ఉంటాం. ఇది చాలా కీలకమైన ప్రాంతమన్న సంగతి మనకూ తెలుసు. మనం వాటి గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవి భారతదేశానికి కీడు చేపట్టే చర్యలకు దిగకుండా చూస్తూ ఉంటాం’ అని భారత నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ ఆర్. హరి కుమార్ ఇటీవల ఒక మీడియా సంస్థకు వెల్లడించారు. యాన్ వాంగ్ అనే చైనా నౌక  సంచారంతో, భారత్ తాను తలపెట్టిన  అగ్ని-5 క్షిపణి పరీక్షను ఈమధ్య రెండు, మూడుసార్లు వాయిదా వేసుకుంది.  అటువంటి పరీక్షలు నిర్వహించే ముందు ఏ దేశమైనా నోటీస్ టు ఎయిర్ మిషన్స్ (నోట్యామ్) అని నోటీసును జారీ చేస్తుంది. క్షిపణి పరీక్ష నిర్వహించే సమయంలో ఆ ప్రాంతంలో గగనతలంలో విమానాలు తిరగకుండా అలాంటి నోటీసు జారీ చేస్తారు. క్షిపణి లక్ష్యాన్ని ఛేదించే చోట నౌకల సంచారం లేకుండా కూడా చూసుకుంటారు. ఇండియా ‘నోట్యామ్’ జారీ చేసినా యాన్ వాంగ్ నౌక అక్కడక్కడే సంచరిస్తుండడం కలకలం రేపింది. తర్వాత అది ఇండోనేషియాలోని జావా దీవి వైపు వెనుకకు తిరిగి వెళ్ళడం వేరే విషయం. ఇక్కడ నౌక, క్షిపణి రెండూ విశేషమైనవే. ఈ దీర్ఘ శ్రేణి క్షిపణి  చైనా ఉత్తర కొసను తాకగలదు.  ఇది 5,000 కిలోమీటర్ల  దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం కలదిగా చెబుతున్నారు. ‘అవసరమైతే ఇంకా ఎక్కువ దూరం ప్రయోగించగల శక్తి మన సొంతం’ అని రక్షణ రంగ శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్ సారస్వత్ ఒక సందర్భంలో ఈ వ్యాసకర్తకు చెప్పారు.  

విదేశీ సైనిక స్థావరాలు

చైనా తన మొదటి విదేశీ సైనిక  స్థావరాన్ని ఆఫ్రికాలోని జిబూటీలో ఏర్పాటు చేసుకునే ప్రక్రియకు 2017లో శ్రీకారం చుట్టింది.  ప్రపంచంలో నౌకల రాకపోకలతో సందడిగా ఉండే ప్రాంతాల్లో ఇది ఒకటి.  యూరప్, దూర ప్రాచ్యం, హారన్ ఆఫ్ ఆఫ్రికా (ఇది తూర్పు ఆఫ్రికాలోని అతి పెద్ద ద్వీపకల్పం. దీన్నిసోమాలి ద్వీపకల్పం అని కూడా అంటారు),  పర్షియన్ జలసంధిలకు జిబూటీ కూడలి లాంటిది. జిబూటీ సాగర జలాల్లో చైనా నౌకలు ఆరు నుంచి తొమ్మిది నెలలపాటు స్థిరంగా ఉండగలుగుతున్నాయి.  చైనా వద్ద మూడు విమాన వాహక నౌకలున్నాయి. అది వాటి సామర్థ్యాలను పెంచుకుంటూ వస్తోంది. జిబూటీలో పి.ఎల్.ఏ నేవీ మెరైన్స్ ఉన్నారు. సైనిక శకటాలు, శతఘ్నులు కూడా ఉన్నాయి. అది నేవీ పియర్ ను కూడా తయారు చేసుకుంది. దీన్ని సముద్ర బల్లకట్టుగా చెప్పుకోవచ్చు. ఇండో -పసిఫిక్ ప్రాంతానికి, వివాదాస్పదంగా మారిన దక్షిణ చైనా సముద్రానికి దగ్గరలో కంబోడియాకు చెందిన రీమ్ నౌకాదళ స్థావరాన్ని అభివృద్ధి పరిచే పనులకు చైనా నిధులిస్తోంది. భారీ సైనిక నౌకలను నిలిపే విధంగా డీప్ పోర్ట్ ఫెసిలిటీ పనులను నిర్వహిస్తోంది. దాన్ని చైనా రెండవ విదేశీ స్థావరంగా చెప్పవచ్చు.  మైన్మార్, థాయిలాండ్, సింగపూర్, పాకిస్తాన్, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెన్యా, సెషెల్స్, టాంజానియా, అంగోలా, తజికిస్తాన్ తదితర ప్రదేశాల్లో సైనిక స్థావరాల ఏర్పాటు అవకాశాలను చైనా పరిశీలిస్తోంది. పదాతి, వైమానిక, నౌకా దళాలకు సుదూర ప్రాంతాల్లో కూడా ఆయుధాలను సరఫరా చేయగల సదుపాయాలుండాలని భావిస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది.  అవన్నీ సైనిక స్థావరాలుగా మారకపోయినా  వాటిలో రాజకీయ మార్పునకు దోహదపడడానికి, నిఘా వేసి సమాచారాన్ని సేకరించేందుకు ఈ ప్రయత్నాలు సాయపడతాయని చైనా భావిస్తోంది.  

