20 వేలకు కేవలం 8 పాయింట్ల దూరంలో

20 వేలకు కేవలం  8 పాయింట్ల దూరంలో

బిజినెస్ డెస్క్‌‌‌‌, వెలుగు:  బెంచ్‌‌‌‌మార్క్ ఇండెక్స్ నిఫ్టీ గురువారం సెషన్‌‌‌‌లో 20 వేల లెవెల్‌‌‌‌కు  కేవలం ఎనిమిది పాయింట్ల దూరంలో ఆగిపోయింది. 15 సెషన్లలోనే  19 వేల లెవెల్‌‌‌‌ నుంచి గురువారం క్లోజింగ్ 19,979 కి చేరుకోవడం విశేషం. కిందటి నెల 28 న మొదటిసారిగా 19 వేల లెవెల్‌‌‌‌ను క్రాస్ చేసింది. గ్లోబల్‌‌‌‌గా ఆర్థిక పరిస్థితులు మెరుగవుతుండడం, రిలయన్స్‌‌‌‌ డీమెర్జర్‌‌‌‌‌‌‌‌ ఇష్యూ,  ఐటీసీ, టీసీఎస్‌‌‌‌, ఇన్ఫోసిస్ వంటి హెవీ వెయిట్ షేర్లలో బయ్యింగ్ రావడం మార్కెట్‌‌‌‌ ర్యాలీకి కారణమయ్యాయి. అంతేకాకుండా హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ– హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ విలీనం అమల్లోకి వచ్చిన తర్వాత బెంచ్‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌లు వెనక్కి తిరిగి చూడలేదు. 

కొన్ని సెషన్లలో బ్యాంక్‌‌‌‌, ఫైనాన్షియల్, రియల్టీ షేర్లు మార్కెట్‌‌‌‌ను లేపగా, మరికొన్ని సెషన్లలో ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు ఇండెక్స్‌‌‌‌లను ముందుకు నడిపించాయి. గత కొన్ని సెషన్ల కిందటి వరకు ఐటీ షేర్లు నిఫ్టీని పడకుండా చూశాయి. రిజల్ట్స్ సీజన్‌‌‌‌ స్టార్టవ్వడంతో బ్యాంక్ షేర్లలో మళ్లీ బయ్యింగ్ కనిపిస్తోంది. నిఫ్టీ ఈజీగా 20 వేలను దాటి 21 వేలకు చేరుకుంటుందని ఎనలిస్టులు చెబుతున్నారు. నిఫ్టీ గురువారం సెషన్‌‌‌‌లో 146 పాయింట్లు పెరిగి 19,979 దగ్గర  క్లోజింగ్ బేసిస్‌‌‌‌లో ఆల్‌‌‌‌టైమ్ హైని, ఇంట్రాడేలో  19,992 లెవెల్‌‌‌‌ను టచ్‌‌‌‌ చేసి  ఆల్‌‌‌‌టైమ్‌‌‌‌ గరిష్టాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్‌‌‌‌ 474 పాయింట్లు ఎగిసి 67,572 వద్ద క్లోజయ్యింది. ఐటీసీ షేరు 2 శాతం ఎగిసి రూ.6 లక్షల కోట్ల మార్కెట్‌‌‌‌ క్యాప్‌‌‌‌ను దాటింది. ఏడో అతిపెద్ద కంపెనీగా నిలిచింది. 

ర్యాలీ ఎక్కడి వరకు?

ప్రస్తుతం మార్కెట్ ర్యాలీ చూస్తుంటే నిఫ్టీ ఎంత వరకు పెరుగుతుందనే అనుమానాలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. గత 15 సెషన్లలో పెద్దగా కరెక్షన్ కనిపించకపోవడం ఒకటయితే, బేర్స్ స్ట్రాంగ్‌‌‌‌గా కనిపించకపోవడం మరో ఎత్తు. దీంతో ఇండెక్స్‌‌‌‌ ర్యాలీ ఇప్పటిలో ఆగేటట్టు కనిపించడం లేదని ఎనలిస్టులు చెబుతున్నారు. ప్రస్తుత నిఫ్టీ ర్యాలీ స్ట్రాంగ్‌‌‌‌గా ఉందని, ఈ నెల చివరిలోపే 20 వేల లెవెల్‌‌‌‌ను ఈజీగా దాటేస్తుందని స్వస్తికా ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌ సంతోష్ మీనా అన్నారు. 19,800 లెవెల్‌‌‌‌ పైన  నిఫ్టీ సస్టయిన్‌‌‌‌ అవ్వగలిగితే కేవలం 20 వేలు మాత్రమే కాదు 20‌‌‌‌‌‌‌‌,200 లెవెల్‌‌‌‌ను కూడా ఈజీగా దాటుతుందని చెప్పారు.   ‘నిఫ్టీ ఈ నెలలో ఇప్పటి వరకు 650 పాయింట్లు పెరిగింది (3% అప్‌‌‌‌). ప్రస్తుతం 20 వేల లెవెల్‌‌‌‌కు చేరువలో ఉంది. బెంచ్‌‌‌‌మార్క్ ఇండెక్స్ ఓవర్‌‌‌‌‌‌‌‌ బాట్‌‌‌‌ రీజియన్‌‌‌‌లో ఉన్నప్పటికీ,  బుల్స్‌‌‌‌ బలహీనంగా కనిపించడం లేదు’ అని ఏంజెల్‌‌‌‌ వన్‌‌‌‌ టెక్నికల్ ఎనలిస్ట్‌‌‌‌ ఓషో కృష్ణ అన్నారు. 

ఈ షేర్లపై ఓ కన్నేయండి..

ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో  ఫైనాన్షియల్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో  రూ. 19,229 కోట్లను విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌ఐఐలు) ఇన్వెస్ట్ చేశారని, అదనంగా ఈ నెలలో ఇప్పటికే రూ.7,050 కోట్లు ఇన్వెస్ట్ చేశారని ఎల్‌‌‌‌కేపీ సెక్యూరిటీస్‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌ రూపక్‌‌‌‌ దే అన్నారు. బ్యాంక్ షేర్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని చెప్పారు. ఐసీఐసీఐ బ్యాంక్‌‌‌‌, యాక్సిస్ బ్యాంక్‌‌‌‌, కోటక్ బ్యాంక్ షేర్లు నిఫ్టీ ర్యాలీని ఇక నుంచి నడిపిస్తాయని అంచనావేశారు. ఐటీ షేర్లలో హెచ్‌‌‌‌సీఎల్‌‌‌‌ టెక్‌‌‌‌, విప్రో షేర్లు పెరుగుతాయని వివరించారు. కాగా, నిఫ్టీ 50 లో బ్యాంకింగ్‌‌‌‌, ఐటీ షేర్లు వెయిటేజ్ ఎక్కువ.  ఐటీ సెక్టార్‌‌‌‌‌‌‌‌పై   సానుకూలంగా ఉన్నామని, లాంగ్‌‌‌‌టెర్మ్‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ కోసం టీసీఎస్‌‌‌‌ను రికమండ్ చేస్తున్నామని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. రానున్న క్వార్టర్‌‌‌‌‌‌‌‌లలో ఐటీ కంపెనీలు రిబౌండ్ అవుతాయని చెప్పారు. లార్జ్‌‌‌‌క్యాప్‌‌‌‌లో టీసీఎస్‌‌‌‌, ఎల్‌‌‌‌టీఐఎం, చిన్న షేర్లలో సెయంట్‌‌‌‌ రికమండ్ చేశారు. 

రిలయన్స్ డీమెర్జర్‌‌‌‌‌‌‌‌.. 

రిలయన్స్ డీమెర్జర్‌‌‌‌‌‌‌‌ గురువారం సెషన్‌‌‌‌లో సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా పూర్తయ్యింది. కంపెనీ షేర్ల కోసం సపరేట్‌‌‌‌ ప్రైస్ డిస్కవరీ సెషన్‌‌‌‌ను గురువారం ఉదయం 9 నుంచి 10 మధ్య ఎక్స్చేంజిలు నిర్వహించాయి. ఇందులో భాగంగా బుధవారం క్లోజింగ్ ధర రూ. 2,841.85,  గురువారం ఓపెనింగ్ ధర రూ.2,580 తేడా రూ.261.85 ను జియో ఫైనాన్షియల్ షేరు ధరగా నిర్ణయించారు. ఇది ఎనలిస్టులు అంచనావేసిన రూ.160–190 కంటే చాలా ఎక్కువ. అంతేకాకుండా రిలయన్స్ షేర్లను ఈ నెల 19, అంతకంటే ముందు కొన్నవారు రిలయన్స్ షేరు కోసం 95. 32 శాతం ఖర్చు చేయగా, జియో ఫైనాన్షియల్ షేరు కోసం 4.68 శాతం ఖర్చు చేశారు. అంటే బుధవారం నాటి ట్రేడింగ్ ప్రైస్‌‌‌‌ రూ.2,841 లో రూ.133 మాత్రమే జియో ఫైనాన్షియల్ షేరు కోసం ఇన్వెస్ట్ చేశారు. ఒక్క రోజులోనే జియో ఫైనాన్షియల్‌‌‌‌ కోసం ఇన్వెస్ట్ చేసిన వారి క్యాపిటల్‌‌‌‌  రెండింతలు పెరిగింది. జియో ఫైనాన్షియల్ షేర్లు ఇంకా మార్కెట్‌‌‌‌లో లిస్ట్ కాలేదు. అందువలన వీటిలో సాధారణ ట్రేడింగ్‌‌‌‌కు వీలుండదు. ఇంకో రెండు మూడు నెలల్లో వీటి షేర్లు ఎక్స్చేంజిలో లిస్టింగ్ కానుండగా, ఆ డేట్‌‌‌‌ నుంచి మూడు రోజుల్లో   నిఫ్టీ 50, సెన్సెక్స్‌‌‌‌ 30 నుంచి డ్రాప్ అవుతాయి. అప్పటి వరకు ఈ ఇండెక్స్‌‌‌‌లలో అదనపు షేరుగా కొనసాగుతాయి.

టాప్‌‌‌‌ కంపెనీలను  దాటేసి..

జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్ క్యాప్ షేరు ధర రూ.261.85 దగ్గర రూ.1.60 లక్షల కోట్లు (20 బిలియన్ డాలర్లు) గా రికార్డయ్యింది. బజాజ్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ (రూ.4.59 లక్షల కోట్లు) కంటే వెనుక ఉన్నప్పటికీ, చోళమండలం ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ అండ్ ఫైనాన్స్, బజాజ్ హోల్డింగ్స్‌‌‌‌, ఎస్‌‌‌‌బీఐ కార్డ్స్‌‌‌‌, శ్రీరామ్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌, ముత్తూట్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌, పేటీఎం, టాటా స్టీల్‌‌‌‌, కోల్ ఇండియా, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ లైఫ్‌‌‌‌, ఎస్‌‌‌‌బీఐ లైఫ్‌‌‌‌ కంపెనీలను దాటేసింది. అతిపెద్ద కంపెనీల్లో 32 వ కంపెనీగా నిలిచింది.