సెన్సెక్స్, నిఫ్టీ డౌన్.. బుల్ ర్యాలీకి తెర

సెన్సెక్స్, నిఫ్టీ డౌన్..  బుల్ ర్యాలీకి తెర

స్టాక్ మార్కెట్లు సెప్టెంబరు నెలను నష్టాలతో ప్రారంభించాయి.  అమెరికా, ఆసియా మార్కెట్లలోని నెగెటివ్ వేవ్స్,  భారత జీడీపీ వృద్ధిరేటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలను అందుకోలేకపోవడం నెగెటివ్ గా ప్రభావితం చేసింది.  దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ గురువారం ఉదయం మార్కెట్ ప్రారంభంకాగానే.. 684.58 పాయింట్ల నష్టాన్ని చవిచూసి 58,852 పాయింట్లకు చేరింది. నిఫ్టీ ఇండెక్స్ సైతం 194.70 పాయింట్లను కోల్పోయి 17,562 పాయింట్ల స్థాయికి చేరింది. నిఫ్టీలో ఐటీ ఇండెక్స్ చతికిలపడింది. ఇది దాదాపు 1.7 శాతం నష్టాన్ని మూటకట్టుకుంది. బ్యాంకు ఇండెక్స్ 0.9 శాతం పడిపోయింది. ఏప్రిల్,  జూన్  త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధిరేటు 13.5 శాతంగా నమోదైందని కేంద్ర సర్కారు వెల్లడించింది. అయితే ఇది ఆర్బీఐ అంచనాల కంటే తక్కువగా ఉందనే అంశం మార్కెట్ వర్గాల్లో నిరుత్సాహాన్ని మిగిల్చింది. యూరోజోన్ లో ద్రవ్యోల్బణం 9.1 శాతానికి చేరడం, చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల కార్యకలాపాలు ఇంకా నత్తనడకనే సాగుతుండటం కూడా మార్కెట్ లో నీరసాన్ని నింపాయి.  

స్పైస్ జెట్ లో..

విమానయాన రంగంతో పాటు  డీజిల్ ఎగుమతులు, దేశీయ చమురుపై పన్నులను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ ప్రభావం ఇంధన, విమానయాన రంగ కంపెనీలపై షేర్లపై స్పష్టంగా కనిపించింది.  ట్రేడింగ్ ఆరంభంలో స్పైస్ జెట్ కంపెనీ షేరు దాదాపు 14.7 శాతం పతనమైంది. ఈ షేరు పడిపోవడం వెనుక .. స్పైస్ జెట్ కంపెనీలోని అంతర్గత కార్యకలాపాలు కూడా ఒక కారణమే. ఇటీవల కాలంలో దేశంలో పలుచోట్ల స్పైస్ జెట్ సంస్థ విమానయాన సర్వీసుల్లో  పలు సాంకేతిక వైఫల్యాలు తలెత్తాయి. త్రైమాసిక ఫలితాల్లోనూ ఆ కంపెనీ నష్టాలనే చూపించింది. ఈపరిణామాల నేపథ్యంలో స్పైస్ జెట్ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కూడా ఇటీవల రాజీనామా చేశారు. వెరసి ఆ కంపెనీ స్టాక్ కు మార్కెట్లో డిమాండ్ తగ్గింది.