భారత్ సన్నద్ధత

భారత్ గత కొద్ది ఏళ్లుగా ఆయుధ సంపత్తిని గణనీయంగా ఉన్నతపరచుకుంది. తవాంగ్ రంగంలో వాస్తవాధీన రేఖ పొడవునా మౌలిక సదుపాయలు నిర్మించుకుంటోంది. అరుణాచల్ ప్రదేశ్ లోని మిగిలిన ప్రాంతాల్లో కూడా ఆ రకమైన కృషి సాగుతోంది.  వీటిలో రోడ్లు, వంతెనలు, సొరంగాలు, సామగ్రిని నిల్వ చేసుకునే గిడ్డంగులు, తలదాచుకునే ఏర్పాట్లు, విమానయాన సదుపాయాలు వంటివి ఉన్నాయి. కమ్యూనికేషన్, నిఘా సదుపాయాలను ఉన్నతపరచుకునే ప్రక్రియ కొనసాగుతోంది. వాస్తవాధీన రేఖను పశ్చిమ (లద్దాఖ్), మధ్య (హిమాచల్ ప్రదేశ్, ఉత్తరా ఖండ్), తూర్పు (అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం) రంగాలుగా విభజించారు. గతంలో పశ్చిమ రంగంలో అతిక్రమణలు ఎక్కువ ఉండేవి. ఈమధ్య తూర్పు, మధ్య రంగాల్లో కూడా అతిక్రమణలు ఎక్కువ అవుతున్నాయి.మఖ్యంగా తూర్పు లద్దాఖ్ లో ఇరు దేశాల సైనికులు ఎదురుబదురుగా మోహరించి ఉన్నారు. అలాగే,  మనకి రెండు ( ఐ.ఎన్.ఎస్ విక్రమాదిత్య, ఐ.ఎన్.ఎస్ విక్రాంత్)  విమాన వాహక నౌకలున్నాయి. ప్రతిపాదిత స్వదేశీ పరిజ్ఞానపు విమాన వాహక నౌక ఐ.ఏ.సి-2, ముందు అనుకున్నట్లుగా 65 వేల టన్నులది కాకపోవచ్చని, 45,000 టన్నులకన్నా దిగువ శ్రేణికి చెందిన దానిని తయారు చేసుకోవాల్సి ఉంటుందని కూడా హరి కుమార్ ఇటీవల సూచించారు. వీటిలో సైజుకి ప్రాధాన్యం ఉంది. పెద్ద సైజుదైతే ఎక్కువ యుద్ధ విమానాలు, ఎటాక్ హెలికాప్టర్లు పడతాయి. ఎక్కువ ఆయుధ సామగ్రిని అమర్చుకోవచ్చు. ఉదాహరణకు, 40,000 టన్నుల ఐ.ఎన్.ఎస్. విక్రాంత్ లేదా ఐ.ఏ.సి-1లో సుమారుగా 35 విమానాలు పడతాయి. అదే 65,000 టన్నుల విమాన వాహక నౌకలో దాదాపు 50 విమానాలను  ఇముడ్చుకో గలుగుతుంది.  చైనాను దృష్టిలో ఉంచుకుని మన నౌకా దళాన్ని పటిష్టపరచుకోవడం, విస్తృతపరచుకోవడం చేయాల్సి ఉంది. భారత్ 60,000 టన్నుల కేటగిరీ విమాన వాహక నౌకల నిర్మాణానికి నడుం బిగించాల్సి ఉంది. దౌత్య, సైనిక స్థాయిల్లో చర్చల వల్ల కొన్ని ప్రాంతాలు గస్తీ అవసరం లేనివిగా మారాయి. మిగిలినచోట్ల మాత్రం రెండు వైపులా మోహరింపు పెరుగుతోంది.

