సూచీలు బోల్తా .. 22 వేల దిగువకు నిఫ్టీ

సూచీలు బోల్తా .. 22 వేల దిగువకు నిఫ్టీ
  • సెన్సెక్స్ 736 పాయింట్లు డౌన్

ముంబై: జపాన్​ సెంట్రల్​ బ్యాంక్​ వడ్డీరేట్లను పెంచడం, ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, అమ్మకాల ఒత్తిడి వల్ల సూచీలు మంగళవారం నష్టపోయాయి.  క్రూడాయిల్ ధరలు క్రమంగా పెరగడం మార్కెట్ సెంటిమెంట్‌‌‌‌ను మరింత దెబ్బకొట్టింది. బెంచ్‌‌‌‌మార్క్ సెన్సెక్స్ 736 పాయింట్లు నష్టపోయింది. ఇండెక్స్ మేజర్లు టీసీఎస్, ఇన్ఫోసిస్, రిలయన్స్​షేర్లలో అమ్మకాలతో నిఫ్టీ 22 వేల స్థాయికి పడిపోయింది.   30 షేర్ల బీఎస్‌‌‌‌ఈ సెన్సెక్స్ 736.37 పాయింట్లు క్షీణించి నెల రోజుల కనిష్ట స్థాయి 72,012.05 వద్ద స్థిరపడింది. 23 సెన్సెక్స్ షేర్లు తగ్గగా, ఏడు పెరిగాయి.

డే ట్రేడ్‌‌‌‌లో ఇండెక్స్ 815.07 పాయింట్లు క్షీణించి 72 వేల దిగువన 71,933.35 వద్దకు పడిపోయింది. నిఫ్టీ 238.25 పాయింట్లు క్షీణించి ఒక నెల కనిష్ట స్థాయి 21,817.45 వద్ద స్థిరపడింది. 41 నిఫ్టీ షేర్లు నష్టాల్లో ముగియగా, తొమ్మిది లాభపడ్డాయి. 17 ఏళ్ల తర్వాత బ్యాంక్ ఆఫ్ జపాన్ తొలిసారిగా వడ్డీరేట్లను పెంచడంతో ఆసియా మార్కెట్ల నష్టాల మధ్య కీలక సూచీలు బలహీనంగా ప్రారంభమయ్యాయి. ఈ వారం యూఎస్​ ఫెడ్ వడ్డీ రేటు నిర్ణయం ముందు పెట్టుబడిదారులు కూడా జాగ్రత్తగా ఉన్నారని విశ్లేషకులు తెలిపారు. 

నష్టాల్లో టీసీఎస్​ షేర్లు...

టీసీఎస్‌‌‌‌లో భారీ నష్టాలు కూడా సూచీలను నెల కనిష్ట స్థాయికి లాగాయి. ఇది దాదాపు 2.3 కోట్ల షేర్లను విక్రయించడంతో షేర్​4 శాతానికి పైగా పడిపోయింది. ఇతర ఐటీ షేర్లు ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌‌‌‌సీఎల్ టెక్నాలజీస్ కూడా నష్టాల్లో ముగిశాయి. ఇండస్‌‌‌‌ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, నెస్లే, పవర్ గ్రిడ్, ఐటీసీ, టాటా మోటార్స్,  అల్ట్రాటెక్ సిమెంట్ వెనకబడ్డాయి.

బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్, బజాజ్ ఫిన్‌‌‌‌సర్వ్, టైటాన్, భారతీ ఎయిర్‌‌‌‌టెల్ లాభపడ్డాయి.   ఐటీ ఇండెక్స్ 2.66 శాతం క్షీణించగా, టెక్ 2.36 శాతం, టెలికమ్యూనికేషన్ 1.74 శాతం, సేవలు 1.60 శాతం, యుటిలిటీస్ 1.57 శాతం పడిపోయాయి. బీఎస్‌‌‌‌ఈలో మొత్తం 2,583 స్టాక్‌‌‌‌లు క్షీణించగా, 1,234 పెరిగాయి. 111 మారలేదు. 364 స్టాక్‌‌‌‌లు తమ లోయర్ సర్క్యూట్ పరిమితిని తాకగా, 235 సంస్థలు అప్పర్​ సర్క్యూట్ స్థాయికి చేరుకున్నాయి. ఆసియా మార్కెట్లలో, సియోల్, షాంఘై  హాంకాంగ్ నష్టాల్లో ముగియగా , టోక్యో గ్రీన్‌‌‌‌లో ముగిసింది. యూరోపియన్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. 

సోమవారం వాల్ స్ట్రీట్ సానుకూలంగా ముగిసింది. ఎఫ్‌‌‌‌ఐఐలు సోమవారం రూ. 2,051.09 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌‌‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌‌‌‌కు 0.40 శాతం తగ్గి 86.54 డాలర్లకు చేరుకుంది.​