మరో రెండున్నరేండ్లలో లక్షా 15 వేల 836కి సెన్సెక్స్‌‌‌‌.. 43 వేల 876 లెవెల్‌‌‌‌ను టచ్ చేయనున్న నిఫ్టీ

మరో రెండున్నరేండ్లలో లక్షా 15 వేల 836కి సెన్సెక్స్‌‌‌‌.. 43  వేల 876 లెవెల్‌‌‌‌ను టచ్ చేయనున్న నిఫ్టీ
  • పెట్టుబడులకు గమ్యస్థానంగా ఇండియా: వెంచురా సెక్యూరిటీస్

న్యూఢిల్లీ: సెన్సెక్స్  ఇంకో రెండున్నరేళ్లలో  1,15,836 లెవెల్‌‌‌‌కు చేరుకుంటుందని బ్రోకరేజ్ కంపెనీ వెంచురా సెక్యూరిటీస్ అంచనా వేసింది. బుల్లిష్ ట్రెండ్ కొనసాగితే ఈ లెవెల్‌‌‌‌ను దాటుతుందని తెలిపింది.  నిఫ్టీ50 అయితే 43,876 లెవెల్‌‌‌‌కి చేరొచ్చని అంచనా వేసింది. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడమే ఇందుకు కారణం. వెంచురా సెక్యూరిటీస్ రిపోర్ట్ ప్రకారం, ఇంజనీరింగ్, బీఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఐ రంగాలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది.

అధిక జనాభా, సంస్కరణలు, అప్పులు నిలకడగా ఉండడం వంటి కారణాలతో విదేశీ ఇన్వెస్టర్లు ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు.   బేర్ ట్రెండ్ ఉంటే  2027–28 నాటికి  సెన్సెక్స్ 1,04,804 లెవెల్‌‌‌‌కు,  నిఫ్టీ  39,697 లెవెల్‌‌‌‌కి చేరొచ్చని వెంచురా సెక్యూరిటీస్ అంచనా వేసింది.  ఇప్పటివరకు 159 కంపెనీలు తమ జూన్ క్వార్టర్ ఫలితాలను ప్రకటించాయి. ఆదాయ వృద్ధిలో  ఇంజనీరింగ్, తయారీ, సర్వీసెస్ రంగాలు ముందంజలో ఉన్నాయి. వినియోగం, కమోడిటీలు, ఫార్మా స్థిరమైన పనితీరును చూపాయి. బీఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఐ (బ్యాంక్స్‌‌‌‌, ఇన్సూరెన్స్ కంపెనీలు), ఐటీ, హెల్త్‌‌‌‌కేర్, లాజిస్టిక్స్‌‌‌‌లో కంపెనీల రెవెన్యూ అనూహ్యంగా పెరిగింది.  

బలమైన ఆర్థిక వ్యవస్థ..
భారత్‌‌‌‌ను "ప్రపంచంలోనే అత్యంత ఆశాజనకమైన పెట్టుబడి గమ్యస్థానం"గా వెంచురా వర్ణించింది. 6.5శాతం జీడీపీ వృద్ధి, 80శాతం డెట్-టు- జీడీపీ నిష్పత్తి, స్థిరమైన బాండ్ ఈల్డ్‌‌‌‌లు ఆకర్షణీయంగా ఉన్నాయని తెలిపింది. అమెరికా, జపాన్ వంటి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు అధిక అప్పులు, వృద్ధి మందగించడం వంటి సమస్యలను ఎదుర్కొంటుండగా, భారత్ మాత్రం అధిక  జనాభా, నిర్మాణాత్మక సంస్కరణలతో  గ్లోబల్ ఇన్వెస్టర్లను  ఆకర్షిస్తోంది. "గత 10 ఏళ్లలో  ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీ సంక్షోభం, కొవిడ్-19, రష్యా-–ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ టారిఫ్ అనిశ్చితి వంటి గ్లోబల్ సవాళ్ల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ అత్యధిక జీడీపీ వృద్ధిని నమోదు చేసింది" అని వెంచురా రీసెర్చ్‌‌‌‌ హెడ్ వినిత్ బోలింజ్కర్ తెలిపారు.  2029–30 నాటికి భారత జీడీపీ వృద్ధి 7.3 శాతానికి చేరుతుందని అంచనా వేసింది. 

షాక్‌‌‌‌లు ఎన్ని ఉన్నా..
డీమానిటైజేషన్, జీఎస్‌‌‌‌టీ , ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీ  సంక్షోభం, కొవిడ్-19 వంటి ఆర్థిక షాక్‌‌‌‌లను తట్టుకొని ఇండియా ఆర్థిక వ్యవస్థ నిలబడిందని  వెంచురా హైలైట్ చేసింది. అండమాన్ ఆయిల్ డిస్కవరీ, గోల్డ్ మానిటైజేషన్, జాతీయ భద్రతా వ్యూహం వంటి వ్యూహాత్మక అభివృద్ధితో దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థ మరింత బలంగా మారనుంది. దీనికి తోడు  పెరుగుతున్న ఫారెక్స్ రిజర్వ్‌‌‌‌లు, అప్పులు నిలకడగా ఉండడం, ఆకర్షణీయమైన  వడ్డీ రేట్లు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి.  ఈ నిర్మాణాత్మక మార్పులను మార్కెట్ ఇంకా పూర్తిగా పట్టించుకోలేదు.