నిఘా నౌకలు

ఇక 20,000 టన్నుల యాన్ వాంగ్ నౌక  ప్రముఖంగా వార్తలకెక్కడం ఇది రెండోసారి. ఈ నౌకను గత ఆగస్టులో హంబన్ తోటలో లంగరు వేసేందుకు చైనా ప్రయత్నించినపుడు భారత్–-శ్రీలంకల మధ్య దౌత్యపరమైన స్పర్థలు తలెత్తాయి.  పీకలబంటిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకను గడచిన జూలై, ఆగస్టు నెలల్లో మన దేశం బాగా ఆదుకుంది. నౌకను అనుమతించవద్దని భారత్ అభ్యర్థించింది.  చైనా నుంచి రుణం తీసుకున్న శ్రీలంక దానికీ ఎదురు చెప్పలేకపోయింది. హంబన్ తోట చైనా సొంతరేవు కావడం వల్ల కూడా శ్రీలంక ‘నో’ చెప్పలేకపోయింది. యాన్ వాంగ్ ఆగస్టు 16 న హంబన్ తోటకు వచ్చి అక్కడ నుంచి ఆగస్టు 22న బయలుదేరింది.  మొత్తానికి, ఒకపక్క భారత్ భూభాగాలను ఆక్రమించుకునే ప్రయత్నాలను కొనసాగిస్తూ, భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ను దువ్వుతూ అంతర్జాతీయంగానూ అగ్ర రాజ్యంగా నిలిచేందుకు చైనా పెద్ద వ్యూహమే పన్నుతోంది. 

టెక్నాలజీలో మేటి

యాన్ వాంగ్-5 నౌకలో దాదాపు 400 మంది సిబ్బంది ఉన్నారు. అతి పెద్ద యాంటెన్నాను, అధునాతన సెన్సర్లను, ఎలక్ట్రానిక్ పరికరాలను అమర్చుకున్న ఈ నౌక ఉపగ్రహాలు, క్షిపణుల గమనాన్ని ట్రాక్ చేయగలదు. ఇటువంటిదే మరో చైనా నౌక యాన్ వాంగ్-6  కూడా బంగాళాఖాతంలో సంచరిస్తోంది.  నిఘా పరిశోధక నౌక. చైనా ఉపగ్రహాలను ట్రాక్ చేస్తూ వాటికి ఆలంబనగా నిలుస్తుంది. ఖండాంతర వేధిత క్షిపణుల గమనాన్ని కూడా ఇది పసిగట్టగలదు.  దీన్ని పి.ఎల్.ఏకి చెందిన వ్యూహాత్మక బాసట దళం వినియోగిస్తోంది. ఇది. పీ.ఎల్.ఏకి చెందిన ఐదవ విభాగం. ఈ విభాగాన్ని 2015 డిసెంబర్ లో కొత్తగా ఏర్పాటు చేశారు. దైనందిన నావిగేషన్ కార్యకలాపాలు, ఉపగ్రహ నావిగేషన్ సిస్టంను నిర్వహించడం, స్పేస్ రికానసెన్స్ మార్గాలు చూడడం, ఎలక్ట్రోమాగ్నటిక్ స్పేస్, సైబర్ స్పేస్ లలో  రక్షణ రంగ కర్తవ్యాలను నిర్వర్తించడం ఈ విభాగం విధులుగా ఉన్నాయి. 

- మల్లంపల్లి ధూర్జటి,
సీనియర్​ జర్నలిస్ట్