2 నెలల కనిష్టానికి సూచీలు వరుసగా మూడో రోజూ నష్టాలే

2 నెలల కనిష్టానికి సూచీలు వరుసగా మూడో రోజూ నష్టాలే

ముంబై: వరుసగా మూడో సెషన్​లోనూ ఈక్విటీ మార్కెట్లు నష్టపోయాయి. బెంచ్‌‌మార్క్ సెన్సెక్స్ 572 పాయింట్లు పడిపోయి దాదాపు రెండు నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్‌‌లో భారీ అమ్మకాలు, ఫారెక్స్ ఔట్‌‌ఫ్లోలు,  భారత్​–యూఎస్ వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన అనిశ్చితి కారణంగా ఇది 0.70 శాతం పడిపోయి 80,891.02 వద్ద సెటిలయింది.  ఇంట్రాడేలో 686.65 పాయింట్లు కుంగి 80,776.44 వద్దకు చేరుకుంది. ఈ ఏడాది జూన్ 4 తర్వాత ఇంతలా నష్టపోవడం ఇదే మొదటిసారి. ఎన్‌‌ఎస్‌‌ఈ నిఫ్టీ 156.10 పాయింట్లు క్షీణించి దాదాపు రెండు నెలల కనిష్ట స్థాయి 24,680.90 వద్ద ముగిసింది.  కంపెనీ క్వార్టర్లీ ఫలితాలు నిరాశపర్చడం, ఎఫ్‌‌ఐఐల అమ్మకాలు మార్కెట్లను దెబ్బకొట్టాయని ఎనలిస్టులు తెలిపారు. 

సెన్సెక్స్ సంస్థలలో, కోటక్ మహీంద్రా ఏకంగా 7.31 శాతం పడిపోయింది.  కంపెనీ క్వార్టర్లీ ఫలితాలు మెప్పించకపోవడమే ఇందుకు కారణం. బజాజ్ ఫైనాన్స్ 3.64 శాతం, ఎయిర్‌‌టెల్ 2.35 శాతం తగ్గింది. టీసీఎస్​ 12 వేల మందిని తొలగించాలని నిర్ణయించిందనే వార్తల వల్ల షేరు 1.76 శాతం పడిపోయింది.  టైటాన్, హెచ్‌‌సీఎల్ టెక్,  ఎస్​బీఐ కూడా నష్టపోయాయి. హిందూస్తాన్ యూనిలీవర్, ఆసియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్,  ఐటీసీ లాభపడ్డాయి. బీఎస్ఈ స్మాల్‌‌క్యాప్ గేజ్ 1.31 శాతం, మిడ్‌‌క్యాప్ ఇండెక్స్ 0.73 శాతం పడిపోయాయి. బీఎస్ఈ రంగాల సూచీలలో ఎఫ్‌‌ఎంసీజీ,  యుటిలిటీలు మాత్రమే లాభపడ్డాయి. ఎఫ్‌‌ఐఐలు శుక్రవారం రూ.1,979.96 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు. ఆసియా మార్కెట్లలో, జపాన్‌‌కు చెందిన నిక్కీ 225 ఇండెక్స్ నష్టాల్లో ముగిసింది. దక్షిణ కొరియాకు చెందిన కోస్పి, షాంఘైకి చెందిన ఎస్‌‌ఎస్‌‌ఈ కాంపోజిట్ ఇండెక్స్,  హాంకాంగ్‌‌కు చెందిన హాంగ్ సెంగ్ లాభపడ్డాయి. యూరప్‌‌లో మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. యూఎస్ మార్కెట్లు శుక్రవారం లాభపడ్డాయి.