- రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై ఎఫెక్ట్.. కంపెనీ షేర్లు డౌన్
- ఆల్ టైమ్ గరిష్టాల దగ్గర ప్రాఫిట్ బుకింగ్‌కి మొగ్గు
ముంబై: బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ గురువారం సెషన్‌ను స్వల్ప లాభాలతో ముగించాయి. వరుసగా ఆరో సెషన్‌లోనూ పెరిగాయి. కానీ, గురువారం ఇంట్రాడేలో 52-వారాల గరిష్ట స్థాయికి చేరిన ఇండెక్స్‌లు, ఆ స్థాయి నుంచి పడ్డాయి. సెషన్ చివరిలో పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గుచూపడంతో మార్కెట్ ఒత్తిడికి లోనైంది. అమెరికా ప్రభుత్వం రష్యాకు చెందిన అతిపెద్ద ఆయిల్ కంపెనీలు రోస్నెఫ్ట్, లుకోయిల్ పై ఆంక్షలు విధించడంతో మార్కెట్‌లో వోలటాలిటీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల కూడా మార్కెట్‌ను ప్రభావితం చేశాయి.
ఇండెక్స్ హెవీ వెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఒక శాతానికి పైగా పడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం నుంచి 700 పాయింట్లు పతనమైంది. చివరికి 130 పాయింట్ల లాభంతో 84,556.40 వద్ద ముగిసింది. నిఫ్టీ 23 పాయింట్లు పెరిగి 25,891.40 వద్ద సెటిలయ్యింది. ‘‘మార్కెట్ సెషన్ ప్రారంభంలో సానుకూలంగా ఉన్నా, రష్యా చమురు కంపెనీలపై ఆంక్షలు, ఇండియా–యూఎస్ ట్రేడ్ చర్చల వాయిదా వార్తలతో పెట్టుబడిదారులు లాభాలను బుక్ చేసుకోవడం ప్రారంభించారు. అయితే, ఐటీ స్టాక్స్ మాత్రం హెచ్1బీ వీసాలపై ట్రంప్ సాఫ్ట్ టోన్ కారణంగా లాభపడాయ”అని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఇండియా–యూఎస్ ఒప్పందం, వినియోగ డిమాండ్ పెరుగుదల వల్ల దేశీయ మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడుతోందని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు.
దీంతో బ్రాడ్ మార్కెట్ భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కాగా, సెన్సెక్స్ కంపెనీలలో ఇన్ఫోసిస్ 3.86 శాతం లాభంతో టాప్ గెయినర్‌గా నిలిచింది. హెచ్‌సీఎల్ టెక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్, టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్ కూడా లాభాల్లో ట్రేడయ్యాయి. మరోవైపు ఎటర్నల్, ఇంటర్‌గ్లోబల్ ఏవియేషన్, ఐషర్ మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, అల్ట్రాటెక్ సిమెంట్ 3 శాతం వరకు నష్టపోయాయి. బ్యాంక్ నిఫ్టీ ఆల్‌టైం హై తాకిన తర్వాత 400 పాయింట్లకు పైగా తగ్గింది.
ఆయిల్ ధరలు జూమ్
అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర గురువారం 2.56 శాతం పెరిగి బ్యారెల్‌కు 64.19 డాలర్లకి చేరింది. దీంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతింది. ఆసియా మార్కెట్లలో జపాన్, చైనా, హాంకాంగ్ నష్టాల్లో ముగిశాయి. యూఎస్ ఫ్యూచర్స్ నష్టాల్లో ట్రేడయ్యాయి. ఇన్వెస్టర్ల భయాన్ని కొలిచే ఇండెక్స్ ఇండియా విక్స్ గురువారం 3.3 శాతం పెరిగి 11.73కి చేరింది. ఇది తాత్కాలికంగా ట్రేడర్లలో అనిశ్చితిని సూచిస్తోంది. టెక్నికల్‌గా చూస్తే, నిఫ్టీకి 25,400–25,500 స్థాయి కీలక సపోర్ట్‌గా పనిచేస్తుందని ఎనలిస్టులు పేర్కొన్నారు.
ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ స్థిరంగా ఉంటుందని, ఇక్కడి నుంచి ముందుకు పెరగొచ్చని అభిప్రాయపడ్డారు. మొత్తంగా, మార్కెట్ గురువారం స్వల్ప లాభాలతో ముగిసినా, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలంగా ఉందని, కానీ గ్లోబల్ అస్థిరత, క్రూడ్ ధరలు, వాణిజ్య చర్చలపై స్పష్టత రాకపోవడం వల్ల తాత్కాలిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని వివరించారు.
