బీజేపీలో సీనియర్లు అప్లయ్​ చేసుకోలే... ముగిసిన టికెట్​ దరఖాస్తుల ప్రక్రియ

 బీజేపీలో సీనియర్లు అప్లయ్​ చేసుకోలే... ముగిసిన టికెట్​ దరఖాస్తుల ప్రక్రియ
  • సీనియర్లు అప్లయ్​ చేసుకోలే
  • బీజేపీలో ముగిసిన టికెట్​ దరఖాస్తుల ప్రక్రియ
  • వారం రోజుల్లో వచ్చిన మొత్తం అప్లికేషన్లు  6,003
  • సెకండ్​ కేడర్​ నుంచే భారీగా స్పందన
  • అప్లై చేసుకున్న సీనియర్ల సంఖ్య సింగిల్ డిజిట్​కే పరిమితం 

హైదరాబాద్, వెలుగు : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపునకు సెకండ్ కేడర్ నుంచి ఊహించిన దానికన్నా ఎక్కువగానే స్పందన వచ్చింది. అయితే సీనియర్లు మాత్రం దూరంగా ఉన్నారు. ఈ నెల 4 నుంచి 10 వరకు వారం పాటు బీజేపీ స్టేట్ ఆఫీసులో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ వారం రోజుల్లో మొత్తం 6,003 దరఖాస్తులు వచ్చాయి. ఇంత పెద్ద మొత్తంలో దరఖాస్తులు వచ్చినా.. ఇందులో దరఖాస్తు చేసుకున్న సీనియర్ల సంఖ్య సింగిల్ డిజిట్ మాత్రమే. దరఖాస్తు చేసుకున్న సీనియర్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు వంటి వారు మాత్రమే ఉన్నారు. 

30 మంది సీనియర్లు బరిలో ఉంటారనీ..!

అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేసేందుకు సీనియర్లు 25 నుంచి 30 మంది రెడీగా ఉన్నారని, దాదాపుగా వారి జాబితా కూడా ఫైనల్ అయిందని బీజేపీ వర్గాల్లో ప్రచారం సాగింది. పార్టీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే సీనియర్లతో కూడిన మొదటి జాబితా విడుదల అవుతుందని కూడా పార్టీ వర్గాలు ప్రకటించాయి. కానీ, జమిలీ ఎన్నికల ప్రచారమా... లేక.. లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీనియర్లు మొగ్గు చూపడమా... కారణం ఏదైతేనేమి ఆ 25 నుంచి 30 మంది సీనియర్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం పార్టీకి దరఖాస్తు చేసుకోలేదు.  

చివరి రోజున దరఖాస్తు చేసుకున్నవాళ్లలో

చివరి రోజున (ఆదివారం) భారీగా దరఖాస్తులు వచ్చాయి.  హుజూరాబాద్​ టికెట్​ కోసం ఈటల రాజేందర్, గజ్వేల్​ టికెట్​ కోసం ఆయన భార్య జమున  అప్లయ్​ చేసుకున్నారు. ఖైరతాబాద్​ టికెట్​ కోసం మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, ఎల్బీ నగర్  నుంచి పోటీకి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పాదయాత్ర కమిటీ చైర్మన్ గంగిడి మనోహర్ రెడ్డి, ముషీరాబాద్  టికెట్​ కోసం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి, ముషీరాబాద్​ నుంచి పోటీకి గాంధీ నగర్ డివిజన్ కార్పొరేటర్​ పావని దరఖాస్తు చేసుకున్నారు. సినీ నటి జీవిత ఏకంగా ఐదు నియోజకవర్గాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో జూబ్లీహిల్స్, సనత్ నగర్, సికింద్రాబాద్, శేర్ లింగంపల్లి, కూకట్​పల్లి ఉన్నాయి. మొత్తం వారం రోజుల్లో 6,003 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఆదివారం ఒక్క రోజే 2,780 అప్లికేషన్లు వచ్చాయి. 

సీనియర్ల పోటీపై నిర్ణయం జరిగింది: ఉమా శంకర్

ఇటీవల జరిగిన కోర్ కమిటీ మీటింగ్ లోనే సీనియర్లు ఎవరు.. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై చర్చించి ఫైనల్  చేశారని బీజేపీ స్టేట్​ ఆఫీసు ఇన్​చార్జ్​ ఉమా శంకర్ ‘వెలుగు’తో చెప్పారు. అలాంటప్పుడు మళ్లీ వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కొందరు సీనియర్లు నేరుగా పార్టీ ఆఫీసుకు తమ దరఖాస్తులను పంపించారని తెలిపారు.