కేపీ చౌదరి పబ్స్ పార్టీల్లో.. 312 మంది సెలబ్రిటీలు, పొలిటీషియన్స్, వీఐపీలు

కేపీ చౌదరి పబ్స్ పార్టీల్లో.. 312 మంది సెలబ్రిటీలు, పొలిటీషియన్స్, వీఐపీలు

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరి విచారణ ఇప్పుడు సంచలనంగా మారింది. హైదరాబాద్ సిటీలోని ప్రైమ్ ఏరియాలోని.. మూడు పెద్ద పెద్ద పబ్స్ లో.. కేపీ చౌదరి ఇచ్చిన పార్టీలకు వందల మంది సెలబ్రిటీలు హాజరయ్యారంట. అందులో సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, కొంత మంది ఉన్నతాధికారులు ఉన్నారంట. ఇప్పుడు ఈ అంశం సంచలనంగా మారింది. ఆ మూడు పబ్స్ పై విచారణ దిశగా అడుగులు వేస్తున్నారు పోలీసులు. 

డ్రగ్స్ కేడీ కేపీ చౌదరి పార్టీలు ఇచ్చిన మూడు పబ్స్ కు నోటీసులిచ్చేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ పబ్స్ లో డ్రగ్స్ ఉపయోగించారా లేదా అనే అంశాన్ని తేల్చటానికి సిద్ధం అయ్యారు పోలీసులు. డ్రగ్స్​ తీసుకున్న వారి లిస్టులో సినీ స్టార్లు, బిజినెస్​ మెన్లు, రాజకీయ నాయకులు ఉన్నారనే వార్తలు రావటంతో.. పబ్స్ పై విచారణ అనేది సంచలనంగా మారింది.  కేపీ చౌదరి పార్టీల్లో ఇద్దరు ప్రముఖ రాజకీయ నాయకులు డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలు బయటకు రావటం కలకలం రేపుతోంది. నిర్మాత కేపీ చౌదరి పోలీస్​ కస్టడీలో దిమ్మతిరిగే నిజాలు బయటకు వస్తుండటంతో.. ఆయన కాల్​ లిస్టుని చూసి సైబరాబాద్​ పోలీసులు ఖంగుతింటున్నారు.  గోవా నుంచి ముంబై వయా హైదరాబాద్​ కేంద్రంగా కేపీ చౌదరి డ్రగ్స్​ దందా సాగినట్లు గుర్తించారు.

ఈ క్రమంలో హయత్ నగర్​ శివారులోని ఓ గోదాంలో డ్రగ్స్ తయారు చేసే యూనిట్​ని డీఆర్​ఐ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి వారం రోజుల్లో 41ఏ కింద నోటీసులిచ్చేందుకు న్యాయ సలహాలు​ తీసుకుంటున్నారు పోలీసులు. డ్రగ్స్ తయారీ, సరఫరా, డ్రగ్స్ వినియోగం అనే మూడు కోణాల్లో ఎస్ఓటీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైటెక్​ సిటీ సమీపంలోని ఓ ప్రముఖ హోటల్లో సెలబ్రిటీ పార్టీలో పాల్గొన్న.. తెలంగాణకు చెందిన 312 మంది సెలబ్రిటీల్లో ఎంత మంది డ్రగ్స్ తీసుకున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. 

కేపీ చౌదరి ఇచ్చిన పార్టీలకు 700 మంది ప్రముఖులు హాజరుకాగా.. అందులో 312 మంది తెలంగాణకు చెందిన వారు అయితే.. మిగతా వాళ్లు ఏపీ రాష్ట్రానికి చెందిన వారంట. దీంతో విచారణలో విజయవాడ స్పెషల్​టీమ్స్ సహాయం తీసుకుంటున్నారు. విజయవాడ, హైదరాబాద్​కి చెందిన రియల్టర్లు, బిజినెస్ మెన్లతో వాట్సప్ గ్రూప్ లో ఉన్న ప్రముఖులెవరు.. డ్రగ్స్​పెడ్లర్లతో టచ్ లో ఉన్న గ్యాంగ్ లిస్ట్​లోఉన్నవారెందరు అనే కోణాల్లో లోతుగా విచారిస్తున్నారు పోలీసులు. తీగ తాగారు.. ఇప్పుడు డొంక కదిలింది.. అది ఎంత దూరం వెళుతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.